విద్యార్థులకు అందని కొత్త యూనిఫాం
2013లో ఇచ్చినవే గతి
చాలీచాలని, చిరిగిన దుస్తులతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులు
విద్యా శాఖ మంత్రి సొంత జిల్లాలోనూ పరిస్థితి దయనీయం
బుచ్చెయ్యపేట: ఉన్నత లక్ష్యంతో ప్రవేశ పెట్టిన విధానాలకు పాలకులే తూట్లు పొడుస్తున్నారు. ఫలితంగా లక్ష్యం నీరుగారుతోంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులంతా ఆర్థిక, కులమతాలకు తావులేకుండా సమానంగా ఉండాలనే సంకల్పంతో అమలు చేస్తున్న ఏకరూప దుస్తులు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షాత్తూ మానవ వనరులు, విద్యా శాఖ మంత్రి సొంత జిల్లాలోనే విద్యార్థులకు ఇంతవరకూ యూనిఫారం అందని పరిస్థితి ఉందంటే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రభుత్వం ఎంత చిన్నచూపు చూస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. కొత్త యూనిఫారాలు అందక పాత చిరిగిన దుస్తులు, సివిల్ దుస్తులు వేసుకుని వస్తున్న విద్యార్థులు చదువుపై దృష్టిసారించలేక పోతున్నారు. మండలంలోని 32 పం చాయతీల్లో 47 ప్రాథమిక, పది ప్రాథమికోన్నత, ఎనిమిది హైస్కూళ్లు ఉన్నా యి. వీటిలో 7320 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందిన వారే. వీరందరికీ ఏడాదికి రెండు జతల యూనిఫాం ప్రభుత్వం అందించాల్సి ఉంది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే యూనిఫారాలు అందజేయాల్సి ఉన్నా మండలంలో ఇంతవరకు అసలు క్లాత్ కూడా సరఫరా కాలేదు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా బట్టలు ఇవ్వకపోతే ఎలా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 2013 ఆగస్టు నెలలో ఇచ్చిన దుస్తులనే ఇప్పటికీ విద్యార్థులు వేసుకుంటున్నారు. పలువురు విద్యార్థులకు గత ఏడాది ఇచ్చిన యూనిఫాం సరిపోవడం లేదు. మరి కొంత మంది చిరిగిన దుస్తులే వేసుకుని వస్తున్నారు. బొత్తాయిలు ఊడిపోయి కుట్టికోవడానికి వీలుకాక, చిరిగిపోయిన బట్టలు, నలిగిన బట్టలతో పాఠశాలకు వస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు చిరిగి పోయిన బట్టలు వేసికొని పాఠశాలకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఫ్యాంట్లు, చొక్కాలకు పిన్నులు పెట్టుకుని పాఠశాలకు వస్తున్నారు. యూనిఫాం లేకుండా వస్తే ఉపాధ్యాయులు బయట నిలబెట్టడం, గుంజీలు తీయించడం వంటి చర్యలు తీసుకోవడంతో చిరిగిన దుస్తులతోనే కొంత మంది పాఠశాలకు వస్తుండగా.. మరి కొంత మంది సిగ్గుతో ఎగనామమం పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూనిఫాం అందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇంకా రాలేదు
యూనిఫాం ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే పాఠశాలలకు పంపిణీచేస్తాం. కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. యూనిఫాం లేని విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు సూచిస్తాం. సాధ్యమైనంత వరకు విద్యార్థులు ఉన్న యూనిఫాం వేసుకుని రావాలి. బి.త్రినాథరావు, ఎంఈవో, బుచ్చెయ్యపేట
చిరుగు పాతలే!
Published Sun, Mar 1 2015 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement