నవరంగ్ స్టూడియోలో అగ్నిప్రమాదం
ముంబై : దేశ వాణిజ్య రాజధాని నగరం ముంబైని అగ్నిప్రమాదాలు వీడటం లేదు. కమలా మిల్స్ దుర్ఘటన మరవకముందే తాజాగా దక్షిణ ముంబైలోని పురాతన నవరంగ్ సినిమా స్టూడియోలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఆర్పుతున్న సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది ఒకరు గాయపడ్డారు. కాగా స్టూడియో ఉన్న ఈ భవనం గత 20 ఏళ్లుగా వాడకంలో లేదని, అగ్నిప్రమాదం అయిదో అంతస్తులో జరిగిందని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఆర్ చౌదరి తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. భవనం శిథిలావస్థలో ఉందని, ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
గత 25 రోజుల్లో నగరంలో ఇది ఆరో అగ్ని ప్రమాదం. డిసెంబర్ 18 న ముంబైలోని సకి నాకా-కుర్లా ప్రాంతంలో ఒక చిరుతిండి దుకాణంలో భారీ అగ్ని ప్రమాద ఘటనలో పన్నెండు మంది మృతి చెందారు. అలాగే డిసెంబరు 29 న కమలా మిల్స్ ఆవరణలో పబ్‌లో జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటనలో 14 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. జనవరి 4 న జరిగిన మరొక సంఘటనలో, ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 6న సినీ విస్తా స్టూడియో ప్రమాదంలో టెలివిజన్ సీరియల్ ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన ఓ వ్యక్తి(20) చనిపోయిన విషయం తెలిసిందే.
ఇటీవల కాలంలో ముంబైలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. భవనాలు నిర్మించే సమయంలో సరైన అగ్ని ప్రమాద నివారణ చర్యలను తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విద్యుత్ పరికరాల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వల్ల దేశంలో ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో ముంబై రెండో స్థానంలో నిలిచింది.