గ్రామీణ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సెహెర్ మీర్
‘నా కూతురు వయసు కూడా లేదు. ఈ అమ్మాయి నాకు ఏం చెబుతుంది’ అనుకుంది ఒక అమ్మ. అయితే ఆ అమ్మాయి చెప్పిన మంచిమాటలు విన్న తరువాత, ఆ అమ్మ తన దగ్గరకు వచ్చి ‘చల్లగా జీవించు తల్లీ’ అని ఆశీర్వదించింది. నలుగురికి ఉపయోగపడే పనిచేస్తే అపూర్వమైన ఆశీర్వాదబలం దొరుకుతుంది. అది మనల్ని నాలుగు అడుగులు ముందు నడిపిస్తుంది...
పుల్వామా (జమ్ము–కశ్మీర్) జిల్లాలోని పంపోర్ ప్రాంతానికి చెందిన పదిహేడు సంవత్సరాల సెహెర్ మీర్ క్లాస్‌రూమ్‌లో పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సమాజాన్ని కూడా చదువుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి తెలుసుకుంది. వాటి గురించి విచారించడం కంటే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది.
తన ఆలోచనలో భాగంగా మిత్రులతో కలిసి ‘ఝూన్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, శుభ్రమైన న్యాప్‌కిన్‌ల వాడకం, రుతుక్రమం, అపోహలు... ఇలా ఎన్నో విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది మీర్.
మొదట్లో ‘ఈ చిన్న అమ్మాయి మనకేం చెబుతుందిలే’ అన్నట్లుగా చూశారు చాలామంది. కొందరైతే సమావేశానికి పిలిచినా రాలేదు. ఆతరువాత మాత్రం ఒకరి ద్వారా ఒకరికి మీర్ గురించి తెలిసింది.
‘ఎన్ని మంచి విషయాలు చెబుతుందో’ అని మెచ్చుకున్నారు.
నెలసరి విషయాలతో పాటు మానసిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా తన బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది మీర్.
కొద్దిమందితో మొదలైన ‘ఝూన్’లో ఇప్పుడు యాభై మందికి పైగా టీనేజర్స్ ఉన్నారు.
‘ఝూన్‌లో పనిచేయడం ద్వారా నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలను పదిమందికి తెలియజేయడంతో పాటు, రకరకాల గ్రామాలకు వెళ్లడం ద్వారా సామాజిక పరిస్థితులను తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది నుహా మసూద్.
‘తెలిసో తెలియకో రకరకాల కారణాల వల్ల నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు శానిటరీ న్యాప్‌కిన్‌లను కొనకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం, ఇది చాలా రహస్య విషయం, ఎవరికీ తెలియకూడదు అనుకోవడం! ఈ పరిస్థితులలో మెల్లగా మార్పు తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటుంది మీర్.
‘ఝూన్’ ఎన్నో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటిని అందుకోవడానికి చురుగ్గా అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment