National Consumer Disputes Redressal Commission
-
వీర్యం తారుమారు చేసినందుకు రూ.1.5 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యం బదులు మరొకరి వీర్యాన్ని ఎక్కించడమే ఇందుకు కారణం. అసిస్టెట్ రిప్రొడక్టివ్ టెక్నిక్(ఏఆర్టీ) విధానంలో సంతానం కోసం దంపతులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత 2009 జూన్‌లో వారికి కవలలు జని్మంచారు. శిశువులకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా, వారి తండ్రి అతడు కాదని తేలింది. మరొకరి వీర్యంతో వారు జన్మించినట్లు స్పష్టమయ్యింది. మనోవేదనకు గురైన దంపతులు తమకు న్యాయం చేయాలని, రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆసుపత్రిని ఆదేశించాలని కోరుతూ ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ దర్యాప్తు వారికి అనుకూలంగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రిని ఆదేశించింది. ప్రైవేట్ హాస్పిటళ్లలో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్ఏ ప్రొఫైల్‌ను తయారీ చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. -
కుటుంబాన్ని వదిలివెళ్లింది : ఇండిగోకు ఫైన్
న్యూఢిల్లీ : నిర్దేశించిన సమయం కల్లా ప్రయాణికులందర్ని ఎక్కించుకుని టేకాఫ్ అవుతుంటాయి విమానాలు. ఎవరైనా రాకపోతే, ఒకటికి రెండు సార్లు అనౌన్స్మెంట్స్ కూడా చేస్తారు విమాన సిబ్బంది. ప్రయాణికులు కూడా ఎక్కడ విమానం మిస్ అవుతామేమో అని అర్థగంట ముందే బోర్డింగ్ పాస్ తీసుకుని వేచి చూస్తూ ఉంటారు. కానీ ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి సమాచారం లేకుండానే కోల్కత్తా నుంచి అగర్తల వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ టేకాఫ్ అయి వెళ్లిపోయింది. ఎయిర్‌పోర్టులో వేచిచూస్తున్న ఓ ఫ్యామిలీ అలాగే ఆ విమానం కోసం ఎదురుచూస్తూ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. కానీ చివరికి ఆ విమానం వెళ్లిపోయిందని తెలిసి ఆశ్చర్యపోయారు ఆ కుటుంబ సభ్యులు. దీంతో చెప్పాపెట్టకుండా.. విమానం టేకాఫ్ అవడంపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై అపెక్స్ కన్జ్యూమర్ కమిషన్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్‌ల్‌ను ఆశ్రయించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ చేసిన ఈ తప్పిదానికి, కన్జ్యూమర్ కమిషన్ బెంచ్ రూ.61వేల పరిహారం విధించింది. ఇండిగో ఎయిర్‌లైన్ వేసిన రివ్యూ పిటిషన్‌ను సైతం కొట్టివేసింది. బెంచ్‌లో అధ్యక్షుడు జస్టిస్ ఆర్కే అగర్వాల్, సభ్యులు ఎం శిరీష ఉన్నారు. ప్రయాణికులను కాంటాక్ట్ చేయడంలో ఎయిర్‌లైన్ విఫలమైందని బెంచ్ పేర్కొంది. ‘మొబైల్ నెంబర్ ద్వారా ప్రయాణికులను ఇండిగో కాంటాక్ట్ చేయొచ్చు. విమాన టిక్కెట్ బుకింగ్ సమయంలోనే మొబైల్ నెంబర్ ఇవ్వడం తప్పనిసరి. విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికులు మొబైల్ నెంబర్ ఇచ్చారు కూడా. కానీ ఎందుకు వారికి కాల్ చేయలేదు’ అని బెంచ్ ప్రశ్నించింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ చేసిన తప్పిదానికి, తొలుత రూ.41వేల జరిమానా వేసింది. ఆ అనంతరం రివ్యూ పిటిషన్ విచారణ సమయంలో మరో రూ.20వేలను అదనంగా ఫైన్‌గా విధిస్తున్నట్టు కన్జ్యూమర్ కమిషన్ వెల్లడించింది. -
‘వివరాలు ఇవ్వలేదు.. 87 కోట్లు చెల్లించండి’
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ కార్యాలయం విఫలమైనందును నష్టపరిహారంగా రూ.87 కోట్లు చెల్లించాలని ఓ నిరుద్యోగి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 26 ప్రకారం.. వస్తు, సేవల్లో లోపం కారణంగా తనకు జరిగిన నష్టాన్ని బాధితుడు ప్రతిదారు నుంచి పొందొచ్చు. కానీ, ఈ కేసులో ఫిర్యాదుదారు నిరాధార ఆరోపణలు చేశాడని కమిషన్ అభిప్రాయపడింది. వివరాలు.. ఆర్టీఐ కింద తాను కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ విఫలమైందని పంచకులకు చెందిన విజయ్‌కుమార్ ఆరోపించారు. సరైన సమాచారం లభించనందున తాను తీవ్రంగా నష్టపోయినట్టు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ని ఆశ్రయించాడు. నష్టపరిహారంగా 87 కోట్ల రూపాయలు చెల్లించేలా ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్‌ను ఆదేశించాలని దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్.. ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరాడు అనేందుకు విజయ్ వద్ద ఎలాంటి ఫ్రూఫ్ లేదని పేర్కొంది. తప్పుదు ఆధారాలతో కమిషన్‌ను విజయ్ తప్పుదోవ పట్టించాడని మండిపడింది. ఎంతోమందికి సేవలందించాల్సిన కమిషన్ కాలాన్ని వృధా చేశాడని ఆక్షేపించింది. జరిమానాగా విజయ్ రూ.100 చెల్లించాలని కమిషన్ తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా జరిమానా మొత్తం చెల్లించి రశీదు అందించాలని తెలిపింది. ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. -
చైన్ స్నాచింగ్‌పై రైల్వేను నిందించలేం
సాక్షి, న్యూఢిలీ : రైలు కిటికీల గుండా జరిగే చైన్ స్నాచింగ్ వంటి దొంగతనాలకు రైల్వే ఎంతమాత్రం బాధ్యత వహించదని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ (ఎన్సీడీఆర్సీ) స్పష్టం చేసింది. ఆ మేరకు రాజస్థాన్ వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ట్రెయిన్ బయటనుంచి స్నాచింగ్.. 2012లో రాజస్థాన్‌కు చెందిన నందకిశోర్ చెన్నై నుంచి ఢిల్లీకి దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రెయిన్ ఆగింది. కిటికీ పక్కన కూర్చున్న నందకిశోర్ మెడలోని తులం విలువైన బంగారు గొలుసును ఆగంతకుడు ట్రెయిన్ బయటనుంచి తెంచుకుని వెళ్లాడు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులో లేరని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పరిహారం చెల్లింపు.. రైల్వే సంస్థ ప్రయాణికుల రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందునే తాను బంగారు గొలుసు కోల్పోయానని కిశోర్ రాజస్థాన్‌లోని వినియోగదారుల ఫోరంలో పిటిషన్ వేశాడు. ఇరు వర్గాల వాదనలు విన్న ఫోరం చైన్ స్నాచింగ్‌కు రైల్వే సంస్థ బాధ్యత వహించాలని తీర్పునిచ్చింది. బాధితునికి 36 వేల రూపాయలు నష్ట పరిహారంగా చెల్లించాలని రైల్వేను ఆదేశించింది. ఫోరం ఆదేశాల మేరకు రైల్వే సంస్థ కిశోర్‌కు పరిహారం చెల్లించింది. దీనిపై ఎన్‌సీడీఆర్‌సీలో భారతీయ రైల్వే రివ్యూ పిటిషన్ వేసింది. తీర్పు తిరగబడిందిలా.. జస్టిస్ అజిత్ భరిహోకే నేతృత్వంలోని బెంచ్.. దిగువ ఫోరాలు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి తక్కువ మొత్తమే కదా అని పరిహారం చెల్లించవద్దని రైల్వే సంస్థను మందలించింది. ‘రైలు లోపల ప్రయాణించే ప్యాసెంజర్ రక్షణ బాధ్యతలు చూసుకోవడమే రైల్వే విధి. వారి రక్షణ బాద్యతలు చూసుకోవడంలో రైల్వే విఫలమైందన్న వాదనతో మేము ఏకీభవించం. చైన్ స్నాచింగ్ జరిగింది కిటికీ గుండా కాబట్టి దానికి రైల్వే బాధ్యత వహించాల్సిన అవసరం లేదు’ అని బెంచ్ అభిప్రాయ పడింది. రైల్వే సర్వీసుల్లో లోపం కారణంగానే బాధితుడు తన గొలుసు కోల్పోయాడనే రాజస్థాన్ ఫోరం వాదనను తోసిపుచ్చింది. కేవలం రైల్వే సంస్థ రక్షణ చర్యల ద్వారానే ఇలాంటి దొంగతనాలు ఆగవు అని కమీషన్ పేర్కొంది. -
‘సినిమా హాళ్లలో ఉచిత నీరు ఇవ్వాల్సిందే’
న్యూఢిల్లీ: మంచినీరు కనీస అవసరమని, సినిమా హాళ్లలో యాజమాన్యాలు ఉచితంగా మంచినీటిని అందుబాటులో ఉంచాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది. థియేటర్లలో అధిక ధరలు పెట్టి మంచినీటిని కొనుక్కునే స్తోమత అందరికీ ఉండదని ఓ వాజ్యం విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. సినిమాకు వచ్చేవాళ్లలో పిల్లలు, వృద్ధులు కూడా ఉంటారని, 3 గంటలపాటు నీళ్లు లేకుండా ఉండటం వీరికి సాధ్యపడదని, ఇంటి నుంచే తెచ్చుకునే మంచినీళ్లను థియేటర్లలోకి అనుమతించాలని, లేకపోతే ఉచితంగా అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీచేసింది. హాళ్లలోని కేఫెల్లో అధికధరలు పెట్టి మంచినీళ్లు కొనుక్కోవడం మినహా మరోదారిలేని పరిస్థితి కల్పిస్తే, అనుచిత వ్యాపారమార్గాలను అనుసరిస్తున్నట్లుగా పరిగణిస్తామని హెచ్చరించింది.