నక్సల్స్ ఏరివేతను ఆపేదిలేదు: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: నక్సల్స్ ఏరివేతి కార్యక్రమాలు ఆపే ప్రసక్తేలేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై బుధవారం రాజ్‌నాథ్ ఉభయసభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు.
బహుముఖ విధానాల్లో మావోయిస్టులను అరికడతామని రాజ్‌నాథ్ చెప్పారు. ఇందుకోసం భద్రత బలగాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. నవంబర్ 16 నుంచి చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా అటవీప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని మంత్రి చెప్పారు. 2253 సీఆర్పీఎఫ్ జవాన్లు, 224 మంది రాష్ట్ర పోలీసులు పాల్గొంటున్నారని వెల్లడించారు. భద్రత సిబ్బంది, మావోయిస్టుల మధ్య పలుమార్లు ఎదురు కాల్పులు జరిగాయని చెప్పారు. గత నెల 21న 12 మంది మావోయిస్టులను హతమార్చినట్టు సమాచారం ఉందని, అయితే ఈ విషయం ఇంకా ధ్రువపడలేదని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ నెల 1న భద్రత సిబ్బంది బేస్ క్యాంప్‌నకు వస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని చెప్పారు.