ఒంగోలు, న్యూస్‌లైన్: ఆర్టీసీలో భద్రతకే పెద్దపీట వేస్తున్నట్లు రీజినల్ మేనేజర్ వీ నాగశివుడు పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం స్థానిక ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం నుంచి కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆర్‌ఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రమాదాల శాతం 0.09 కాగా, జిల్లాలో 0.08 శాతం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో ఆర్టీసీ ప్రమాదాలు ఎక్కువ గా బైక్‌లకు సంబంధించి ఉండేవని చెప్పారు. ఒంగోలు ట్రాఫిక్ సీఐ రవిచంద్ర మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలను నడపరాదనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటే ప్రమాదాలు జరగవని పేర్కొన్నారు. ఆర్టీసీలో ప్రమాదాల సంఖ్య తగ్గడంపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ కార్యదర్శి కే నాగేశ్వరరావు, ఎన్‌ఎంయూ రీజినల్ కార్యదర్శి ఎస్ ప్రసాదరావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజినల్ కార్యదర్శి ఎం అయ్యపురెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ టెక్నో స్కూల్ విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, ఒంగోలు డిపో మేనేజర్ ప్రణీత్‌కుమార్, అసిస్టెంట్ మేనేజర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
రోడ్డు భద్రతా వారోత్సవాల కరపత్రాలను ఆర్టీసీ ఆర్‌ఎం వీ నాగశివుడు గురువారం ఆయన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. ప్రమాదాల శాతం మరింతగా తగ్గాలంటే డ్రైవర్, కండక్టర్లలో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందన్నారు. కరపత్రాలను ఆర్టీసీ డిపోలకు పంపడమే కాకుండా ప్రతి కార్మికునికి అందజే యాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, ఒంగోలు డిపో మేనేజర్ ప్రణీత్‌కుమార్, ఆర్టీసీ బస్‌స్టేషన్ మేనేజర్ ప్రసాదరావు, ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
కాల్ సెంటర్‌ను వినియోగించుకోండి
ఆర్టీసీ కాల్ సెంటర్ గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులోకి వచ్చిందని ఆర్‌ఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ కాల్‌సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టూరిస్టు ప్యాకేజీలు, పెళ్లి తదితర కార్యక్రమాలకు బస్సులను అద్దెకు తీసుకునేవారి కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు రకాల సేవలను వినియోగించుకుంటున్నవారు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆర్టీసీ కాల్ సెంటర్ 4030111602కు ఫోన్ చేయాలని సూచించారు. త్వరలోనే గ్రీవెన్స్‌కు కూడా ఈ నంబర్‌ను కేటాయించే అవకాశం ఉందని ఆర్‌ఎం పేర్కొన్నారు. కాల్ సెంటర్‌లో నమోదయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాలోని ప్రతి డిపోలో ఇద్దరు సూపర్‌వైజర్లను నియమించినట్లు తెలిపారు.
ఆర్టీసీలో భద్రతకే పెద్దపీట
Published Fri, Jan 24 2014 6:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement