మీ పనితీరు మారాలి
అనంతపురం టౌన్ : ‘మీ పనితీరు మారకపోతే ఇబ్బంది పడతారు. నగర, పురపాలక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం లేదు. రెవెన్యూ వసూళ్లు ఆశించి స్థాయిలో లేవు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు కేవలం రెండు నెలలు గడువు ఉంది. వంద శాతం వసూలు లక్ష్యంగా పనిచేయండి. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవంటూ అధికారులను ఆర్డీఎంఏ మురళీకృష్ణగౌడ్ హెచ్చరించారు.
మంగళవారం ఆర్డీఎంఏ కార్యాలయంలో నగర, పురపాలక సంఘాల రెవెన్యూ వసూళ్లు, రెవెన్యూ వృద్ధిపై కంట్రీ టౌన్ ప్లానింగ్ ఆర్జేడీ బాలాజీతో కలిసి అనంతపురం, కర్నూలు జిల్లాల మునిసిపల్ అధికారులతో సమీక్షించారు. ఆదాయం వంద శాతం వసూలు కాకపోతే మునిసిపాలిటీ ఆర్థికంగా ఎలా బలపడతాయని ప్రశ్నించారు. సంస్థలకు వచ్చే ఆదాయాల్లో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో రాబట్టడం లేదన్నారు. ఇలాగైతే కనీస స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కూడా నిధులు ఉండవనే విషయం మీకు తెలియదాని ప్రశ్నించారు.
‘ప్రధానంగా ఆస్తి పన్ను వసూలులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అనంతపురం జిల్లా పరిధిలో ఆస్తి పన్ను వసూలు డిమాండ్ రూ.35.89 కోట్లు ఉంటే రూ.20.44 కోట్లు వసూలయ్యింది. కర్నూలు జిల్లా పరిధిలో రూ.39.43 కోట్లు ఉంటే రూ.19.88 కోట్లు వసూలు అయ్యింది. నీటి చార్జీల వసూలులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోట్ల రూపాయల్లో వసూలవ్వాల్సి ఉంది. మొండి బకాయిలు వసూలుపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ఏటా బకాయిలు చేంతాడులా పెరిగిపోతున్నాయ’ంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘డేంజర్ ఆఫ్ అఫెన్సీవ్ ట్రేడ్ (డీఓటీ) లెసైన్స్ ఫీజు, ప్రకటన పన్ను, ఎన్క్రోచ్మెంట్ ఫీజు, దుకాణాల లీజు, తదితర వాటి ద్వారా వచ్చే రెవెన్యూని పూర్తి స్థాయిలో రాబట్టడం లేదు. వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు. సంస్థలు సొంత ఆదాయాన్ని పెంపొందించుకుని ఆర్థికంగా బలోపేతమై అభివృద్ధి పనులు చేసుకోవాలి.
మార్చి 31 నాటికి ఆస్తి పన్ను వందశాతం వసూలవ్వాలి. పన్నేతర ఆదాయం కూడా వందశాతం వసూలు చేయాలి’ అని ఆదేశించారు. రెవెన్యూ వసూళ్ల విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్గా ఉందని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు ఉంటాయి జాగ్రత్తంటూ హెచ్చరించారు. సమావేశంలో కర్నూలు కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.ఎస్.మూర్తి, అనంతపురం కార్పొరేషన్ కమిషనర్ నాగవేణి, ఇతర మునిసిపాలిటీల కమిషనర్లు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు.