ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు వరుసగా పెరోల్ ఇవ్వడంపై బీజేపీ మండిపడింది. ఆయనేమైనా అతిథి ఖైదీనా అని ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నాయకుడు కిరీట్ సోమయ్య ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు లేఖ రాశారు. సంజయ్ దత్‌కు ప్రత్యేక మర్యాదలు చేస్తున్నారని, గత 50 ఏళ్లలో శిక్ష పడిన ఏ వ్యక్తికి ఈ విధంగా వరుస పెరోల్‌లు మంజూరు చేయడం ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు.
ఉగ్రవాద కేసుల్లో అరెస్టయిన మిగతా ఖైదీలు కూడా వరుసగా పెరోల్ ఇవ్వాలని అడిగితే ఏమి చేస్తారని ప్రశ్నించారు. కాగా, మార్చి 21 వరకు దత్‌కు పెరోల్‌కు అనుమతి ఇవ్వడంతో మండలి ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే మంగళవారం రాత్రి మండిపడ్డారు. ఎంతో మంది ఖైదీలు పెరోల్ కావాలని దరఖాస్తు చేసుకుంటున్నా తిరస్కరణకు గురవుతున్నాయన్నారు. దత్‌ను మాత్రమే ప్రత్యేకంగా చూడటమే సమాజంలోకి తప్పుడు సంకేతాలను పంపించినట్టవుతుందని తెలిపారు.
దత్ సోదరి ప్రియాదత్ కాంగ్రెస్ ఎంపీ అయినందువల్లే ఆయనకు వరుసగా పెరోల్‌లకు అనుమతి లభిస్తోందనే విషయం సామాన్యులకు కూడా అర్థమైపోతుందన్నారు. 1993 మార్చి ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటడు సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు అయిన సంగతి తెలిసిందే. గత నెలలో కాలేయ సంబంధిత రోగంతో బాధపడుతున్న దత్ భార్య మాన్యతకు ముంబైలోని ఓ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే.
ఇదేమి న్యాయం: ఉద్ధవ్‌ఠాక్రే
సాక్షి, ముంబై: 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు తరచూ పెరోల్ గడువు పొడిగించడంపై శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ఘాటుగా స్పందించారు. ‘మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రజ్ఞాసింగ్, కర్నల్ ప్రసాద్ పురోహిత్‌లపై ఇంతవరకు నేరం రుజువు కాలేదు. కనీసం వీరిపై విచారణ కూడా ప్రారంభం కాలేదు. అయినా వారు గత ఐదేళ్ల నుంచి జైలులోనే మగ్గుతున్నారు. కానీ సంజయ్ దత్‌పై నేరం రుజువయ్యాక యెరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ తరచూ పెరోల్‌పై ఎలా విడుదల చేస్తున్నార’ని పార్టీ అధికార దినపత్రిక సామ్నాలో తీవ్ర విమర్శ లు చేశారు.
నేరస్తుడు నేరస్తుడే, వారిని కులం, మతం అనే భేదంతో చూడవద్దని, న్యాయం అందరికీ సమానంగా జరిగేలా చూడాలని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్‌ను జైలు సూపరింటెండెంట్ నాలుగు పర్యాయాలు పెరోల్‌పై విడుదల చేశారు. ప్రభుత్వం అండలేనిదే జైలు అధికారులు అలా విడుదల చేయడానికి సాహసించరని వ్యాఖ్యానించారు. దత్‌కు ఒక రకమైన న్యాయం, ప్రజ్ఞాసింగ్, పురోహిత్‌లకి మరో రకమైన న్యాయమా..? అని నిలదీశారు. ఇదిలాఉండగా ముస్లిం యువకులను అనవసరంగా వేధించవద్దని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ మండిపడ్డారు. ప్రజ్ఞాసింగ్, పురోహిత్‌ల సంగతేంటి..? వీరి తరఫున వాదించేదెవరూ...? అని ఉద్ధవ్‌ఠాక్రే నిలదీశారు.
నిబంధనల ప్రకారమే పెరోల్: సీఎం
ముంబై: 1993 బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన సంజయ్ దత్‌కు పెరోల్ పొడిగింపును ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సమర్థించారు. అంతా చట్ట ప్రకారం జరిగిందని, ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని చవాన్ బుధవారం మీడియాకు తెలిపారు. దీని వెనుక ఎలాంటి రాజకీయం లేదని వివరించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న భార్య మాన్యతను చూసుకునేందుకు మరో నెల రోజుల పాటు పెరోల్ పొడిగించాలని సంజయ్ దత్ పెట్టుకున్న దరఖాస్తుకు పుణే జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే.
గతేడాది డిసెంబర్ ఆరున పెరోల్‌పై బయటకు వచ్చిన సంజయ్ దత్ భార్య మాన్యత ఆరోగ్యం సరిగా లేదని మరో నెల రోజులు పాటు పెరోల్‌పై బయటే ఉన్నారు. తాజాగా మళ్లీ దత్‌కు పెరోల్ లభించడంపై రాజకీయ విమర్శలు ఎక్కువయ్యాయి. కాగా, యెరవాడ జైలు సూపరింటెండెంట్, పుణే డివిజనల్ కమిషనర్ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని బాంబే హైకోర్టులో మంగళవారం దాఖలు చేసిన పిల్ ఈ నెల 25న విచారణకు రానుంది.
దత్‌పుత్రుడా!
Published Wed, Feb 19 2014 10:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement