Nizamabad.
-
ఎట్టకేలకు ‘రూట్’ క్లియర్
సాక్షి, హైదరాబాద్: వివాదాలు.. ఉద్యమాలు.. వ్యతిరేకతలతో ఒక్క అడుగు కూడా ముందుకు పడ కుండా పోయిన ఓ జాతీయ రహదారి కథ కొలిక్కి వచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఇది రాష్ట్రంలో మరో ఎక్స్‌ప్రెస్ వే తరహాలో పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా రూపుదిద్దుకోబోతోంది. 131.8 కి.మీ. మేర నిర్మించే నాలుగు వరసల రహదారిలో 46 వంతెనలతో పాటు ఆర్ఓబీలు, అండర్‌పాస్‌లు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతుండటంతో.. నిజామాబాద్– ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ ఎన్‌హెచ్ 63పై ట్రక్కులు ఎక్కువగా తిరుగుతుంటాయి. రెండు లేన్లతో ఇరుగ్గా ఉన్న రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారటంతో 4 వరసలకు విస్తరించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. ఇందులో నిజామాబాద్ నుంచి ఆర్మూరు శివారులోని హైవే 44 వరకు, తిరిగి మంచిర్యాల దాటిన తర్వాత ఉండే హైవే 363 నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు చెన్నూరు వరకు.. రాష్ట్రప్రభుత్వ ఆదీనంలోని హైవేల విభాగం విస్తరిస్తుంది. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు కీలక నిర్మాణం అయినందున దాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించారు. రాష్ట్ర విభాగం ఇప్పటికే ఆ రోడ్డును అవసరమైన ప్రాంతాల్లో 4 వరసలుగా మార్చడం, మిగతా చోట్ల మెరుగుపరచటం చేస్తోంది. అయితే ఎన్హెచ్ఏఐకి అప్పగించిన ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు పట్ణణాలు, గ్రామాల మీదుగా సాగుతున్నందున దాన్ని పూర్తి గ్రీన్‌ఫీల్డ్ హైవేగా మార్చాలని భావించారు. కానీ అందుకు భారీ మొత్తంలో సాగు భూములు సేకరించాల్సి రావటంతో రైతులు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఉన్న రోడ్డునే విస్తరించాలని భావించారు. కానీ, పట్టణాలు, గ్రామాల్లో భారీగా నిర్మాణాలను తొలగించాల్సి రావటంతో ఈసారి పట్టణ, గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. చివరకు పట్టణాలు, గ్రామాలున్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగతా రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. గత నెల్లో టెండర్లు పిలవగా, ఇప్పుడు వాటిని ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్డు నిర్మాణంపై బుధవారం ఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. రోడ్డు డిజైన్, ఎలివేటెడ్ కారిడార్ నమూనాలు, రహదారులను క్రాస్ చేసేందుకు వీలుగు చేయాల్సిన ఏర్పాట్లు తదితరాలపై చర్చించారు. నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుని త్వరలో పనులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. నో డైరెక్ట్ క్రాసింగ్: ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేటల మీదు గా సాగుతుంది. ఈ మార్గంలో 100 కి.మీ.ల మేర బైపాస్‌లే ఉండనున్నందున ఈ రోడ్డు దాదాపు కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే తరహాలోనే ఉండనుంది. ఆయా పట్టణాల వద్ద 6 కి.మీ. నుంచి 12 కి.మీ. మేర భారీ బైపాస్‌లు ఉంటాయి. ఇవి కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లు నిర్మిస్తారు. ఇది పూర్తి యాక్సె స్ కంట్రోల్డ్ రహదారి (ఇతర రోడ్లు దీన్ని నేరుగా క్రాస్ చేయడానికి అవకాశం ఉండదు) కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తారు. బైపాస్‌ల కోసం 500 హెక్టార్ల భూమిని సేకరించారు. దీనికే రూ.900 కోట్లుఖర్చవుతోంది. ఇక వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్ఓబీలు దాదాపు 46 వరకు ఉంటాయి. -
స్వేదపత్రం పేరుతో కేటీఆర్‌వి పిల్ల చేష్టలు: షబ్బీర్ అలీ
సాక్షి, నిజామాబాద్: స్వేద పత్రం పేరుతో కేటీఆర్ పిల్ల చేష్టలు చేశారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అధికారుల నుంచి వివరాలు సేకరించి శ్వేత పత్రం విడుదల చేసిందని.. ప్రభుత్వ శ్వేత పత్రం తప్పు అని బీఆర్ఎస్ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. దమ్ముంటే కేటీఆర్ తప్పులు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందని వివరించారు.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ఉంటే పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 100 మందికి ఓ కౌంటర్ పెట్టి దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందన్నారు. మీ సేవ కేంద్రాల్లో గంటల తరబడి క్యు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇదీ చదవండి: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. -
బాండ్ పేపర్లతో డ్రామాలా?.. కాంగ్రెసోళ్లను నమ్మొద్దు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్లతో డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నాయకులకు బాండ్ పేపర్లు రాసిచ్చే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. ‘‘కర్ణాటకలో ఇలాగే బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పారు. పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు దిగజారి మోసం చేస్తారు. కర్ణాటకలో సంతకాలు చేసి 100 రోజులు అవుతున్నా ఒక్క కార్యక్రమం కూడా మొదలు పెట్టలేదు. మోదీ అధికారంలో ఉన్న కేంద్రంలో 13 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. తెలంగాణకు వచ్చి యువతతో సమావేశాలు నిర్వహించి రెచ్చ గొడుతున్నారు’’ అంటూ కవిత మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ మొసలి కన్నీళ్లకు బలైతే ఐదేళ్లు బాధ పడతారు.11 సార్లు పాలించిన కాంగ్రెస్ పాలనలో కరెంట్ సరిగ్గా లేదు. 9 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చాం. 50 ఏళ్లలో 41 రిజర్వాయర్లు నిర్మిస్తే 9 ఏళ్లలో 107 రిజర్వాయర్లు బీఆర్ఎస్ హయాంలో నిర్మించాం’’ అని కవిత పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్ ‘బాండ్ పేపర్లు’ -
‘తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. బీసీల ప్రభుత్వం’
సాక్షి, నిజామాబాద్: డిసెంబర్ 3న తెలంగాణలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్‌లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తాలు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని.. బీసీల ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. గీత కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించండి. గీత కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ తోడు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో డి.శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి లాంటి పెద్ద నేతలు పని చేసినా నిజామాబాద్‌లో ఒకే ఒక బీసీ హాస్టల్ ఉండేదని, తాము వచ్చాక 15 హాస్టళ్లు, బీసీ గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. నిజామాబాద్‌లో గణేష్ గుప్తాను గెలిపించాలని కవిత కోరారు. చదవండి: హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్.. -
పిల్లల గొడవ.. కుటుంబ బహిష్కరణకు దారి తీసింది..
సిరికొండలోని గడ్కోల్‌లో చిన్నపిల్లల మధ్య గొడవ కాస్త ఓ కుటుంబం బహిష్కరణకు దారి తీసింది. చిన్నారుల గొడవ కారణంగా ఇద్దరి మహిళల మధ్య వాగ్వాదం జరిగి వారు మొదట సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయగా తగాదా కోర్టుకు చేరింది. కోర్టులో ఓ మహిళ కుటుంబానికి న్యాయస్థానం ఫైన్ వేయగా వారు కట్టేశారు. అయితే కుల సంఘంలోకి సదరు మహిళ కుటుంబం రావాలంటే ఆల్ కమిటీ(వీడీసీ)కి రూ. లక్ష చెల్లించాలని తీర్మానించారు. కోర్టుకు వెళ్లి జరిమానా కట్టామని మళ్లీ మీకు ఎందుకు కట్టాలని వారు ఆల్ కమిటీ(వీడీసీ)ని ప్రశ్నించారు. దీంతో ఈ కుటుంబాన్ని ఇప్పటివరకు కులసంఘానికి సంబంధించిన ఏ కార్యక్రమాలకు పిలవట్లేదు. మాట్లాడట్లేదు. చివరికి ఆల్‌కమిటీ(వీడీసీ) చేసిన నిర్వాకంపై శుక్రవారం బాధిత కుటుంబం ఏసీపీ కిరణ్‌కుమార్‌ను ఆశ్రయించింది. -
సాక్షి ఎఫెక్ట్: రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగింది?
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఆసుపత్రిలో స్ట్రెచర్లు లేక రోగి కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటనపై సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనానికి ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు వద్ద ఓకే చోట 10 నుంచి 16 స్ట్రెచర్లు 5 వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా దర్శనం ఇస్తున్న స్ట్రెచర్లు, వీల్ చైర్లు చూసి రోగుల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకూ ఇన్ని స్ట్రెచర్లు కంటికి కనిపించలేదని అవాక్కవుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, కలెక్టర్ హనుమంతు ఆసుపత్రికి వచ్చి పరిశీలించాలని రోగుల బంధువుల డిమాండ్ చేస్తున్నారు. కాగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. బంధువులే అతని కాళ్లు పట్టుకుని వైద్యుని దగ్గరకు లాక్కెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: సమ్మర్ టూర్.. వెరీ ‘హాట్’ గురూ! -
ఎర్రజొన్న సీడ్.. కేరాఫ్ అంకాపూర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లోని అంకాపూర్ అనగానే రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ దేశీ చికెన్ గుర్తొస్తుంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు సైతంఈ దేశీ చికెన్ పార్సిళ్ల రూపంలో వెళుతోంది. అయితే ఇదే అంకాపూర్ పశుగ్రాసం కోసం పెంచే ఎర్రజొన్న విత్తనాల ఎగుమతిలోనూ ప్రత్యేకత పొందింది. ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌తోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాకు సైతం ఎర్రజొన్న విత్తనాలు ఎగుమతి చేస్తున్నారు. ఉత్తరాదిలో పశుగ్రాసానికి ఆధారం ఇదే.. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు ఏటా ఎర్రజొన్న సాగు చేస్తున్నారు. పక్కనే ఉన్న నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోనూ రైతులు మరో 30 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఉత్తరాదిలో పశుగ్రాసం పెంచేందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ఎర్రజొన్నలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్లో 40 చోట్ల ఎర్రజొన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వాటిలో 10 యూనిట్లు చుట్టుపక్కల ఉండగా ఒక్క అంకాపూర్‌లోనే 30 ఎర్రజొన్న యూనిట్లు ఉన్నాయి. దీంతో ఎర్రజొన్న విత్తనాలకు కేరాఫ్‌గా అంకాపూర్ పేరుగాంచింది. ఏపీలో చూసొచ్చి.. 1983లో ఏపీలోని ఏలూరులో ఎర్రజొన్న విత్తనాల పంటలను పరిశీలించి వచ్చిన ఆర్మూర్ ప్రాంత రైతులు ఈ సాగు ప్రారంభించారు. రైతులు ఏటా అక్టోబర్, నవంబర్లలో ఒప్పందం ద్వారా విత్తన వ్యాపారుల నుంచి ఫౌండేషన్ సీడ్‌ను తీసుకుంటారు. ఫిబ్రవరిలో పంట చేతికి రాగానే ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చిన వ్యాపారులకే రైతులు అమ్ముతారు. రైతుల నుంచి సేకరించిన విత్తనాలను వ్యాపారులు ఆయా యూనిట్లలో శుద్ధిచేసి ప్యాక్ చేసి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నిజామాబాద్ భూములే సాగుకు అనుకూలం.. దేశం మొత్తంలో తెలంగాణలోని నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే భూములు ఎర్రజొన్న విత్తనాలు పండించేందుకు అనుకూలంగా ఉన్నాయి. కర్ణాటకలోని బళ్లారిలో 15 శాతం ఎర్రజొన్న విత్తనాలు పండిస్తుండగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో కలిపి 85 శాతం ఎర్రజొన్న విత్తనాలను పండిస్తున్నారు. రైతుల నుంచి కిలో రూ.45 చొప్పున ఎర్రజొన్నలను తీసుకుంటున్న వ్యాపారులు వాటిని శుద్ధిచేసి కిలో రూ.65 చొప్పున అమ్ముతున్నారు. ఏటా ఇక్కడి నుంచి 60 వేల మెట్రిక్ టన్నుల ఎర్రజొన్న విత్తనాలను శుద్ధిచేసి ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వం కొంటేనే మేలంటున్న రైతులు.. సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారుతుండడంతో ఏటా ధర విషయంలో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వమే విత్తన విధానాన్ని రూపొందించి రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకునే విధానాన్ని తయారుచేస్తే రైతులకు మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి ఎర్రగరప నేలలు అనుకూలం నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఎర్రగరప నేలలు ఎర్రజొన్న పంటకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే, పశువుల పెంట, చెరువు నల్లమట్టి ఈ భూముల్లో వేస్తారు. మరోవైపు ఈ మూడు జిల్లాల్లోని వాతావరణ పరిస్థితులు ఎర్రజొన్న సాగుకు కలిసివస్తున్నాయి. రైతులు పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న పంటల మార్పిడి వ్యవసాయం చేస్తుండడంతో మరింత మేలు చేస్తోంది. ప్రైవేటు వ్యాపారులు అంకాపూర్‌లో యూనిట్లు ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహిస్తుండడంతో ఎర్రజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. – హరికృష్ణ, వ్యవసాయాధికారి, ఆర్మూర్ -
ఆహా ఏమి రుచి.. అంకాపూర్ దేశీ కోడి కూరకు 50 ఏళ్లు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ ‘అంకాపూర్ దేశీ చికెన్’.. ఈ పేరు వింటే చాలు మాంసం ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. ఎన్ని రకాల చికెన్ ఐటమ్స్ ఉన్నా.. ఈ దేశీ (నాటు) కోడి కూర రుచే వేరంటే అతిశయోక్తి కాదు. నాన్‌వెజ్ ప్రియులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అంకాపూర్ వచ్చి మరీ ఈ కోడి కూరను ఆస్వాదిస్తుంటారు. 50 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర ఇప్పటికీ తిరుగులేని బ్రాండ్ ఇమేజ్‌తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అంకాపూర్ గ్రామానికి చెందిన దుబ్బ గౌడ్, లక్ష్మి దంపతులకు వచ్చిన ఆలోచన.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ ఊరి పేరును మార్మోగిస్తోంది. ఈ పేరుతో అనేకచోట్ల హోటళ్లు, ఆర్డర్ మెస్‌లు ఏర్పాటు కావడం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేక మంది జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు ఈ అంకాపూర్ దేశీ కోడి కూరను రుచి చూసి మెచ్చుకున్న వారే కావడం గమనార్హం. కల్లు తాగే వారి కోసం.. గీత కార్మికుడైన బుర్ర దుబ్బగౌడ్ కల్లు తాగేందుకు తన వద్దకు వచ్చే వారికి.. నాటు కోడి కూర వండి విక్రయించేవాడు. క్రమంగా దుబ్బగౌడ్ దగ్గరికి కల్లు కోసం వచ్చేవారి సంఖ్య పెరిగింది. దీంతో దుబ్బ గౌడ్, అతని భార్య లక్ష్మి దేశీ కోడి కూరతో పాటు బాతు కూర, ఆమ్లెట్లు వేసివ్వడం ప్రారంభించారు. ఇందుకోసం గ్రామంలోని తమ ఇంటి వద్దనే దేశీ కోళ్లు, బాతులు పెంచడం ప్రారంభించారు. గిరాకీ పెరగడంతో మునిపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల నుంచి రెండున్నర రూపాయల నుంచి మూడు రూపాయలకు ఒక కోడిని కొనుగోలు చేసి నలుగురు వ్యక్తులు తినడానికి సరిపడా కిలో బియ్యంతో అన్నం వండి రూ.5కు అందించడంతో క్రమంగా వారి వ్యాపారం పుంజుకుంది. లాభాల బాటలోకి వచ్చిన ఈ దంపతులను చూసి అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి రామగౌడ్, తాళ్లపల్లి మల్లాగౌడ్, బోండ్ల భాజన్న కూడా దేశీ కోడి కూర వంటకం ప్రారంభించారు. పదేళ్ల పాటు గ్రామంలోని గాంధీ చౌరస్తాలో నాటు కోడి కూర వ్యాపారం చేసిన దుబ్బ గౌడ్, లక్ష్మి దంపతులు పోటీ అధికం కావడంతో విరమించుకుని జీవనోపాధి కోసం హోటల్ పెట్టుకున్నారు. ప్రస్తుతం వీరు కాలం చేశారు. ఈ దంపతులు ప్రారంభించిన దేశీ కోడి కూర రుచి, అంకాపూర్ పేరు క్రమంగా అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. డెలివరీ @ ‘డోర్ స్టెప్’ ఒక కోడి ఆర్డర్ చేసిన వారు తమ గ్రామ శివారులో ఎక్కడ కూర్చున్నా తోటలు, పంట పొలాలు, ఇళ్లకు నేరుగా వెళ్లి అందిస్తున్నారు. భోజనం తరువాత గిన్నెలను సైతం వారే తీసుకెళుతున్నారు. వండి నేరుగా తెచ్చి ఇస్తుండడంతో పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పంట పొలాల్లో, మామిడి తోటల్లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు నిజామాబాద్, ఇతర గ్రామాల్లో కూడా ఆర్డర్ మెస్‌లు ప్రారంభించారు. అంకాపూర్ గ్రామం జాతీయ రహదారికి పక్కనే ఉండడంతో ఇక్కడ ఎర్రజొన్న సీడ్ వ్యాపారం అభివృద్ధి చెందింది. సుమారు 40 సీడ్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. మరోవైపు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తరచూ అంకాపూర్‌ను సందర్శిస్తున్నారు. దేశీ కోడి కూరను రుచి చూసి వివిధ ప్రాంతాల్లో దీని గురించి చెప్పడంతో ప్రాచుర్యం పొందింది. అంకాపూర్ దేశీ కోడి ఆర్డర్ మెస్‌ల నిర్వాహకులు కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దేశీ కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఒరిజినల్ కోడి అయితే ఎక్కువ ధర.. అంకాపూర్ దేశీ కోడి (క్రాస్ బ్రీడ్) కూరను సొంతంగా తయారు చేసిన ప్రత్యేకమైన మసాలాలు దట్టించి వండటంతో దానికి మంచి రుచి వస్తుంది. కోరిన వారికి ఎల్లిగడ్డ కారం సైతం ప్రత్యేకంగా ఒక గిన్నెలో పెట్టి ఇస్తారు. భోజన ప్రియులు, ముఖ్యంగా నాన్‌వెజ్ ప్రియులు ఈ కూరను ఇష్టంగా తింటున్నారు. అయితే 50 ఏళ్ల క్రితం కిలోకు రూ.5తో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర, అన్నం ధర ప్రస్తుతం రూ.1,000 వరకు ఉంటోంది. గ్రామంలో సుమారు పది మంది ఆర్డర్ మెస్‌లు నెలకొల్పారు. ప్రస్తుతం రూ.700కు నలుగురికి సరిపడా ఫారంలో పెంచిన దేశీ కోడి కూర, అన్నం చేసి ఇస్తున్నారు. ఆర్డర్ మెస్‌లోనే తినేవారికి రూ.130కు ప్లేట్ చొప్పున వడ్డిస్తున్నారు. ఇక గ్రామాల్లో పెరిగిన ఒరిజినల్ దేశీ కోడికి మాత్రం రూ.1,000 వరకు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకూ విస్తరణ.. పాతికేళ్ల క్రితం వరకు కేవలం అంకాపూర్ గ్రామానికే పరిమితమైన ఆర్డర్ మెస్‌లు ప్రస్తుతం విస్తరించాయి. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో సైతం అంకాపూర్ దేశీ కోడి కూర పేరుతో ఆర్డర్ మెస్‌లు వెలిసాయి. హైదరాబాద్‌లోని కొంపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాలకు నిజామాబాద్, పెర్కిట్, మామిడిపల్లి కేంద్రాలకు విస్తరించాయి. నిజామాబాద్ జిల్లాలో సుమారు వందకు పైగా అంకాపూర్ దేశీ కోడి కూర అందించే ఆర్డర్ మెస్‌లు ఉండగా.. ఒక్క ఆర్మూర్ మండలంలోనే 50కి పైగా ఆర్డర్ మెస్‌లు ఉన్నాయి. అయితే ఈ దేశీ కూర మెస్‌లను అంకాపూర్ వాసులే కాకుండా వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఏర్పాటు చేసి ఆర్మూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. విదేశాలకూ పార్శిల్స్.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం అక్కడ స్థిరపడిన వారి కోసం బంధువులు అంకాపూర్ దేశీ కోడి కూరను ఇక్కడ ప్రత్యేకంగా ప్యాక్ చేయించి కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. ప్రత్యేక మసాలాలతో ప్రత్యేక రుచి.. ఇంట్లో వండే చికెన్‌లా కాకుండా మేము ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని మసాలాలు దట్టించి దేశీ కోడి కూరను వండుతాం. చాలా రుచికరంగా ఉంటుండటంతో భోజన ప్రియులు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. –కుంట నారాయణ గౌడ్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, అంకాపూర్ అంతర్జాతీయ గుర్తింపుతో ఆనందం అంకాపూర్ దేశీ కోడి కూర తినడానికి వివిధ ప్రాంతాల నుంచి భోజన ప్రియులు వస్తున్నారు. కోరిన విధంగా వారికి వండి పెడుతున్నాము. అంతర్జాతీయ స్థాయిలో అంకాపూర్‌కు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. – తాళ్లపల్లి శ్రీకాంత్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, అంకాపూర్ అంకాపూర్‌ను మించి పెర్కిట్‌లో వ్యాపారం.. దేశీ కోడి తినాలనుకున్న భోజన ప్రియులు కోరిన విధంగా వండి ఇస్తున్నాము. అంకాపూర్ కంటే పెర్కిట్, మామిడిపల్లిలో దేశీ కోడి ఆర్డర్ మెస్ వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతోంది. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. – జీవన్‌గౌడ్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, పెర్కిట్, ఆర్మూర్ -
సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం
సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ జిల్లా నందిపేట్ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతి సోమవారం కలెక్టరేట్లో ఆత్మహత్యకు యత్నించారు. బిల్లుల(ఎంబీల)పై ఉప సర్పంచ్ సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్ల కుపైగా ఆగిపోయాయంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సమీపంలో ఉన్నవారు వెంటనే దంపతుల నుంచి అగ్గిపెట్టెను లాక్కొని విసిరేశారు. బీజేపీ మద్దతుతో వాణి సర్పంచ్‌గా గెలుపొందడంతో సాకులు చూపి వేధింపులకు గురి చేస్తున్నారని, పంచాయతీ నిధులు మింగేశామని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారని తిరుపతి కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ మారినా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బిల్లులు, చెక్ పవర్ ఇప్పించ లేకపోయారని పేర్కొన్నారు. బిల్లులు రాక గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేక ప్రజలకు ముఖం చాటేయాల్సి వస్తోందన్నారు. వడ్డీ సహా మొత్తం రూ.4 కోట్ల వరకు అప్పులు అయ్యాయని.. ఈ దిగులుతో తన భార్య, సర్పంచ్ వాణి ఆస్పత్రి పాలైందన్నారు. అయితే కలెక్టర్ వచ్చే వరకూ కలెక్టరేట్ నుంచి కదిలేది లేదంటూ వాణి, తిరుపతి అక్కడే బైఠాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీపీవో జయసుధ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఉప సర్పంచ్ సంతకాలు పెట్టకపోవడంపై విచారణ చేపడతామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
జిల్లాలో నీటికటకట
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో నీటి కొరత ఏర్పడింది. ఒక వైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఎండుతున్న గొంతులతో ప్రజలు విలవిలలాడుతున్నారు. తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. రక్షిత మంచి నీటి పథకాలు పడకేశాయి. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలు, తండాలు, జిల్లా కేంద్రానికి అనుకొని ఉన్న గ్రామాలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇందుకు కరెంటు కోత లు ఓ కారణం కాగా, నీటి వనరులు అడుగంటిపోవడం మరో కారణం. వేసవి వచ్చిందంటే ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. రోజువా రీ అవసరాల సంగతి అలా ఉంచితే, తాగేం దుకు కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. పగలు, రాత్రి నీటి కోసం పోట్లాటలు తప్పడం లేదు. ఈ వేసవిలో నీటి ఎద్దడిని నివారించడానికి అధికారులు రూ. 1.50 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. అమలులో మాత్రం విఫలమయ్యారు. జిల్లాలో 347 బోర్లకు ప్లషింగ్, డిఫెనింగ్ చేశామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అధికారులు చెబుతున్న వివిధ మంచి నీటి పథకాలతో ప్రజలకు సరిపోయే నీరు అందడం లేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 11 తాగునీ టి పథకాలు చేపట్టారు. వీటికి సుమారు రూ. 200 కోట్లను వెచ్చించారు. వీటి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం న్యాల్కల్లో చేపట్టిన మంచినీటి పథకం నేటికీ ప్రారంభం కాలేదు. అధికారులు ముందే స్పందించి ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ ఇబ్బందులు తలెత్తేవి కావు. రక్షిత నీరు అందని ప్రాంతాలకు సీపీడబ్ల్యూ పథకం ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ప్రయోజనం కలగడం లేదు.