Odd Even Scheme
-
కాలుష్య తీవ్రతతో అమల్లోకి సరి-బేసి విధానం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్ధాయికి చేరడంతో వాహనాల నియంత్రణ కోసం సరి-బేసి విధానం సోమవారం ఉదయం నుంచి తిరిగి అమల్లోకి వచ్చింది. తమ కుటుంబాలు, పిల్లలను కాపాడుకునేందుకు ఈ పద్ధతికి సహకరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తల్లితండ్రులను కోరారు. నవంబర్ 15 వరకూ సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానం నుంచి ద్విచక్రవాహనాలు, ఎలక్ర్టిక్ వాహనాలను మినహాయించారు. 12 ఏళ్లలోపు చిన్నారులతో కూడిన మహిళలు నడిపే వాహనాలకు కూడా మినహాయింపు వర్తిస్తుంది. రాష్ట్రపతి, ప్రధాని, ఎమర్జెన్సీ సహా 29 కేటగిరీలకు చెందిన వాహనాలను కూడా ఈ విధానం నుంచి మినహాయించారు. ఢిల్లీ సీఎం, మంత్రుల వాహనాలకు మాత్రం ఎలాంటి మినహాయింపు లేకపోవడం గమనార్హం. సరి-బేసి విధానాన్ని ఉల్లంఘిస్తే రూ 4000 జరిమానా విధిస్తారు. నగరమంతటా ఈ విధానం పకడ్బందీగా అమలు చేసేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులతో కూడిన 600కి పైగా టీంలను రహదారులపై నియోగించారు. ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తిరిగి సరి- బేసి విధానాన్ని అమలుచేయడాన్ని వాహనదారులు స్వాగతించారు. పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్ధాలను తగలబెట్టడం ఆపివేయాలని వారు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నిందారోపణలతో కాలయాపన చేయకుండా కాలుష్యాన్ని నియంత్రించేందుకు నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో ఢిల్లీలో నివసించేందుకు జనం భయపడుతున్నారు. సంక్లిష్ట సమయంలో తాము మరో నగరానికి వెళ్లే యోచనలో ఉన్నామని 40 శాతం మంది ఢిల్లీ వాసులు ఓ సర్వేలో పేర్కొనడం గమనార్హం. -
రాజధానిలో ఆ విధానం అవసరం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించడానికి వాహనాలను సరి, బేసి సంఖ్యల ఆధారంగా రోడ్లపై అనుమతించే విధానం అవసరం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అంతకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దీపావళి పండుగ సందర్భంగా వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి నవంబర్ 4 నుంచి 15వ తేదీ వరకు సరి - బేసి విధానం అమలు చేస్తామని ప్రకటించారు. పెరిగిపోతున్న కాలుష్యానికి విరుగుడుగా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలతో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విభేదించారు. ఢిల్లీలో సరి, బేసి విధానం సరికాదని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం నిర్మించిన రింగ్‌రోడ్డు వల్ల ఇప్పటికే కాలుష్యం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మరో రెండేళ్లలో కేంద్రం చేపట్టిన విధానాల ఫలితాలు వస్తాయని తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంటే అది వారిష్టమని గడ్కరీ స్పష్టం చేశారు. -
ట్రక్కులపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పొగమంచు, వాయు కాలుష్యంపై నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టింది. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్న పర్యావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 17 వరకూ సరి-బేసి విధానాన్ని మళ్లీ అమలు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే సీఎన్జీ వాహనాలకు సరి-బేసి నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశరాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన భారీ ట్రక్కులు, లారీల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, పండ్లు వంటి వాటికి మినమాయింపులను ప్రభుత్వం కల్పించింది. అప్పటికే ఢిల్లీ చెక్ పాయింట్ల వద్దకు చేరుకున్న ట్రక్కులను ఇతర నగరాలకు మళ్లిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసు శాఖ.. ఢిల్లీకి వచ్చే అన్ని రహదారుల్లోనూ చెక్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ నెల 15 వరకూ ట్రక్కులపై నిషేధం కొనసాగుతుందని ఢిల్లీ అధికారులు తెలిపారు. -
'15 వరకు జోక్యం చేసుకోం'
న్యూఢిల్లీ: ఢిల్లీ రహదారులపైకి సరి-భేసి విధానంతో మాత్రమే వాహనాలకు అనుమతిస్తామని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తాము జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం పేర్కొన్నట్లుగా ఈ నెల 15వరకు(శుక్రవారం) ఆ నోటిఫికేషన్ ప్రకారమే అమలవుతుందని, దానిని మధ్యలో ఆపలేమని చెప్పింది. దీనిపై తుది తీర్పును మాత్రం నేరుగా వెల్లడించకుండా శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే, ఫిబ్రవరి 15 నుంచి ప్రవేశ పెట్టనున్న కొత్త ట్రాఫిక్ నిబంధనలను వ్యతిరేకిస్తూ కోర్టుకు వచ్చిన నోటీసులపై మాత్రం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.