17న విశాఖకు సీఎం రాక
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17న నగరానికి రానున్నారు. ఉదయం 10-30కు కార్తీక వనమహోత్సవం పేరుతో నిర్వహించనున్న మొక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై సీఎం పర్యటనపై సమీక్షించారు. ఆ రోజు మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో తుపాను సహాయచర్యలపై సీఎం జిల్లా అధికారులతో సమీక్షిస్తారన్నారు. సాయంత్రం గురుజాడ కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
అలాగే ఆర్‌కెబీచ్‌లో సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. వుడాపార్కులో వనభోజన కార్యక్రమానికి హాజరుకానున్నారు. తుపానులో సేవలందించిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తారని కలెక్టర్ తెలిపారు. జీవీఎంసీ పరిధిలో 60వేల మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. వార్డుల్లో నాటే మొక్కలకు గుంతలు తవ్వేకార్యక్రమం శుక్రవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. నాటే ప్రతిమొక్కను ఫోటో తీసి జియోట్యాపింగ్ చేస్తామన్నారు. మొక్కల సంరక్షణకు 50వేల ట్రీగార్డులు సేకరిస్తున్నామన్నారు.