Musical Concert
-
డిసెంబరు 7న హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2024
హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్, గోథే-జెంట్రమ్ హైదరాబాద్‌తో కలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2024 ప్రదర్శన జరగనుంది. ఈ ఫెస్టివల్ హైదరాబాద్‌లోని పబ్లిక్ స్కూల్లో డిసెంబర్ 7, శనివారం సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఇండియా, యూరప్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాండ్లతో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఫెస్టివల్‌కు ప్రవేశం ఉచితమని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ది నేటివ్ జాజ్ క్వార్టెట్‌ను స్పాన్సర్ చేస్తోంది. వివిధ సంస్కృతులకు చెందిన బ్యాండ్ సభ్యులు, ఇతర నిపుణులు పాల్గొంటారు. ముఖ్యంగా డ్రమ్మర్ ఎడ్ లిటిల్‌ఫీల్డ్ లింగిట్ తెగకు చెందిన అలస్కాన్ నేటివ్, ఫిలిపినో-అమెరికన్ పియానిస్ట్ రీయుల్ లుబాగ్ ; జాజ్ ట్రంపెట్ కళాకారుడు నవజో సంతతికి చెందిన డెల్బర్ట్ ఆండర్సన్, వాషింగ్టన్‌లోని సియాటిల్‌కు చెందిన బాసిస్ట్ మైఖేల్ గ్లిన్ పాల్గొంటారు. ఇంకా ఈ ఉత్సవంలో జర్మనీ ,స్విట్జర్లాండ్ నుండి మాల్స్ట్రోమ్తో సహా ప్రదర్శనలు కూడా ఉంటాయి; పోర్చ్‌గీస్ ఆర్టిస్ట్ కాచా ముండిన్హో, ఇద్దరు భారతీయ సంగీతకారులతో పాటు డచ్ కళాకారుడు స్జాహిన్ డ్యూరింగ్ నేతృత్వంలోని బ్యాండ్; హైదరాబాద్‌కు చెందిన జార్జ్ హల్ కలెక్టివ్ కళాకారులు తమ ప్రదర్శన ఇవ్వనున్నారు.వరుసగా ఆరోసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్‌ను కోస్పాన్సర్ చేశామని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. ఈ కచేరీకి U.S. ఆర్ట్స్ ఎన్వోయ్ ప్రోగ్రామ్ కూడా సపోర్ట్ చేస్తోంది. ఉత్తమ అమెరికా కళలను, సంస్కతిని ప్రపంచంతో పంచుకోవడం, క్రాస్-కల్చరల్ అవగాహన , సహకారాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అమెరికన్ ఆర్ట్స్ నిపుణులతో ఇంటరాక్ట్ కావాలనుకునే ఔత్సాహికులకు ఇదొక గొప్ప అవకాశమని నిర్వాహకులు తెలిపారు. -
అల్లు అర్జున్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా ‘మ్యూజికల్ కన్సర్ట్’లో అల్లు అర్జున్ తన తండ్రి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి అంత గొప్పవాడిని కాలేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నా గురించి మా నాన్నగారు, ఆయన గురించి నేను చెప్పుకోవడానికి కొంచెం మొహమాటం మాకు. ప్రేమ, కోపాలను లోపలే దాచుకుంటాం. నన్ను హీరోగా పరిచయం చేసింది నాన్నగారే. నేను చేసిన 20 సినిమాల్లో ఏడో ఎనిమిదో ఆయన తీసినవే.. వాటిలో హిట్స్, ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ ఏనాడూ వేదికపై, ఇంట్లో ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోలేదు.. నా జీవితంలో మొదటి సారి సభాముఖంగా ధన్యవాదాలు చెబుతున్నా.. నాకు కొడుకు పుట్టిన తర్వాత అర్థమైంది.. నేను మా నాన్నఅంత గొప్పవాణ్ణి ఎప్పుడూ అవలేను.. (చెమర్చిన కళ్లతో). ఆయనలో సగం కూడా అవలేను.. థ్యాంక్స్ నాన్నా. అరవింద్‌గారు డబ్బులు తినేస్తారు అంటుంటారు.. ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు.. అందుకే దాదాపు 45 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో, ఇండియాలోనే మంచి నిర్మాతల్లో ఒక్కరిగా ఉన్నారాయన. మా తాతకి (అల్లు రామలింగయ్య) పద్మశ్రీ అవార్డు వచ్చింది. మా నాన్నగారికి కూడా ఆ అవార్డు ఇవ్వాలని, అందుకు ఆయన అర్హుడని ప్రభుత్వాలను కోరుతున్నా’ అని అల్లు అర్జున్ అన్నారు. (భార్య ముందు వచ్చే హీరోయిజంలో చాలా హాయి: అల్లు అర్జున్) -
సెన్సేషనల్ అవుతుందనుకోలేదు: అల్లు అర్జున్
‘‘నాకు చిరంజీవిగారంటే ప్రాణం. ఇక్కడ చాలామంది పవన్ కల్యాణ్ గురించి మాట్లాడమంటున్నారు.. మీకోసం అంటున్నా పవర్‌స్టార్‌గారు.. కానీ, నాకు మాత్రం చిరంజీవిగారంటే ప్రాణం.. ఈ కట్టె కాలేంత వరకూ ఆయన అభిమానినే.. చిరంజీవిగారి తర్వాత నేను అంతగా అభిమానించేది రజనీకాంత్గారినే. ఆయన రోల్ మోడల్’’ అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’. మమత సమర్పణలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మ్యూజికల్ కన్సర్ట్’లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘నా సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది.. నేను ఇవ్వలా.. వచ్చింది. ‘సరైనోడు, దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల తర్వాత సరదాగా ఉన్న కథతో సినిమా చేయాలనుకున్నా. కథలు విన్నా.. నచ్చలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారు, నేను కూర్చుని, కథ అనుకుని తీయడంతోనే ఈ గ్యాప్ వచ్చింది. సినిమా రిలీజ్లో గ్యాప్ ఉంటుంది కానీ, ఉత్సవాల్లో కాదు. మా ఆవిడకి సంగీతమంటే చాలా ఇష్టం.. మ్యూజిక్ బ్యాండ్ కల్చర్ హైదరాబాద్‌లో బాగా పెరిగింది. శనివారం అందరూ వెళుతుంటారు. నేను ఖాళీగా ఉన్న రోజుల్లో మా ఆవిడ నన్ను తీసుకెళ్లింది.. ముందు నచ్చేది కాదు. కానీ, ఖాళీగా ఉన్న రోజుల్లో మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత సేఫ్ (నవ్వుతూ).. అందుకే తనవెంట వెళ్లేవాణ్ణి.. అందరి మ్యూజిక్ బ్యాండ్స్‌లో నా పాట ఉండాలి అని తమన్, త్రివిక్రమ్‌గారితో అన్నాను. నేను ఒట్టేసి చెబుతున్నా ‘సామజ వరగమన...’ పాట ఇంత సెన్సేషనల్ అవుతుందని కలలో కూడా అనుకోలేదు. ఓ రోజు మా ఆవిడ ఇంటికొచ్చి.. ‘ఎక్కడ చూసినా ఈ పాటే ప్లే చేస్తున్నారు.. విసుగొస్తోంది.. పైగా అందరూ నన్ను చూసి పాడుతుండటంతో సిగ్గుతో వచ్చేశా’ అని చెప్పినప్పుడు నాకు అనిపించింది.. ప్రపంచం ముందు వచ్చే హీరోయిజం కన్నా భార్య ముందు వచ్చే హీరోయిజంలో చాలా హాయి ఉంటుందని. అంత గొప్ప పాట రాసిన సీతారామశాస్త్రిగారికి, పాడిన సిద్ శ్రీరామ్‌గారికి, మంచి సంగీతం అందించిన తమన్‌గారికి, వీరి ముగ్గుర్ని బాగా కోఆర్డినేట్ చేసిన త్రివిక్రమ్‌గారికి, ఈ సినిమాలో పాటలు రాసిన వారందరికీ థ్యాంక్స్.నా ‘జులాయి’ సినిమాతో ఆరంభమైన హారికా అండ్ హాసినీ బ్యానర్ ఇంత పెద్ద స్థాయికి వచ్చినందుకు రాధాకృష్ణగారు, వంశీలను అభినందిస్తున్నా. నాకు తెలిసి మూడుసార్లు ఏ డైరెక్టర్‌తోనూ చేయలేదు.. నాకు నా మీద ఉన్న నమ్మకం కంటే నాపై త్రివిక్రమ్‌గారికి ఉన్న నమ్మకం ఎక్కువ.. నాకు హిట్ సినిమాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్.. ఈ సినిమాతో మరో హిట్ ఇవ్వబోయేది కూడా ఆయనే. ఏడాదిన్నరగా ఇంటిలో ఉన్నా నాకు ఈ గ్యాప్ ఒక్క సెకనులా అనిపించిందంటే అది నా అభిమానుల వల్లే.. ఎవరికైనా అభిమానులుంటారు.. నాకు ఆర్మీ ఉంది’’ అల్లు అర్జున్ అన్నారు. పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలోని ప్రతి పాటా ఓ ఆణిముత్యంలా రాశారు రచయితలందరూ. అల్లు అర్జున్ మంచి సంస్కారవంతుడు. ‘సామజ వరగమన..’ పాటని 13కోట్ల మంది విన్నారట. అంటే.. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారూ మనసుతో విన్నారు. ఈ పాటని నేను చాలా కుర్రతనంతో రాశానని చాలా మంది అన్నారు.. నేను కుర్రాణ్ణి కాదు.. అల్లు అర్జున్‌ని అయిపోయానిక్కడ. అంత స్పష్టంగా నాతో పాట రాయించుకున్నాడు త్రివిక్రమ్. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘మేం సపోర్ట్‌గా ఉన్నా ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే నా ఫ్రెండ్ రాధాకృష్ణ కష్టపడటం వల్లే.. త్రివిక్రమ్ మాకు చిన్న కథ చెప్పి ఇంత పెద్ద సినిమా తీశాడు. సినిమా విడుదలకు ముందే హిట్ టాక్ వచ్చింది మీ వల్లే (అభిమానులు). 2019కి నేను వీడ్కోలు చెప్పడానికి తమన్ ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఇచ్చాడు.. 2020కి స్వాగతం పలకడానికి ‘అల వైకుంఠపురములో’ ఇచ్చాడు.. థ్యాంక్యూ తమన్’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బన్నీ డ్యాన్సులతో, తమన్ పాటలతో, త్రివిక్రమ్‌గారు పంచ్‌లతో ఇరగ్గొట్టేస్తారు.. ఇక సినిమా బాగుందని మెగాఫ్యాన్స్ అంటే చాలు.. ఈ సంక్రాంతికి ఇరగ్గొట్టేస్తారు’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘సీతారామశాస్త్రిగారు, తమన్ ఓ మధ్యాహ్నం కూనిరాగం తీసుకుంటూ పాడిన ఒక పాట ఇన్ని కోట్ల మంది హృదయాలను తాకింది. అదే ‘సామజవరగమన..’. తన వయసు నుంచి దిగి సీతారామశాస్త్రిగారు, తన స్థాయి నుంచి ఎక్కి తమన్ ఇద్దరూ కలసి ఈ చిత్రానికి ఈ స్థాయిని తీసుకొచ్చారు. సంగీతాన్ని గౌరవించాలనే మ్యూజికల్ నైట్ ఈవెంట్ పెట్టాం. ‘జులాయి’ అప్పుడు బన్నీ పెళ్లి కాని యువకుడు. ఇప్పుడు ఇద్దరు బిడ్డల తండ్రి. తన తాలూకు మెచ్యూరిటీ ఈ సినిమాలోనూ పెట్టాడు. మేం కన్న కల మీ అందరికీ ఓ జ్ఞాపకం అవ్వాలి. మేం అడిగిందల్లా ఇచ్చారు నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ. సంగీతం అంటే మనసు దురదపెట్టినప్పుడు గోక్కునే దువ్వెన లాంటిది. తల దురద పెడితే గోక్కోవడానికి దువ్వెన ఉంటుంది కానీ మనసు దురద పెడితే కావాల్సింది సంగీతమే. వేటూరి, ఆ తర్వాత సీతారామశాస్త్రిగార్లు ‘వాడు సినిమా వాడురా నుంచి ఆయన సినిమాకు పాటలు రాస్తాడు’ అనే స్థాయిని తీసుకొచ్చిన వ్యక్తులు. ఈ సినిమాకు మొదలు, ముగింపు అల్లు అర్జున్. ఇందులో అల్లు అయాన్, అల్లు అర్హా నటించారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘మీ (ఫ్యాన్స్)లాగా నేను కూడా బన్నీకి పెద్ద అభిమానిని. ఒక అభిమానిగా ఉంటేనే ఇంత బాగా కంపోజ్ చేయగలం. త్రివిక్రమ్‌గారు లేకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసినీ టీమ్ రేయింబవళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డారు’’ అన్నారు. నటి టబు మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చితే నాకు మంచి రీ ఎంట్రీ అవుతుంది’’ అన్నారు. నిర్మాతలు రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, ‘బన్నీ’ వాస్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణచైతన్య, నటులు సునీల్, సముద్ర ఖని, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటీనటులు రోహిణి, సుశాంత్, అల్లు శిరీశ్, డ్రమ్స్ శివమణి, గాయకుడు సిద్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
6న బన్నీ ఫ్యాన్స్‌కు పండగే పండగ
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్-బన్ని కాంబినేషన్లో వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచానాలే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన రెండు చిత్రాలు మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాపై కుడా సాధారణంగానే హైప్ క్రియేట్ అయింది. ఇక ‘సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మా’పాటలతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందు ప్రీరిలీజ్ ఈవెంట్ మాదిరి ఓ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో భారీగా ‘మ్యూజికల్ కాన్సెర్ట్’ ఏర్పాటు చేయనున్నారు. జనవరి 6న యుసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడకను అట్టహాసంగా నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ చరిత్రలోనే అల.. వైకుంఠపురములో మ్యూజికల్ కాన్సెర్ట్ నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేయనున్నారని టాక్. ఈ వేడకకు చిత్రపరిశ్రమకు చెందిన అతిరథమహారథులను ఆహ్వానించాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బన్ని అభిమానులకు సంక్రాంతి ఫెస్టివల్‌కు ముందే మ్యూజికల్ ఫెస్ట్‌తో మైమరిచిపోనున్నారు. టబు, సుశాంత్, నవదీప్, జయరామ్, సముద్రఖని, మురళీ శర్మ, నివేతా పేతురాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: అల్లు అర్జున్ కోసం భారీ ప్లాన్.. -
సంగీత కచేరి
దాదాపు పది సినిమాలకు పైగా సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు అమిత్ త్రివేది. కెరీర్లో తొలినాళ్లలో థియేటర్ మ్యూజిక్ కంపోజర్‌గా పని చేసిన ఆయన ఆ తర్వాత పలు జింగిల్స్, యాడ్ ఫిల్మ్స్ చేశారు. ‘ఆమిర్’ చిత్రంతో పదేళ్ల క్రితం మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రస్థానం స్టార్ట్ చేసి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవ్ డి’ చిత్రానికి జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ‘ఉడాన్, వేకప్ సిడ్, మన్మర్జియాన్’ వంటి బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించిన ఆయన సౌత్‌లో చిరంజీవి నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాకు సంగీత దర్శకునిగా పనిచేస్తున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో అమిత్ త్రివేది సంగీత కచేరీ జరగనుంది. ‘ఇంద్రధనస్సు– అమిత్ త్రివేది లైవ్ కన్సర్ట్’ పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు. -
లండన్‌లో కచేరికి రెడీ
తమిళ సినిమా : యువ సంగీత దర్శకుడు అనిరుద్ లండన్‌లో భారీ సంగీత కచేరీకి రెడీ అవుతున్నారు. సంగీతం, గానం, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ బిజీ బీజీగా ఉన్న ఈ యువ సంగీత దర్శకుడు ప్రస్తుతం కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించనున్న భారీ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా లేడీ సూపర్‌స్టార్ నయనతాన నటిస్తున్న కోలమావు కోకిల చిత్రానికి ఈయనే సంగీతదర్శకుడు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ తొలిసారిగా లండన్‌లో సంగీత కచేరీకి సిద్ధం అవుతున్నారు. జూన్ 16,17 తేదీల్లో అక్కడ బ్రహ్మాండ సంగీత విభావరికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను హంసిని ఎంటర్టైన్మెంట్, హ్యూ బాక్స్ స్డూడియోస్ సంస్థలు చేస్తున్నాయి. ఆ వివరాలను ఈ సంస్థ నిర్వాహకులు గురువారం మీడియాకు విడుదల చేశారు. జూన్ 16న లండన్‌లోని ఎస్ఎస్ఈ వెంబీ ఎరేనా అనే ప్రాతంలో అనిరుద్ సంగీత కచేరి జరగనుందని, అదే విధంగా జూన్ 17న ప్యారిస్ నగరంలోని జెనిత్ అనే ప్రాంతంలో జరగనుందని వెల్లడించారు. వై దిస్ కొలై వెరిడీ పాట ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన అనిరుద్ లండన్‌లో నిర్వహిస్తున్న సంగీత కచేరి ఇదే అవుతుందన్నారు. ఈ కచేరీలో తమిళ సంగీత ప్రియులను అలరించే విధంగా పూర్తిగా తమిళ పాటలనే పాడతారని తెలిపారు. అదే విధంగా ఇంతకు ముందెన్నడూ అనిరుద్ సంగీత విభావరి జరగనంత గ్రాండ్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంగీత విభావరిలో జెనితాగాంధీ లాంటి పలువురు ప్రముఖ గాయనీగాయకులు, సంగీతదర్శకులు పాల్గొననున్నారని చెప్పారు. -
రజనీ లైవ్ పర్ఫామెన్స్ పై రెహమాన్ క్లారిటీ
కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీ ప్రేక్షకులకు ఒక అరుదైన, మధురమైన వేడుక కనువిందు చేయనుందన్న వార్త పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది. స్టైల్ కింగ్ రజనీకాంత్ పంచ్ డైలాగ్‌లు విని ఎంజాయ్ చేస్తున్న ఆయన అభిమానులు తాజాగా ఆయన గానం చేసే అరుదైన దృశ్యాన్ని లైవ్‌లో చూడబోతున్నారు. అదీ ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత సారథ్యంలో. ఇది సినిమా కోసం రజనీకాంత్ పాడే పాట కాదు. వేలాది మంది ప్రేక్షకుల మధ్య ఆయన తన గొంతును సవరించనున్నారనే ప్రచారం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై స్వర సంచలనం ఏఆర్ రెహమాన్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరగబోయే వేడుకలో రజనీ పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఆయన ఆస్టేజీ మీద పాట పాడుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. సంగీత దర్శకుడు 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న రెహమాన్ తన సిల్వర్ జూబ్లీ వేడుకలను పలు నగరాల్లో సంగీత విభావిరుల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23న ఢిల్లీ లో భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. -
నాటా తెలుగుసభల్లో కోటి సంగీత విభావరి
అమెరికాలోని డల్లాస్‌లో నాటా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహాసభల్లో ప్రముఖ సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో సంగీత విభావరిని ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 27, 28, 29 తేదీలలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా నిర్వహించే సంగీత విభావరిలో స్థానిక డల్లాస్ కళాకారులతో పాటు , సినీ సంగీత దర్శకులు, గాయకులు, గాయనీమణులు కూడా పాల్గొంటున్నారు. సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో హేమచంద్ర, సాయిచరణ్, సాయి శిల్ప, శృతి, శివ దినకర్, నూతన మోహన్, నరేంద్ర తదితరులు తమ పాటలను వినిపిస్తారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను సాంస్కృతిక కార్యక్రమాల విభాగం నాయకుడు డాక్టర్ నాగిరెడ్డి దర్గారెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, భవిష్య అద్యక్షుడు రాజేశ్వర్ గంగసాని, మహా సభల కన్వీనర్ డాక్టర్ రమణారెడ్డి గూడూరు, సమన్వయకర్త రామసుర్యా రెడ్డి, కో కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగిరెడ్డి దర్గా రెడ్డి తదితరులు మహాసభల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. -
విజయనగరంలో సినీ సంగీత విభావరి
విజయనగరం: విజయనగరంలోని ఎమ్మార్ లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. గాయని అంజనా సౌమ్య తన గాత్రంతో ఆహుతుల్ని అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జెడ్పీ చైర్మన్ జి.రాజకుమారి, ఎన్ఆర్ఐ డి.ఎస్.జానకి రాం హాజరయ్యారు. గాయని అంజనా సౌమ్యను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. -
జంతర్‌మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ సంగీత విభావరి