navarathrotsavalu
-
Dussehra 2024 నవదుర్గా నమోస్తుతే!
నేటినుంచి ఆశ్వీయుజ మాసం ఆరంభం అవుతోంది. ఈ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజులను నవ రాత్రులు అంటారు. నవ రాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని ’శరన్నవరాత్రి ఉత్సవాలు’గా, ’దేవీనవ రాత్రులు’గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈతొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో,వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజులపాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇలా తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు ... సంతాన సౌభాగ్యాలు ... సుఖశాంతులు చేకూరుతాయని పండితులు చెబుతారు. ఇక దేవీ నవరాత్రి పూజలు చేయుట, అనునది అనాది కాలంగా వస్తున్న శాస్త్రవిధి. ‘అశ్వనీ‘ నక్షత్రంలో కలసి వచ్చిన పూర్ణిమమాసమే ‘ఆశ్వీయుజమాసం‘ అవుతుంది. ఈ మాసమందు ’దేవీనవరాత్రుల’ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.∙ప్రథమాశైలపుత్రి,ద్వితీయా బ్రహ్మచారిణీ ∙తృతీయాచంద్రఘంటీతి, ∙కూష్మాండేతి చతుర్థికీ ∙పంచమా స్కందమాతేతి∙షష్టాకాత్యాయనేతి ∙సప్తమా కాళరాత్రిచ ∙అష్టమాచాతి భైరవీ ∙నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ ‘దసరావైభవం‘ ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు నిత్యం శ్రీలలితా సహస్రనామ పారాయణ గావిస్తూ ‘శరన్నవరాత్రులు‘ గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త ’దశమి’ తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు ‘దశహరా‘ అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెబుతారు దైవజ్ఞలు. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తా నక్షత్రంలో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు. అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలనిపెద్దలు చెబుతున్నారు.దుర్గమ్మకు దసరా అలంకారాలు∙స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ( పాడ్యమి) ∙శ్రీ బాల త్రిపుర సుందరి (విదియ) ∙శ్రీ అన్నపూర్ణా దేవి (తదియ) ∙శ్రీ గాయత్రి దేవి (చవితి) ∙శ్రీ లలిత త్రిపుర సుందరి(పంచమి) ∙శ్రీ మహాలక్ష్మి దేవి (షష్టి) ∙శ్రీ సరస్వతి దేవి (సప్తమి) ∙శ్రీ దుర్గాదేవి (అష్టమి) ∙శ్రీ మహిషాసురమర్ధిని దేవి (నవమి) ∙శ్రీ రాజ రాజేశ్వరి దేవి (దశమి) -
నవరత్నాలతో నవశకం
-
దసరా మహోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వనం
-
‘గణ’ వైభవం
ఘనంగా గణనాథునికి స్వాగతం నవరాత్రోత్సవాల్లో సుమారు రూ.30 కోట్ల ఖర్చు అంబరాన్నంటిన పండుగ సంబరాలు ఆదిలాబాద్ : గణనాథునికి జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వేలాది గణపతి మండపాలు వెలిశాయి. నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. చవితి వైభవం జిల్లా అంతటా కనిపిస్తోంది. పండుగకు సుమారు రూ.30 కోట్లకు పైగా జిల్లా ప్రజలు వెచ్చించినట్లు అంచనా. మండపాల ఏర్పాటు, గణనాథుల కొనుగోళ్లు, మిఠాయిలు, బ్యాండ్‌మేళాలు, పూజసామగ్రి, వాహనాల్లో తరలింపు.. ఇలా పండుగను ఖర్చుకు వెనుకాడకుండా జిల్లా ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవరాత్రోత్సవాలు కాంతులీననున్నాయి. పోటాపోటీగా మండపాల ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యికిపైగా భారీ గణనాథులు, గ్రామాల్లో, పట్టణాల్లో మరో వెయ్యి చిన్న గణపతులు మండపాల్లో కొలువుదీరాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్‌పేట్ ప్రతీ ఏడాది నూతి(బావి)పై ఏర్పాటు చేసే గణనాథుడిని అదే స్థలంలో తయారు చేశారు. ఎదురుగా విష్ణుమూర్తి భారీ సెట్టింగ్‌తో, లోపల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని తయారు కోసం రూ.4 లక్షలు వెచ్చించారంటే మండపాల ఏర్పాటులో నిర్వాహకులు ఖర్చుకు వెనుకాడడం లేదని స్పష్టమవుతోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి భారీ గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. మామూలు మండపం నవరాత్రుల ఖర్చు రూ.లక్షకు పైగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన చిన్న, పెద్ద మండపాలన్ని కలిపి వినాయక చవితి కోసం రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వెచ్చించారని స్పష్టమవుతోంది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, భైంసా పట్టణాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటు పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మందమర్రి ప్రాంతాల్లోనూ ఒకరకమైన ఉత్సాహం ఉంటుంది. పండుగ సందడి.. జిల్లా అంతటా సోమవారం వినాయక చవితి సందడి కనిపించింది. ఉదయం నుంచే పట్టణాల్లో ప్రధాన మార్కెట్ ప్రాంతాల్లో వినాయక విగ్రహాల కొనుగోళ్లు, పూజసామాగ్రి, మిఠాయిల కొనుగోళ్లతో సందడి నెలకొంది. ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రెండు టన్నుల మిఠాయిల విక్రయాలు జరిగినట్లు మిఠాయి దుకాణాలు యజమానులు తెలుపుతున్నారు. ఇలా లక్షల రూపాయలు మిఠాయిల కోసమే వెచ్చించారు. పూజసామగ్రి కోసం రూ.2 కోట్ల వరకు వెచ్చించారు. మండపాల ఏర్పాటు, అలంకరణ, గణనాథుని తరలించేందుకు వాహనాల కిరాయి, బ్యాండ్ మేళాల కోసం కోట్లలో నిర్వాహకులు ఖర్చు చేశారు. మండపాలను అందంగా తీర్చిదిద్దారు. వివిధ ఆకృతుల్లో కొలువుదీరిన గణనాథులను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నవరాత్రోత్సవాలు ప్రజలకు సుఖఃసంతోషాలు కలుగాలని కోరుకుంటున్నారు.