Napkin
-
Seher Mir: అమ్మలు మెచ్చిన కూతురు
‘నా కూతురు వయసు కూడా లేదు. ఈ అమ్మాయి నాకు ఏం చెబుతుంది’ అనుకుంది ఒక అమ్మ. అయితే ఆ అమ్మాయి చెప్పిన మంచిమాటలు విన్న తరువాత, ఆ అమ్మ తన దగ్గరకు వచ్చి ‘చల్లగా జీవించు తల్లీ’ అని ఆశీర్వదించింది. నలుగురికి ఉపయోగపడే పనిచేస్తే అపూర్వమైన ఆశీర్వాదబలం దొరుకుతుంది. అది మనల్ని నాలుగు అడుగులు ముందు నడిపిస్తుంది... పుల్వామా (జమ్ము–కశ్మీర్) జిల్లాలోని పంపోర్ ప్రాంతానికి చెందిన పదిహేడు సంవత్సరాల సెహెర్ మీర్ క్లాస్‌రూమ్‌లో పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సమాజాన్ని కూడా చదువుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి తెలుసుకుంది. వాటి గురించి విచారించడం కంటే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. తన ఆలోచనలో భాగంగా మిత్రులతో కలిసి ‘ఝూన్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, శుభ్రమైన న్యాప్కిన్ల వాడకం, రుతుక్రమం, అపోహలు... ఇలా ఎన్నో విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది మీర్. మొదట్లో ‘ఈ చిన్న అమ్మాయి మనకేం చెబుతుందిలే’ అన్నట్లుగా చూశారు చాలామంది. కొందరైతే సమావేశానికి పిలిచినా రాలేదు. ఆతరువాత మాత్రం ఒకరి ద్వారా ఒకరికి మీర్ గురించి తెలిసింది. ‘ఎన్ని మంచి విషయాలు చెబుతుందో’ అని మెచ్చుకున్నారు. నెలసరి విషయాలతో పాటు మానసిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా తన బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది మీర్. కొద్దిమందితో మొదలైన ‘ఝూన్’లో ఇప్పుడు యాభై మందికి పైగా టీనేజర్స్ ఉన్నారు. ‘ఝూన్లో పనిచేయడం ద్వారా నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలను పదిమందికి తెలియజేయడంతో పాటు, రకరకాల గ్రామాలకు వెళ్లడం ద్వారా సామాజిక పరిస్థితులను తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది నుహా మసూద్. ‘తెలిసో తెలియకో రకరకాల కారణాల వల్ల నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్లను కొనకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం, ఇది చాలా రహస్య విషయం, ఎవరికీ తెలియకూడదు అనుకోవడం! ఈ పరిస్థితులలో మెల్లగా మార్పు తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటుంది మీర్. ‘ఝూన్’ ఎన్నో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటిని అందుకోవడానికి చురుగ్గా అడుగులు వేస్తోంది. -
క్రూరంగా చంపి.. ఎట్టకేలకు చిక్కాడు
సుమారు 30 ఏళ్ల క్రితం. 12 ఏళ్ల చిన్నారిని అతిక్రూరంగా హత్యాచారం చేసిన ఘటన టకోమా సిటీని కుదిపేసింది. అయితే చిన్న క్లూ కూడా లభించకపోవటంతో ఆ కేసు అటకెక్కిందని అంతా భావించారు. కానీ, పోలీసులు మాత్రం పట్టువిడవలేదు. అండర్ కవర్ ఏజెంట్ల సాయంతో మూడు దశాబ్దాలుగా దర్యాప్తు జరిపించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. వాషింగ్టన్: 1986, మార్చి 26న మిచెల్లా వెల్చ్ అనే అమ్మాయి తన ఇద్దరు చెల్లెల్లతో కలిసి స్థానికంగా ఉన్న ఓ పార్క్‌లో ఆడుకోటానికి వెళ్లింది. అయితే లంచ్ తీసుకొచ్చేందుకు వెళ్లిన బాలిక.. తిరిగి రాలేదు. కాసేపటికి ఆమె సైకిల్, లంచ్ బాక్స్ కాస్త దూరంలో కనిపించాయి. దీంతో కంగారుపడ్డ ఆ ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అటుపై వారు పోలీసులను ఆశ్రయించగా, డాగ్ స్క్వాడ్ పార్క్‌కు అరకిలోమీటర్ దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించింది. పోస్టుమార్టంలో మిచెల్లా దారుణంగా హత్యాచారానికి గురైనట్లు తేలింది. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అండర్ కవర్ ఏజెంట్లతో... దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో బాధిత కుటుంబం ఆశలు వదిలేసుకుంది. అయితే పోలీసులు మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. అండర్ కవర్ ఏజెంట్ల సాయంతో సుమారు మూడు దశాబ్దాలకు పైగా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తూ వచ్చారు. నిందితుడి డీఎన్ఏ ప్రొఫైల్ నేరస్థుల జాబితాలోని వారితో మ్యాచ్ కాకపోవటంతో తలలు పట్టుకున్నారు. దీంతో కేసును కొన్నాళ్లు హోల్డ్‌లో పెట్టారు. చివరికి 2016లో జన్యుశాస్త్రవేత్త సాయంతో నిందితుల వేటను తిరిగి ప్రారంభించారు. ఇందుకోసం జెనాలజీని ఆశ్రయించారు. జెనాలజీ అంటే వంశవృక్షాన్ని తయారుచేసేందుకు ఉపయోస్తారు.(ఆ డేటా ఇంటర్నెట్లో దొరుకుతుంది కూడా). దీని ద్వారా ఇద్దరు సోదరులను పోలీసులు అనుమానించారు. వారిలో ఒకడైన గ్యారీ హర్ట్‌మన్(66) తాజాగా ఓ రెస్టారెంట్‌కు వెళ్లి నాప్కిన్ను వాడాడు. అక్కడే ఉన్న సీక్రెట్ ఏజెంట్ దానిని సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాడు. అదికాస్త కేసులోని నిందితుడి డీఎన్ఏకు సరితూగటంతో.. గ్యారీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చివరకు మిచెల్లాను అత్యాచారం చేసి, హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించటంతో కోర్టులో ప్రవేశపెట్టారు. హర్టమన్కు కఠిన శిక్ష పడే అవకాశం ఉందని బాధితుల తరపు న్యాయవాది చెబుతున్నారు. మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా పోలీసులు ఈ కేసును ఛేధించగలిగారు. అన్నట్లు జెనటిక్ జెనాలజీ ద్వారానే 70, 80 దశకంలో 50 అత్యాచారాలు, పదుల సంఖ్యలో హత్యలు, దోపిడీలు చేసిన ‘గోల్డెన్ స్టేట్ కిల్లర్’ను ఈ ఏడాది ఏప్రిల్‌లో కాలిఫోర్నియా పోలీసులు అరెస్ట్ చేయటం విశేషం. -
మార్కెట్లోకి చవకైన శానిటరీ నాప్కిన్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియో జన (పీఎంబీజేపీ) పథకంలో భాగంగా రూ. 2.50కే శానిటరీ నాప్కిన్లు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3,600కు పైగా ఉన్న జన ఔషధి కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. సులువుగా మట్టిలో కలిసిపోయేలా వీటిని రూపొందించారు. మార్కెట్లోని ఇతర ప్యాడ్లతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ ధరకు లభ్యమవుతున్నాయని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయ చెప్పారు. మిగతా కంపెనీలూ ధరలు తగ్గించే అవకాశముందని అన్నారు. -
ఇంటిప్స్
మంచినీటిని, వెల్కమ్ డ్రింక్స్‌ని సర్వ్ చేసేటప్పుడు ట్రేలో గ్లాసుల కింద డాలే పేపర్ వేస్తే, అది ఒలికిన ద్రవాలను పీల్చుకుంటుంది. అతిథుల దుస్తుల మీద పడకుండా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద మంచినీటి గ్లాసును గెస్ట్‌కు కుడివైపుగా ఉంచి నీటిని పోయాలి(తర్వాత అతిథి కావాలంటే తనకు సౌకర్యంగా ఉండడానికి ఎడమవైపుకు మార్చుకుంటారు). నీటిగ్లాసు మూడు వంతుల కంటే నింపకూడదు. భోజనం పూర్తయ్యే వరకు మధ్యలో నీటిగ్లాసును గమనిస్తూ ఖాళీ అయిన వెంటనే నింపుతుండాలి. నీటిని పోసేటప్పుడు వాటర్ జగ్గు కింద నాప్కిన్ ఉంచితే నీళ్లు జగ్గు అంచు నుంచి కిందకు కారవు. ఒకరికి నీటిని సర్వ్ చేసిన తర్వాత మరొకరి కోసం హోస్ట్ వారి కుడి పక్కకు వెళ్లాలి. ముందు ఉన్న చోటనే ఉండి మనిషి మీద నుంచి వంగి సర్వ్ చేయకూడదు. కోక్, కాఫీ, టీ, హార్లిక్స్ వంటి నాన్ఆల్కహాలిక్ బేవరేజ్ అయినా కుడివైపు ఉండి సర్వ్ చేయాలి. ఆల్కహాలిక్ బేవరేజ్‌లను ఎడమవైపు సర్వ్ చేయాలి.