Muthyam Reddy
-
ముత్యంరెడ్డి మృతి పట్ల హరీష్‌రావు దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధకరమన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ సమాజం మంచి నాయకున్ని కోల్పోయిందని అన్నారు. గ్రామ సర్పంచ్‌గా, టీటీడీ బోర్డు సభ్యులుగా, ఎమ్మెల్యే, మంత్రిగా ఆయన జిల్లా అభివృద్ధికి చేసిన సేవలు మరిచిపోలేనివని హరీష్ అన్నారు. చివరి దశ వరకు ప్రజా జీవితంలో పరితపించారని, నేటి నాయకులకు ముత్యంరెడ్డి స్ఫూర్తి అని అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో ముత్యంరెడ్డి భౌతిక ఖాయంను సందర్శించిన హరీష్.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత చెరుకు ముత్యంరెడ్డి మృతిపట్ల దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంతాపం తెలిపారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఆయన స్వగ్రామం తొగుట మండలం తుక్కాపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం ముత్యంరెడ్డి గారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత
సాక్షి, దుబ్బాక: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గురించి తెలియని వారుండరంటే అతశయోక్తి కాదు. రాజకీయాల్లో గొప్పనేతగా.. మంత్రిగా.. నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా.. రెండు పర్యాయాలు శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా.. టీటీడీ బోర్డు మెంబర్‌గా వెలుగు వెలిగిన ముత్యంరెడ్డి మరణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ముక్కుసూటి తనం.. అవినీతికి ఆమడ దూరం.. నమ్ముకున్న ప్రజలకు సేవచేయడం.. నిస్వార్థపరుడు.. మంత్రిగా ఉన్నా ఎవసం మరువని గొప్పనేతగా దేశ రాజకీయాల్లోనే ముత్యంరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తరాలుగా కూర్చొని తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకునే ఈ రోజుల్లో సైతం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రిగా పనిచేసినా సాదాసీదాగా జీవితం గడిపాడు. లగ్జరీలకు చాలా దూరంగా ఉన్నాడు. తాను మంత్రిగా ఉన్నా ఆయన భార్య విజయలక్ష్మి ఎప్పుడూ వ్యవసాయ క్షేత్రంలోనే పనిచేస్తూ ఉండేది. తొగుట మండలం తుక్కాపూర్‌లో 1945 జనవరి 1 న బాలమ్మ, బాలకృష్ణారెడ్డిలకు పదమూడో సంతానంలో రెండోవాడు. ముత్యంరెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగాడు. తన రాజకీయ జీవితంలో ఇసుమంతైనా అవినీతి ఎరుగని గొప్పనేత ముత్యంరెడ్డి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఎన్నో ఉన్నత పదవులు అనుభవించినా నయాపైసా అవినీతి ఎరుగని మేలిమి ముత్యంగా రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప పేరు సంపాదించాడు. తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడమే తప్పా తాను ఇతరుల నుంచి నయాపైసా కూడా ఆశించని నిస్వార్థపరుడు. ఎవసం మరువని నేత... ఎమ్మెల్యేగా, మంత్రి పదవులు అనుభవించినా ఏనాడు ఆయన నమ్ముకున్న ఎవసం మరువలేదు. ఆయనకు వ్యవసాయం అంటే ప్రాణం. తొగుట మండలం తుక్కాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో విభిన్న రీతిలో అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ పాడి, గొర్రెల పెంపకం, కూరగాయలతో పాటు రకరకాల పంటలు సాగు చేసి చాలమంది రైతులకు స్ఫూర్తినిచ్చాడు. మంత్రిగా ఉన్న సమయంలో చాల బిజీగా ఉన్నప్పటికీ తొగుటలో ఉన్న సమయంలో ఉదయం నాలుగు గంటలకు లేచి పొలం వద్దకు వెళ్లి పనులు చేసేవాడు. పంటలకు సంబంధించి పలు మెళుకువలు చెప్పేవాడు. ప్రజాసేవకే అంకితం.. తాను తుది శ్వాసవిడిచే వరకు ప్రజాసేవకే అంకితమవుతానని ఎప్పుడూ చెప్పే ముత్యంరెడ్డి, తాను చెప్పినట్లుగానే ప్రజాజీవితంలోనే ఉంటూ తుది శ్వాస విడిచాడు. తన 74 ఏళ్ల జీవన ప్రయాణంలో 55 ఏళ్లు రాజకీయాల్లోనే ఉన్నాడు. ఆయన 1989 లో తొలిసారిగా అప్పటి దొమ్మాట నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 1994, 1999 లో ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ గెలుపు సాధించారు. 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్యంరెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలో ఆహార మంత్రిగా సేవలందించాడు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో చేరి దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశారు. ఆరుగురు ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం దివంగత నేత ముత్యంరెడ్డికి ఆరుగురు ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం ఉంది.. ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డికి చాల అనుబంధం ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా సిద్దిపేట నుంచి కేసీఆర్, దొమ్మాట నుంచి ముత్యం రెడ్డి పనిచేశారు. కేసీఆర్ ముత్యంరెడ్డి ముత్తన్నా అంటూ ఆత్మీయతతో పిలుచుకుంటారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు 2018 నవంబర్‌లో ముత్యంరెడ్డి టీఆర్ఎస్లో చేరారు. క్యాన్సర్‌తో తీవ్ర ఆనారోగ్యంకు గురైన ముత్యంరెడ్డికి కేసీఆర్ అమెరికా పంపించి వైద్యం చేయించారు. ఇద్దరు రైతు బాంధవులు ఒకేరోజు మృతి రైతుల పక్షపాతులు.. రైతు బాంధవులు.. ఎవసం అంటే ప్రాణం అయిన దివంగత మహానేత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 సెప్టెంబర్ 2వ తేదీన మరణించగా, సరిగ్గా పదేళ్ల తర్వాత సెప్టెంబర్ 2 వ తేదీనే ముత్యంరెడ్డి మృతి చెందారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే సాటిలేని ముత్యంరెడ్డి... అభివృద్ధిలో ముత్యంరెడ్డి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాడు. రాష్ట్ర చరిత్రలోనే దుబ్బాక నియోజకవర్గంలో ఐదు మార్కెట్ కమిటీలు దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్, చేగుంటల్లో ఏర్పాటు చేసిన ఘనత ముత్యంరెడ్డిదే. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లు నియోజకవర్గంలో 5, నియోజకవర్గాల్లో 5 టీటీడీ కల్యాణ మండపాలు ఏర్పాటు చేశారు. కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భజలాలు పెంపొందించేందుకు కృషి చేశారు. నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు తారురోడ్లు, దుబ్బాకలో బస్‌డిపో, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత ముత్యంరెడ్డిది.నియోజకవర్గంలో రైతుల సంక్షేమ కోసం చాల పథకాలు చేపట్టడడమే కాకుండా కూరగాయల సాగుపై ప్రధానంగా దృష్టి సారించడమే ప్రత్యేకంగా తొగుట మండలం నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ సెక్రటరియేట్‌కు ప్రత్యేకంగా కూరగాయలు రైతులు అమ్ముకునేందుకు బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. -
ఎమ్మెల్యే ముత్యంరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
ఎమ్మెల్యే ముత్యం రెడ్డి శనివారం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ముత్యంరెడ్డి ప్రయాణిస్తున్న కారు రామాయంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ముత్యం రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించారు. ముత్యంరెడ్డిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. -
సీఎం ముమ్మాటికీ తెలంగాణ వ్యతిరేకి
తొగుట, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి ఆరోపించారు. తొగుట మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ విషయంలో సీంఎ వైఖరి సరిగా లేదన్నారు. ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒకరిద్దరు తెలంగాణ వ్యతిరేకులున్నారని వారిలో ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరన్నారు. తాము తెలంగాణ గడ్డపైనే పుట్టామని తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే స్థితిలో లేమన్నారు. దీనిపై టీఆర్ఎస్ నాయకులు తమపై లేనిపోసి నిందలు మోపుతున్నారన్నారు. ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ నాయకులు పదవులు సంపాదించుకుంటున్నారన్నారు. సర్వే కోసం వస్తే పాతరెయ్యండి ప్రాణహిత- చేవెళ్ల నిర్మాణంలో తొగుట మండలంలోని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున ఎవరైనా అధికారులు సర్వే కోసం వస్తే అక్కడే పాతరెయ్యాలని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రసాభాసగా రచ్చబండ మండల పరిధిలోని గణపురం, తొగుట, గోవర్దనగిరి గ్రామాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే ముత్యంరెడ్డి టీఆర్ఎస్ నాయకులపై చిందులు వేయడమే ఇందుకు కారణమైంది. ఎమ్మెల్యే ముత్యంరెడ్డి టీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో ఆయన శైలిలో మాటలకు పదును పెట్టారు. ఈ క్రమంలో గణపురం గ్రామంలో సర్పంచ్ అక్కం స్వామికి, ఎమ్మెల్యేకు మధ్య మాటామాటా పెరగడంతో తోపులాటకు దారి తీసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని శాంతింపజేశారు. కాగా సర్పంచ్ స్వామి తమపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని ఆరోపించారు. తొగుటలో సొంత పార్టీ సర్పంచ్‌పైనే ఎమ్మెల్యే విరుచుకుపడటంతో ఆ పార్టీలోని విభేదాలు బట్టబయలయ్యాయి. -
సీఎం పైసలిస్తలేడు
సిద్దిపేట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏలు ప్రకటన చేసినప్పట్నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడంలేదని అధికార కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి అన్నారు. సిద్దిపేటలో రూ.33 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(ఈఈ) కార్యాలయ భవనాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావుతో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి మాట్లాడుతూ, తానూ తెలంగాణ గడ్డపై పుట్టిన వాడి నేననీ, తనలోనూ చీమూ నెత్తురున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణకు, టీఆర్ఎస్కు తాను వ్యతిరేకం కాదని ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతోనే జెతైలంగాణ అనిపించిన వ్యక్తినని చెప్పారు. ప్రతిదానికీ దిష్టిబొమ్మల్ని తగులబెట్టడం తగదన్నారు. దుందుడుకుగా వ్యవహరించే వారికి హితవు చెప్పాలని హరీష్‌రావును కోరారు. మండలాల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలుంటేనే అధికారులు సౌకర్యంగా విధులు నిర్వర్తించే వీలుంటుందన్నారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో నీటి పారుదల శాఖే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితేనే పేరుకు తగ్గట్టుగా మెతుకు సీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. టీఎన్జీఓల అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే ఉద్యోగులు మరోసారి ఉద్యమబాట పట్టేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐబీ ఈఈ కేఎన్.ఆనంద్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు ఈఈ గోవిందరావులను ఎమ్మెల్యేలు సత్కరించారు. ఐబీ సిద్దిపేట ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.