N. Yuvraj
-
మేమేం చేశాం.. పాపం
సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి అవార్డుల ప్రదానంలో అన్యా యం జరిగింది. అవార్డులు కాదు కదా కనీసం సోమవారం రాత్రి వుడా పార్కు ఆవరణలో జరిగిన అభినందన సభకు ఆహ్వానం కూడా రాలేదు. దీనిపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖతో పాటు దాని అనుబంధ శాఖలైన మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమలు తదితర శాఖలను పూర్తిగా విస్మరించారంటూ ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంగళవారం కలెక్టర్ ఎన్.యువరాజ్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తుపాను సమయంలో కుటుంబాలను పట్టించుకోకుండా ప్రజల కోసం రేయింబవళ్లు శ్రమించామని, అయినా తమను గుర్తించకపోవడం బాధిస్తోందని వారు కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ ఎన్జీవో సంఘ నేతలు చెప్పిన సంఘాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని, తాము కూడా గెజిటెడ్ ఉద్యోగులమేనని వ్యవసాయ శాఖాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో కూడా అవార్డుల ప్రదానంలో ఇదే రీతిలో తమను చిన్నచూపు చూస్తున్నారంటూ వారు వాపోయారు. ఈసారి అన్ని శాఖలను పరిగణనలోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి తగురీతిలో గౌరవిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. -
నగర సుందరీకరణ, పునర్నిర్మాణంపై దృష్టి
విశాఖ రూరల్: నగర సుందరీకరణ, పునర్నిర్మాణ పనులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుపాను సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సోమవారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ నగరంలో కనీసం 2 వేల గృహాలతో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఒక కాలనీని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఐఏవై, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఒక్కో జిల్లాలో రెండు, మూడు మోడల్ కాలనీలు నిర్మిస్తామని వెల్లడించారు. 4జీ కనెక్టవిటీ అన్ని గ్రామాలకు 10 నుంచి 15 ఎంబీపీఎస్ సామర్థ్యంతో అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లు మినహా పారిశ్రామిక, గృహ, వాణిజ్య కనెక్షన్లన్నింటికీ విద్యుత్‌ను పునరుద్ధరించామని ఇందన శాఖ కార్యదర్శి అజేయ్‌జైన్ సీఎంకు వివరించారు. విశాఖలో భూగర్భంలో విద్యుత్ లైన్లు వేసేందుకు రూ.1465 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని తెలిపారు. విశాఖ జిల్లాలో 34,180 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఈ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.49.18 కోట్లు 1.55 లక్షల మంది రైతులకు చెల్లించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ వివరించారు. విశాఖలో మత్స్యకారులకు తగిన పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. స్వల్ప వ్యవధిలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు తోడ్పడిన మూడు జిల్లాల అధికారులను అభినందించారు. సమావేశంలో మంత్రులు సి.హెచ్.అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కిమిడి మృణాళిని, పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెళ్ల కిషోర్‌బాబు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపీలు కె.హరిబాబు, కింజరపు రామ్మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
17న విశాఖకు సీఎం రాక
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17న నగరానికి రానున్నారు. ఉదయం 10-30కు కార్తీక వనమహోత్సవం పేరుతో నిర్వహించనున్న మొక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమై సీఎం పర్యటనపై సమీక్షించారు. ఆ రోజు మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో తుపాను సహాయచర్యలపై సీఎం జిల్లా అధికారులతో సమీక్షిస్తారన్నారు. సాయంత్రం గురుజాడ కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే ఆర్‌కెబీచ్‌లో సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. వుడాపార్కులో వనభోజన కార్యక్రమానికి హాజరుకానున్నారు. తుపానులో సేవలందించిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తారని కలెక్టర్ తెలిపారు. జీవీఎంసీ పరిధిలో 60వేల మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. వార్డుల్లో నాటే మొక్కలకు గుంతలు తవ్వేకార్యక్రమం శుక్రవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. నాటే ప్రతిమొక్కను ఫోటో తీసి జియోట్యాపింగ్ చేస్తామన్నారు. మొక్కల సంరక్షణకు 50వేల ట్రీగార్డులు సేకరిస్తున్నామన్నారు. -
25న విశాఖకు కేంద్రం బృందం రాక
విశాఖపట్నం(సిరిపురం): హుద్‌హుద్ తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ నెల 25న కేంద్ర అధికారుల బృందం జిల్లాకు రానుంది. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ఈ విషయం తెలిపారు. 9మంది సభ్యులు రెండు బృందాలుగా తుపానుప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తారన్నారు. బుధవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. తొలిరోజు తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలు, ఆస్తి నష్టాలకు సంబంధిం చిన ఫోటోల చిత్రప్రదర్శన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బృందం పర్యటించే ప్రాంతాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
మరో గండం
విశాఖ రూరల్: హుదూద్ తుపాను నుంచి తేరుకోకముందే మరో ఉపద్రవం వచ్చేలా ఉంది. అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జిల్లాను వణికిస్తోంది. ఈ నెల 10 లేదా 11 తేదీల్లో తుపాను మారే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. దీని ప్రభావం వల్ల విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. హుదూద్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రానున్న తుపానును ఎదుర్కోడానికి ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. భారీ వర్షాలు తదనంతర పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేయాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. కలెక్టరేట్లో సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ వైర్లెస్ సెట్లను అన్నింటినీ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. జిల్లాలో 12 సెం.మీ., వర్షం త్వరలో రానున్న తుపాను ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో 12 సెం.మీ.కు పైబడి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించింది. జిల్లాలో రిజర్వాయర్లు అన్నింటిలో ఇప్పటికే తగినంత స్థాయిలో నీటి మట్టాలు ఉన్నాయి. భారీ వర్షాలు పడితే జలాశయాల గేట్లు ఎత్తివేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరం అనుకుంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత మండలాల్లోని గ్రామాలకు తగినన్ని నిత్యావసర సరుకులు ముందుగానే రేషన్ డిపోలకు తరలించాలని పౌర సరఫరా అధికారులకు సూచించారు. గర్బిణిలను ముందుగానే వారికి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో ఏఎన్ఎం సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో పవర్‌సాస్, జెసీబీలు, జనరేటర్లు ముందుగానే సమకూర్చుకొవాలని, మండల, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు వారి కేంద్రాల్లోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ డి.వి.రెడ్డి, ఆర్డీఓలు వెంకటమురళి, వసంతరాయుడు, కె.సూర్యారావు, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీపీఓ సుధాకర్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్యామల, డీఎస్ఓ కృష్ణారావు, సివిల్ సప్లయిస్ డీఎం ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యానికి చర్యలు
అరకు రూరల్ : గిరిజన ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్ తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకు ఏరియా ఆస్పత్రిలో వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారానికి ఒకరోజు వైద్య నిపుణులతో కూడిన బృందంతో అరకు ఏరియా ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేసేలా చర్య తీసుకుంటామన్నారు. ఏజెన్సీలో మార్పు ప్రోగ్రాం బాగుందన్నారు. అమృతహస్తం ద్వారా అందుతున్న పౌష్టికాహారం వల్ల మన్యంలో శిశు మరణాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఏజెన్సీలో విధులకు ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే వస్తున్నారని, పీజీలు ముందుకువస్తే బాగుంటుందన్నారు. బాక్సైట్ తవ్వకాలకు తమకు ఎటువంటి సమాచారం రాలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం దీనిపై స్పష్టత రావచ్చన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు గతేడాది మంజూరు కాలేదన్నారు. మొత్తం 45 శాఖలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే గతేడాది నిధులు మంజూరయ్యాయన్నారు. ఇసుక రీచ్‌లకు త్వరలో జిల్లా స్థాయి కమిటీతో చర్చించి, విధి విధానాలు రూపొందిస్తామన్నారు. పెదలబుడు, పద్మాపురం మేజర్ పంచాయతీలకు పద్మాపురం సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయించాలని తహశీల్దార్ జయప్రకాష్‌ను ఆదేశించారు. వైద్య సేవల తీరుపై ఆరా కలెక్టర్ అంతకుముందు స్థానిక ఏరియా ఆస్పత్రి, మాడగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏరియా ఆస్పత్రిలో రోజుకు ఎంతమంది ఓపీకి వస్తున్నారు? ఎందరు ఆస్పత్రిలో చేరుతున్నారు? రోగులకు ఏఏ సేవలు అందుతున్నాయి వంటి వివరాలను కాంట్రాక్టు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో గైనిక్, జనరల్ వార్డులలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మరుగుదొడ్లు పరిశీలించారు. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారిని చూసి ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో ఎన్ని యూనిట్ల రక్తం నిల్వ ఉంచేందుకు అవకాశం ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నర్సులు ఎంతమంది ఉన్నారు, వారికి నివాస గృహాలు (క్వార్టర్లు) ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ల్యాబ్‌లు, చిన్నపిల్లల కేర్ సెంటర్ పరిశీలించారు. వైద్య నిపుణులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని బెడ్లు ఉన్నాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మండలంలోని మాడగడ పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేశారు. 12 గంటల పీహెచ్సీ కావడంతో రాత్రివేళల్లో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పీహెచ్సీలో డాక్టర్ లేకపోవడంతో హాజరు పట్టికలో ఆబ్సెంట్ నమోదు చేశారు. ఏఎన్ఎంలు స్థానికంగా ఉండడం లేదని చెప్పడంతో స్థానికంగా ఏఎన్ఎంలు నివాసం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.