music programme
-
సా ఆర్ ఆర్ ఆర్.. గమ
సరిగమని తప్పుగా రాశాం అనుకోకండి. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సరిగమ అంటూ.. బిజీగా ఉన్నారు చిత్రసంగీత దర్శకుడు కీరవాణి. అందుకే తమాషాగా సాఆర్ ఆర్ ఆర్.. గమ అన్నాం. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయని కీరవాణి తెలిపారు. పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎలాంటి సంగీతాన్ని ప్రేక్షకులకు అందిస్తారో వేచి చూడాలి. ఆలియాభట్, ఓ బ్రిటిష్ మోడల్ హీరోయిన్లుగా నటించనున్నారని టాక్. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. -
మావుళ్లమ్మ సన్నిధిలో పాడటం అదృష్టం
పశ్చిమగోదావరి, భీమవరం (ప్రకాశం చౌక్) : శ్రీమావుళ్లమ్మ అమ్మవారి 55 వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్న నాటకాలు, కూచిపూడి నృత్యాలు, సంగీత విభావరిలు, భజనలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం జరిగింది. ఆలయ అర్చకులు చిన్ని, సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక అమ్మవారి ఉత్సవాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన పంచమ వేద నాట్య నిలయం హైదరాబాద్ వారిచే ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాత్రి 8 గంటలకు సోని ఆర్కెస్ట్రా భీమవరం వారిచే ప్రముఖ సినీనేపథ్య గాయని సమీరా భరద్వాజ్, హనుమాన్లు కాంబినేషన్లో సాగిన సంగీత విభావరి ఎంతో ఆకట్టుకుంది. జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంగీత విభావరి తిలకించారు. అమ్మవారి ఉత్సవాల్లో నేడు : శ్రీమావుళ్లమ్మ అమ్మవారి 55 వార్షికోత్సవాల్లో బుధవారం సాయంత్రం 5 గంటలకు సినీ మ్యూజికల్ నైట్, రాత్రి 8 గంటలకు రెండు రత్నములు నాటకం కార్యక్రమాలు ఉంటాయి.భీమవరం శ్రీమావుళ్లమ్మ వారి సన్నిధికి వచ్చి పాట పాడడం తన అదృష్టమని వర్ధమాన సినీగాయని సమీరా భరద్వాజ్ అన్నారు. భీమవరం వచ్చిన ఆమె మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి: ఇప్పటివరకు ఎన్ని సినిమాలకు ఎన్ని పాటలు పాడారు? సమీరా: 15 సినిమాలకు 20 పాటలు. సాక్షి: మీరు పాడిన మొదటి సినిమా ఎవరు అవకాశం ఇచ్చారు? సమీరా: నేను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వద్ద 6 నెలల పాటు పనిచేశాను. ఆయన బ్రూస్లీ సినిమాలో మొదటి అవకాశం ఇచ్చారు. సాక్షి: మీ స్వస్థలం? ఏం చదువుకున్నారు? సమీరా:విజయవాడ. నాన్న చంద్రశేఖర్ చెన్నై ఐటీసీలో పనిచేస్తారు. మేం చెన్నైలో ఉంటున్నాం. బీకాం చేసి సీఎస్ చేశాను. సాక్షి: గుర్తింపు తెచ్చిన సినిమాలు? పాటలు? సమీరా: సరైనోడు, శతమానం భవతి, అర్జున్‌రెడ్డి తదితర హిట్ చిత్రాల్లో పాడాను. సరైనోడులో తెలుసా.. తెలుసా.. పాటకు టీ ఎస్సార్ అవార్డు, అర్జున్‌రెడ్డిలో మధురమే పాటకు మిర్చి మ్యూజిక్ అవార్డు వచ్చింది. సాక్షి: ఎన్ని కొత్త సినిమాల్లో పాడబోతున్నారు. సమీరా: 5 కొత్త సినిమాలకు పాడుతున్నాను. సాక్షి: సంగీత ప్రావిణ్యం ఉందా? సమీరా:కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. సాక్షి: మీకు ఇష్టమైన సింగర్, మ్యూజిక్ డైరెక్టర్స్? సమీరా:నాకు సింగర్స్ చిత్ర, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కార్తీక్ ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్స్ మణిశర్మ, కిరవాణి అంటే ఇష్టం. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ సత్యసాయి నర్సింగ్ కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. శుక్రవారం సాయంత్రం సత్యసాయిపై కృతజ్ఙతను చాటుతూ నర్సింగ్ కళాశాల విద్యార్థులు సంగీత కచేరి నిర్వహించారు. సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : అనంతపురం సత్యసాయి విద్యాసంస్థల క్యాంపస్ విద్యార్థులు సాయికుల్వంత్ సభా మందిరంలో గురువారం సంగీత కచేరిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలపించిన గీతాలు అందరిలో భక్తిభావాన్ని నింపాయి. అనంతరం బ్రాస్ బ్యాండ్ వాయిద్య కచేరిని కూడా నిర్వహించారు. తర్వాత విద్యార్థినులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకొని నివాళులర్పించారు. -
త్యాగరాజస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం
పాలకొల్లు అర్బన్ : స్థానిక శ్రీత్యాగరాజ గాన సభ ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి జయంత్యుత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. పెదగోపురంలో ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రెడ్డి నరసింహమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఏటా త్యాగరాజస్వామి జయంతోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గాన సభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈరంకి రామకృష్ణ, ద్వీపాల దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాగంగి రమ్య కిరణ్మయి (విశాఖపట్టణం) గాత్ర కచేరీ నిర్వహించారు. వయోలిన్ కొక్కొండ సుబ్రహ్మణ్యం, మృదంగం సరస్వతుల హనుమంతరావు సహకారం అందించారు. ఈవో యర్రంశెట్టి భద్రాజీ, ఎంఎన్వీ సాంబశివరావు పాల్గొన్నారు.