పెద్ద నోట్ల డిజైన్‌ను ఆమోదించింది ఎవరు?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతర్వాత చలామణిలోకి వచ్చిన రూ.500, రూ.2వేల నోట్ల డిజైన్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. గత ఏడాది మేలో ఈ కొత్త నోట్ల డిజైన్ కు ఆమోదం తెలిపినట్టు ఆర్బీఐ తెలిపింది. సమాచారం హక్కు చట్టం ద్వారా ప్రశ్నించిన జీతేంద్ర ఘాడ్గేకు సమాధానంగా ఈ వివరాలు తెలిపింది. ఈ కొత్త నోట్ల డిజైన్ మే ,19, 2016 న ఆర్బిఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో ఆమోదించినట్టు ఆర్టిఐ ప్రశ్నకు సమాధానం వెల్లడించింది.
నోట్ల కొత్త డిజైన్ మే 19, 2016 న జరిగిన భేటీలో రిజర్వు బ్యాంకు సెంట్రల్ బోర్డు అనుమతి పొందిందని ఆర్బీఐ సెంట్రల్ పబ్లిక్ ఇన్ ఫర్మేషన్ అధికారి తెలిపారు. అయితే, ఈ డిజైన్ ను ఆమోదించిన ఆర్ బీఐ గవర్నర్ పేరు వెల్లడిచేయడానికి మాత్రం నిరాకరించింది. పారదర్శకత చట్టం లోని 8(1)((ఎ) సెక్షన్ పేర్కొంటూ ఈ వివరాలు ఇవ్వలేమని పేర్కొంది.
డిజైన్ ఆమోదంపై ఖచ్చితమైన తేదీ కావాలంటూ జితేందర్ ఆర్టీఐ ద్వారా ప్రశ్నించారు. ఈ అంశంలో కేంద్ర బ్యాంక్ మొదటి సమావేశం, ఎజెండా, డిజైన్ ఆమోదం, ప్రింటింగ్ కొరకు ఆదేశాలు తదితర అంశాలపై ఖచ్చితమైన సమాచారం కావాలని ఆయన కోరారు.
ఆర్ బీఐ 1934 చట్టం ప్రకారం ఆర్ బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఈ కమిటీ బ్యాంకు వ్యవహరాలను పర్యవేక్షిస్తుంది. మరోవైపు సెప్టెంబర్ 2013 నుంచి 2016 సెప్టెంబర్ దాకా రఘురామ్ రాజన్ ఆర్ బీఐ గవర్నర్ గా ఉన్నారు.
కాగా నవంబరు 8 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న రూ. 500 రూ.1000 నోట్లనురద్దుచేసి సంచలనం రేపారు. అలాగే ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వీరప్పమొయిలీ నేతృత్వంలోని పార్లమెంట్ పబ్లిక్ ఎకౌంట్స్ (పీఏసీ) ముందు హాజరై డీమానిటైజేషన్ పై వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.