59వేల కోట్లతో రఫెల్ జెట్ ఫైటర్స్
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి రఫెల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను త్వరలోనే కొనుగోలు చేయనున్నట్టు బీజేపీ తెలిపింది. ఈ వివరాలను బీజేపీ తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించింది. 8.8 బిలియన్ డాలర్లు(రూ.59,000 కోట్లు) కు డీల్ కుదిరిందని తెలిపింది. తాజా ఒప్పందంతో ప్రభుత్వానికి 3.2బిలియన్ డాలర్లు(రూ.21,000 కోట్లు) ఆదా అయినట్లు వెల్లడించింది. గతంలో 12బిలియన్ డాలర్లు(రూ.80,000 కోట్లు) కు రఫెల్ ఒప్పందం కుదిరింది. అనంతరం అనేకసార్లు బేరసారాలు జరిగాయి. చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో 3.2బిలియన్ కోట్లు ఆదా అయినట్లు బీజేపీ తెలిపింది.
రక్షణ శాఖ సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ మాట్లాడుతూ.. 36 జెట్ విమానాల కొనుగోలుకు మార్గం సుగమమైందని త్వరలోనే ఈ ప్రతిపాదన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్పిల్(డాక్) ముందుకు వెళ్లనుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ విమానాలను కొనుగోలు చేయాలనే ఒప్పందం (ఎంఓయూ) ఈ ఏడాది ప్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకొయిస్ హోలండ్ భారత పర్యటనలో ఉండగా ఖరారైంది. కాగా బీజేపీ వెల్లడించిన కొనుగోలు ఒప్పందం సంఖ్యలతో రక్షణ శాఖ విభేదించడం కొసమెరుపు. మరోవైపు విమానాల కొనుగోలు వివరాలను బీజేపీ ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.