సీఎం పైసలిస్తలేడు
Published Thu, Sep 19 2013 1:23 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
సిద్దిపేట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏలు ప్రకటన చేసినప్పట్నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడంలేదని అధికార కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి అన్నారు. సిద్దిపేటలో రూ.33 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(ఈఈ) కార్యాలయ భవనాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావుతో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి మాట్లాడుతూ, తానూ తెలంగాణ గడ్డపై పుట్టిన వాడి నేననీ, తనలోనూ చీమూ నెత్తురున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణకు, టీఆర్‌ఎస్‌కు తాను వ్యతిరేకం కాదని ప్రకటించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతోనే జెతైలంగాణ అనిపించిన వ్యక్తినని చెప్పారు. ప్రతిదానికీ దిష్టిబొమ్మల్ని తగులబెట్టడం తగదన్నారు. దుందుడుకుగా వ్యవహరించే వారికి హితవు చెప్పాలని హరీష్‌రావును కోరారు. మండలాల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలుంటేనే అధికారులు సౌకర్యంగా విధులు నిర్వర్తించే వీలుంటుందన్నారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో నీటి పారుదల శాఖే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితేనే పేరుకు తగ్గట్టుగా మెతుకు సీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. టీఎన్‌జీఓల అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే ఉద్యోగులు మరోసారి ఉద్యమబాట పట్టేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐబీ ఈఈ కేఎన్.ఆనంద్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు ఈఈ గోవిందరావులను ఎమ్మెల్యేలు సత్కరించారు. ఐబీ సిద్దిపేట ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement