Naga Sivudu
-
నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు
అద్దంకి, న్యూస్‌లైన్ : ఆర్టీసీ ప్రకాశం రీజియన్ పరిధిలో నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రీజినల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. అద్దంకి ఆర్టీసీ డిపోను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టాలు తగ్గించేందుకు అద్దంకి, మేదరమెట్ల డిపోల పరిధిలో ప్రయాణికులతో రద్దీగా ఉండే భవానీ సెంటర్, బస్టాండ్ సెంటర్, మేదరమెట్ల బస్టాండ్ సెంటర్ల వద్ద కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను నియమించి అక్కడ ఆటోలు తిరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అదే విధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల వేళలను ప్రయాణికులకు తెలియజేయడం, ఆయా సెంటర్ల వద్ద బస్సులను పది నిముషాలపాటు నిలిపి ఉంచి ప్రయాణికులను ఎక్కించడం వంటివి చేయనున్నట్లు చెప్పారు. వారికి తోడుగా ఆర్టీసీ సిబ్బంది ఒకరు అక్కడే ఉంటారని తెలిపారు. అవసరమైతే పోలీసుల సహాయం కూడా తీసుకుంటామన్నారు. ఈ చర్యల్లో భాగంగా రోజుకో ఆర్టీసీ డిపోను తాను సందర్శిస్తానన్నారు. డీజిల్‌ను బయట మార్కెట్లో కొనుగోలు చేయడం వల్ల కూడా ఆర్టీసీకి నష్టం వస్తుందని గుర్తించామన్నారు. ప్రస్తుతం బల్క్ డీజిల్ కొనుగోలు ధర తగ్గడంతో ఇకపై డీజిల్‌ను బల్క్‌గా కొనుగోలు చేసి నష్టాలను తగ్గించేందుకు కృషి చేస్తామని ఆర్ఎం పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త డిపోల ఏర్పాటుకు మళ్లీ ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. పర్సన్ కాస్ట్ పెరగడం వల్ల కూడా నష్టాలు... జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో నష్టాలు రావడానికి పర్సన్ కాస్ట్ పెరగడం కూడా కారణమని ఆర్ఎం తెలిపారు. సీనియర్ కార్మికులకు వేతనాలు, ఇతర బిల్లుల చెల్లింపులు పెరగడం వల్ల పర్సన్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా చూసుకుంటే కిలోమీటర్‌కు 11.67 రూపాయలుగా పర్సన్ కాస్ట్ ఉందన్నారు. అద్దంకి డిపోలో రూ.13.27, ఒంగోలు డిపోలో రూ.14.28, చీరాల డిపోలో రూ.12.75, కందుకూరు డిపోలో రూ.13.67, కనిగిరి డిపోలో రూ.8.82, మార్కాపురం డిపోలో రూ.9.89, పొదిలి డిపోలో రూ.10.40, గిద్దలూరు డిపోలో రూ.10.67గా పర్సన్ కాస్ట్ ఉందని ఆయన వివరించారు. దీనివల్ల కూడా నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. 100 మందికి పోస్టింగ్‌లు... జిల్లాలోని ఆర్టీసీ డిపోలకు కొత్తగా 247 మంది సిబ్బందిని ఎంపిక చేయగా, వారిలో 100 మందికి డ్రైవర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ఆర్ఎం తెలిపారు. మరో 110 మంది శిక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. కండక్టర్లు, డ్రైవర్లకు రోజుకు 8 గంటలకు మించి డ్యూటీ వేయడం లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులకు ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేస్తుండటం వల్ల వారికి మళ్లీ డ్యూటీ వేస్తున్నట్లు చెప్పారు. మొత్తంమీద 8 గంటలే డ్యూటీ వేస్తున్నామన్నారు. అన్ని డిపోల్లో నష్టాలు... జిల్లాలోని 8 డిపోల్లో నష్టాలు వస్తున్నట్లు ఆర్ఎం నాగశివుడు వెల్లడించారు. గత ఏడాది అన్ని డిపోల్లో కలిపి రూ.2.11 కోట్లు, ఈ ఏడాది రూ.2.58 కోట్లు నష్టం వచ్చిందన్నారు. దానికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
ఆర్టీసీలో భద్రతకే పెద్దపీట
ఒంగోలు, న్యూస్‌లైన్: ఆర్టీసీలో భద్రతకే పెద్దపీట వేస్తున్నట్లు రీజినల్ మేనేజర్ వీ నాగశివుడు పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం స్థానిక ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం నుంచి కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆర్ఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రమాదాల శాతం 0.09 కాగా, జిల్లాలో 0.08 శాతం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో ఆర్టీసీ ప్రమాదాలు ఎక్కువ గా బైక్‌లకు సంబంధించి ఉండేవని చెప్పారు. ఒంగోలు ట్రాఫిక్ సీఐ రవిచంద్ర మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలను నడపరాదనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటే ప్రమాదాలు జరగవని పేర్కొన్నారు. ఆర్టీసీలో ప్రమాదాల సంఖ్య తగ్గడంపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ కార్యదర్శి కే నాగేశ్వరరావు, ఎన్ఎంయూ రీజినల్ కార్యదర్శి ఎస్ ప్రసాదరావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజినల్ కార్యదర్శి ఎం అయ్యపురెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ టెక్నో స్కూల్ విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, ఒంగోలు డిపో మేనేజర్ ప్రణీత్‌కుమార్, అసిస్టెంట్ మేనేజర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ రోడ్డు భద్రతా వారోత్సవాల కరపత్రాలను ఆర్టీసీ ఆర్ఎం వీ నాగశివుడు గురువారం ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. ప్రమాదాల శాతం మరింతగా తగ్గాలంటే డ్రైవర్, కండక్టర్లలో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందన్నారు. కరపత్రాలను ఆర్టీసీ డిపోలకు పంపడమే కాకుండా ప్రతి కార్మికునికి అందజే యాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, ఒంగోలు డిపో మేనేజర్ ప్రణీత్‌కుమార్, ఆర్టీసీ బస్‌స్టేషన్ మేనేజర్ ప్రసాదరావు, ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కాల్ సెంటర్‌ను వినియోగించుకోండి ఆర్టీసీ కాల్ సెంటర్ గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులోకి వచ్చిందని ఆర్ఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ కాల్‌సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టూరిస్టు ప్యాకేజీలు, పెళ్లి తదితర కార్యక్రమాలకు బస్సులను అద్దెకు తీసుకునేవారి కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు రకాల సేవలను వినియోగించుకుంటున్నవారు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆర్టీసీ కాల్ సెంటర్ 4030111602కు ఫోన్ చేయాలని సూచించారు. త్వరలోనే గ్రీవెన్స్‌కు కూడా ఈ నంబర్‌ను కేటాయించే అవకాశం ఉందని ఆర్ఎం పేర్కొన్నారు. కాల్ సెంటర్లో నమోదయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాలోని ప్రతి డిపోలో ఇద్దరు సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు.