నాలుగేళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్నారు!
‘రాజ్ మల్హోత్రా, సిమ్రన్’.. పంతొమ్మిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న యువతరాన్ని ఓ స్థాయిలో ప్రభావితం చేసిన జంట ఇది. ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉండేదంటే.. అబ్బాయిలంతా రాజ్‌గా, అమ్మాయిలంతా సిమ్రన్లా ఫీలైపోయేవారు. ఎటు విన్నా ఈ జంట పాడుకున్న యుగళగీతాలే. ఎక్కడ చూసినా... వీరి ప్రేమ ముచ్చట్లే. ఇంతకీ ఎవరీ రాజ్, సిమ్రన్? అనుకుంటున్నారా! వారెవరో కాదు. షారుక్‌ఖాన్, కాజోల్. ‘దిల్వాలే దుల్హనియా లేజాయింగే’ చిత్రంలో వారు నటించిన పాత్రల పేర్లు అవి.
ఈ పాత్రలతో భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించారు షారుక్, కాజోల్. బాజీగర్, దిల్వాలే..., కుచ్ కుచ్ హోతాహై తదితర చిత్రాలతో భారతీయ ప్రేక్షకులకు ఇష్టమైన జంటగా పేరెన్నికగన్న ఈ జంటకు ప్రత్యేకంగా అభిమానులున్నారంటే... అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రం తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. త్వరలో వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్లు బాలీవుడ్ టాక్.
‘సింగమ్ రిటర్న్స్’ చిత్రం విజయంతో జోరుమీదున్న ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ దర్శకుడు రోహిత్ శెట్టి ఈ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే షారుక్, కాజోల్ ఈ కథ విన్నారని, నటించడానికి పచ్చజెండా ఊపేశారని తెలిసింది. మళ్లీ వీరిద్దరూ కలిసి నటించే ఆ సినిమా... ప్రేక్షకులకు నిజంగా కనుల పండుగే అని చెప్పక తప్పదు.