విశాఖ రూరల్: హుదూద్ తుపాను నుంచి తేరుకోకముందే మరో ఉపద్రవం వచ్చేలా ఉంది. అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జిల్లాను వణికిస్తోంది. ఈ నెల 10 లేదా 11 తేదీల్లో తుపాను మారే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. దీని ప్రభావం వల్ల విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. హుదూద్
అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రానున్న తుపానును ఎదుర్కోడానికి ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. భారీ వర్షాలు తదనంతర పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేయాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. కలెక్టరేట్‌లో సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ వైర్‌లెస్ సెట్లను అన్నింటినీ సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
జిల్లాలో 12 సెం.మీ., వర్షం
త్వరలో రానున్న తుపాను ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో 12 సెం.మీ.కు పైబడి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించింది. జిల్లాలో రిజర్వాయర్లు అన్నింటిలో ఇప్పటికే తగినంత స్థాయిలో నీటి మట్టాలు ఉన్నాయి. భారీ వర్షాలు పడితే జలాశయాల గేట్లు ఎత్తివేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరం అనుకుంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత మండలాల్లోని గ్రామాలకు తగినన్ని నిత్యావసర సరుకులు ముందుగానే రేషన్ డిపోలకు తరలించాలని పౌర సరఫరా అధికారులకు సూచించారు. గర్బిణిలను ముందుగానే వారికి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో ఏఎన్‌ఎం సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.
అన్ని మండల కేంద్రాల్లో పవర్‌సాస్, జెసీబీలు, జనరేటర్లు ముందుగానే సమకూర్చుకొవాలని, మండల, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు వారి కేంద్రాల్లోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ డి.వి.రెడ్డి, ఆర్డీఓలు వెంకటమురళి, వసంతరాయుడు, కె.సూర్యారావు, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీపీఓ సుధాకర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్యామల, డీఎస్‌ఓ కృష్ణారావు, సివిల్ సప్లయిస్ డీఎం ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
మరో గండం
Published Wed, Nov 5 2014 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement
Advertisement