ఆ విషయంలో వైఎస్ జగన్‌కే నా సపోర్ట్: నారాయణమూర్తి
సాక్షి, కరప (కాకినాడ రూరల్): ఇంగ్లిషు మీడియంలో చదువుకుంటున్నవారే ఐఏఎస్, ఐపీఎస్, ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారని, తెలుగుమీడియంలో చదువుకుంటున్న పేదవర్గాల పిల్లలు సెక్యూరిటీ గార్డు, పోలీసు కానిస్టేబుల్ వంటి చిన్పపాటి ఉద్యోగాలకే పరిమితమవుతున్నట్టు సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. కరప మండలం నడకుదురులో వెలమ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికీ సమాన అవకాశం కల్పించినప్పుడే పేదల భవిష్యత్తు బాగుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం బోధన తీసుకువస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే నా సపోర్టు అని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తాను అనుభవించిన, తనకు ఎదురవుతున్న సమస్యలపైనే సినిమాలు తీస్తున్నట్టు ఆయన చెప్పారు. వెనుకబడిన తరగతులవారు ఇంగ్లిషు చదువులు చదవలేక వెనుకబడిపోతున్నారన్నారు. అదే అంశాన్ని తానుతీసిన ఎర్రసైన్యం సినిమాలో చూపించినట్టు గుర్తు చేశారు.
ముందు తరాల కోసమే : మంత్రి కన్నబాబు
రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖల మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ యుద్ధానికి, పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిన వ్యక్తి తాండ్ర పాపారాయుడు అని శ్లాఘించారు. 20 ఏళ్ల క్రితమే నారాయణమూర్తి ఎర్రసైన్యం సినిమా ద్వారా ఇంగ్లిషు మీడియం ఆవశ్యకతను తెలియజేసిన దార్శనికుడన్నారు. ముందుతరాల భవిష్యత్తు బాగుండాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంగ్లిషు మీడియం బోధన తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదన్నారు. ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనబడకుండా పోతే, సినిమాలద్వారా ప్రశ్నిస్తూనే ప్రజల హృదయాల్లో నారాయణమూర్తి నిలిచిపోయాడన్నారు. వెలమసంక్షేమ సంఘం తరఫున నటుడు నారాయణమూర్తిని మంత్రి కన్నబాబు సత్కరించారు. సంఘ ప్రతినిధులు పైలా గోవిందు, పోతల లోవప్రసాద్, చీపురపల్లి జయేంద్రబాబు, ఎడ్ల రామసుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.