new uniform
-
ఎయిర్ ఇండియా ఉద్యోగులకు కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బందికి త్వరలో కొత్త యూనిఫాం రానుంది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యూనిఫామ్స్‌ను డిజైన్ చేయనున్నారు. 10,000లకుపైగా ఉన్న ఫ్లయిట్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ ఉద్యోగులు 2023 చివరినాటికి నూతన డ్రెస్‌లో దర్శనమీయనున్నారు. ఎయిర్ ఇండియాలో కొనసాగుతున్న ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఇది మరో అడుగు అని సంస్థ తెలిపింది. -
Army Day 2022: ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫాం ఇదే!
న్యూఢిల్లీ: మన ఆర్మీ యూనీఫాం మారబోతోంది. సౌకర్యవంతమైన, వాతావరణ అనుకూలమైన, డిజిటల్ డిస్రప్టీవ్ ప్యాట్రన్‌లో కొత్త యూనీఫాంను ఇండియన్ ఆర్మీ శనివారం ఆవిష్కరించింది. కొత్త యూనీఫాంలను ధరించిన ప్యారాచూట్ సైనిక దళం నిన్న (శనివారం) ఆర్మీ డే పరేడ్‌లో పాల్గొన్నారు. భారత ఆర్మీ కొత్త యూనీఫాం రూపురేఖల విశేషాలు ఇవే.. ►ఆలివ్, మట్టి రంగులతో సహా వివిధ రంగుల సమ్మేళనంతో రూపొందించిన కొత్త యూనిఫాం, దళాల వ్యూహరచన ప్రాంతాలు, వివిధ వాతావరణ పరిస్థితులు వంటి అంశాల దృష్ట్యా రూపొందించడం జరిగింది. ►నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి వివిధ దేశాల ఆర్మీల యూనిఫాంలను విశ్లేషించిన అనంతరం కొత్త యూనిఫాంలను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ►ఈ యూనిఫాం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, అన్ని రకాల వాతావరణాల్లో ధరించవచ్చని తెలిపారు. కంప్యూటర్ సహాయంతో డిజిటల్ డిస్రప్టివ్ ప్యాటర్న్‌లో ప్రత్యేకంగా రూపొందించారు. ►కొత్త యూనిఫాంలోని షర్టును, ట్రౌజర్‌లో టక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇకపై మన ఆర్మీ డ్రెస్ ఇన్‌షర్ట్ లేకుండా ఉండబోతుందన్నమాట. ►కొత్త ఆర్మీ యూనిఫామ్‌లు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండవని సంబంధిత వర్గాలు తెలిపాయి. #WATCH | Delhi: Indian Army’s Parachute Regiment commandos marching during the Army Day Parade in the new digital combat uniform of the Indian Army. This is the first time that the uniform has been unveiled in public. pic.twitter.com/j9D18kNP8B — ANI (@ANI) January 15, 2022 -
యుద్ధ క్షేత్రాల్లో ఆర్మీకి కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: యుద్ధక్షేత్రాల్లో సైనిక బలగాలకు మరింత తేలికైన, మన్నికైన యూనిఫాం సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి భారత ఆర్మీకి ఈ కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండేలా దీనిని తయారుచేశారు. మంచు, అటవీ ప్రాంతాల పరిసరాల రంగుల్లో కలిసిపోయేలా ఉండే రంగులను యూనిఫామ్ కోసం ఎంపికచేశారు. బలగాలను కాస్త దూరం నుంచి చూస్తే పసిగట్టకుండా ఉండేందుకు ఆయా రంగుల్లో డిజైన్‌ను ఎంపికచేశారు. ఆలివ్, మృణ్మయ రంగుల కలబోతగా ‘డిజిటల్ డిస్ట్రర్బ్’ డిజైన్‌లో ఈ యూనిఫామ్‌ను రూపొందించారు. వచ్చే ఏడాది జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్‌లో తొలిసారిగా అధికారికంగా దీనిని ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సైనికులకు యుద్ధక్షేత్రాల్లో వినియోగిస్తున్న వేర్వేరు డిజైన్ల ఆర్మీ యూనిఫామ్‌లను పరిశీలించి, పలు చర్చల అనంతరం ఈ యూనిఫామ్‌కు తుదిరూపునిచ్చారు. -
దసరా నుంచి ఆర్ఎస్ఎస్కు కొత్త డ్రస్
ఆర్ఎస్ఎస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది..తెల్ల చొక్కా, ఖాకీ నిక్కరు. సంఘ్ ఏర్పడిన 90 ఏళ్ల నుంచి కొనసాగుతున్న డ్రస్ కోడ్ ఇదే. కానీ ప్రస్తుతం ఖాకీ నిక్కర్లకు స్వస్తి చెప్పి, కొత్త డ్రస్ కోడ్‌ను అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నిర్ణయించింది. విజయదశమి పురస్కరించుకుని అక్టోబర్ 11 నుంచి కొత్త డ్రస్‌ను అమల్లోకి తేవాలని ముహుర్తం ఖరారు చేసింది. ఖాకీ నిక్కర్లను స్థానంలో ముదురు గోధుమ వర్ణపు ప్యాంటులను ప్రవేశపెడుతున్నట్టు ఆర్ఎస్ఎస్ తెలిపింది. ఇప్పటికే నాగపూర్ ప్రాంతాల్లో అధికారికంగా కొత్త డ్రస్ విక్రయాలను చేపట్టింది. జంట ప్యాంటులను రూ.250లకు స్వయం సేవక్స్కు ఆర్ఎస్ఎస్ విక్రయించనుంది. అదనంగా రెండు అంగుళాలు పెంచడానికి స్వయంసేవక్స్ మరో 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్యాంటులను ఆర్ఎస్ఎస్సే స్వతహాగా కుట్టించి, స్వయంసేవక్‌లకు పంపిణీ చేయనుందట., మార్చిలోనే ఖాకీ నిక్కర్ల స్థానంలో కొత్త డ్రస్‌ను అమల్లోకి తేనున్నట్టు ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ అత్యున్నత నిర్ణయ సంస్థ అఖిల్ భారతీయ ప్రతినిధి సభ, వార్షిక మీటింగ్‌లో ఆర్ఎస్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఖాకీ నిక్కర్లు ధరిస్తే తమపై కామెంట్లు చేస్తున్నారని యువత వాపోతున్న వాదనతో నిక్కర్లకు స్వస్తి చెప్పాలని ఆర్ఎస్ఎస్ భావించింది. యువకులు పెద్ద ఎత్తున రిక్రూట్ అవుతుండటంతో వారిని ఆకట్టుకునేలా నిక్కరు స్థానంలో ప్యాంటులను ప్రవేశపెట్టాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. -
చిరుగు పాతలే!
విద్యార్థులకు అందని కొత్త యూనిఫాం 2013లో ఇచ్చినవే గతి చాలీచాలని, చిరిగిన దుస్తులతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులు విద్యా శాఖ మంత్రి సొంత జిల్లాలోనూ పరిస్థితి దయనీయం బుచ్చెయ్యపేట: ఉన్నత లక్ష్యంతో ప్రవేశ పెట్టిన విధానాలకు పాలకులే తూట్లు పొడుస్తున్నారు. ఫలితంగా లక్ష్యం నీరుగారుతోంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులంతా ఆర్థిక, కులమతాలకు తావులేకుండా సమానంగా ఉండాలనే సంకల్పంతో అమలు చేస్తున్న ఏకరూప దుస్తులు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షాత్తూ మానవ వనరులు, విద్యా శాఖ మంత్రి సొంత జిల్లాలోనే విద్యార్థులకు ఇంతవరకూ యూనిఫారం అందని పరిస్థితి ఉందంటే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రభుత్వం ఎంత చిన్నచూపు చూస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. కొత్త యూనిఫారాలు అందక పాత చిరిగిన దుస్తులు, సివిల్ దుస్తులు వేసుకుని వస్తున్న విద్యార్థులు చదువుపై దృష్టిసారించలేక పోతున్నారు. మండలంలోని 32 పం చాయతీల్లో 47 ప్రాథమిక, పది ప్రాథమికోన్నత, ఎనిమిది హైస్కూళ్లు ఉన్నా యి. వీటిలో 7320 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందిన వారే. వీరందరికీ ఏడాదికి రెండు జతల యూనిఫాం ప్రభుత్వం అందించాల్సి ఉంది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే యూనిఫారాలు అందజేయాల్సి ఉన్నా మండలంలో ఇంతవరకు అసలు క్లాత్ కూడా సరఫరా కాలేదు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా బట్టలు ఇవ్వకపోతే ఎలా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 2013 ఆగస్టు నెలలో ఇచ్చిన దుస్తులనే ఇప్పటికీ విద్యార్థులు వేసుకుంటున్నారు. పలువురు విద్యార్థులకు గత ఏడాది ఇచ్చిన యూనిఫాం సరిపోవడం లేదు. మరి కొంత మంది చిరిగిన దుస్తులే వేసుకుని వస్తున్నారు. బొత్తాయిలు ఊడిపోయి కుట్టికోవడానికి వీలుకాక, చిరిగిపోయిన బట్టలు, నలిగిన బట్టలతో పాఠశాలకు వస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు చిరిగి పోయిన బట్టలు వేసికొని పాఠశాలకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఫ్యాంట్లు, చొక్కాలకు పిన్నులు పెట్టుకుని పాఠశాలకు వస్తున్నారు. యూనిఫాం లేకుండా వస్తే ఉపాధ్యాయులు బయట నిలబెట్టడం, గుంజీలు తీయించడం వంటి చర్యలు తీసుకోవడంతో చిరిగిన దుస్తులతోనే కొంత మంది పాఠశాలకు వస్తుండగా.. మరి కొంత మంది సిగ్గుతో ఎగనామమం పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూనిఫాం అందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంకా రాలేదు యూనిఫాం ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే పాఠశాలలకు పంపిణీచేస్తాం. కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. యూనిఫాం లేని విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు సూచిస్తాం. సాధ్యమైనంత వరకు విద్యార్థులు ఉన్న యూనిఫాం వేసుకుని రావాలి. బి.త్రినాథరావు, ఎంఈవో, బుచ్చెయ్యపేట