వన్ ఇండియా.. వన్ టూరిజం
పర్యాటకానికి సంబంధించి దేశం మొత్తం మీద ఒకే విధానం అమలయ్యేలా వన్ ఇండియా వన్ టూరిజం పద్ధతిని పరిశీలించాలని ట్రావెల్ ఏజెంట్ల అసోసియేషన్ (టీఏఏఐ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఒకే పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చే అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని కోరింది. తద్వారా మహమ్మారి ధాటికి సంక్షోభంలో చిక్కుకున్న దేశీ ట్రావెల్, టూరిజం, ఆతిథ్య రంగానికి తోడ్పాటు అందించాలని టీఏఏఐ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, సంబంధిత వర్గాలందరికీ విమాన ప్రయాణం మరింత చౌకగా అందుబాటులో ఉండేలా విమాన ఇంధనాన్ని (ఏటీఎం) కూడా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చాలని కోరింది. అలాగే, అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిధిని మరింత విస్తృతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది.
కేంద్రం, రాష్ట్రాలు తోడ్పాటునివ్వాలి..
టూరిజం రంగం కోలుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునివ్వాలని టీఏఏఐ పేర్కొంది. విచక్షణాయుత ఖర్చులు పెట్టేందుకు వీలుగా మధ్యతరగతి ప్రజల చేతిలో తగు స్థాయిలో డబ్బులు ఆడేందుకు సముచిత చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. స్టార్టప్‌లు, చిన్న .. మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) వర్కింగ్ క్యాపిటల్ భారాన్ని తగ్గించేందుకు, నగదు లభ్యత మెరుగుపడేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. అలాగే ఆదాయపు పన్ను రేటు, జీఎస్టీ రేటును తగ్గించాలని, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. 2022–2023లో అన్ని టూరిస్ట్ వీసాలపై ఈ–వీసా ఫీజు మినహాయింపునివ్వాలని పేర్కొంది.
ఎంఎస్ఎంఈలను పటిష్టం చేయడం, పరిశ్రమలో టెక్నాలజీ వినియోగానికి ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమును ఏర్పాటు చేయడం, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం క్రెడిట్ ఆధారిత క్యాపిటల్ సబ్సిడీ స్కీము (సీఎల్సీఎస్ఎస్)ను పునరుద్ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని టీఏఏఐ కోరింది. అలాగే, ట్రావెల్ ఏజెంట్లు, ఆపరేటర్ల మనుగడ కోసం వారికి రావల్సిన చెల్లింపులకు భద్రత కల్పించే విధంగా తగు వ్యవస్థను నెలకొల్పాలని విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ ఎంఐసీఈ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) కార్యక్రమాలను భారత్‌కు రప్పించే దిశగా, దేశీ ఎంఐసీఈ కంపెనీలు అంతర్జాతీయ బిడ్డింగ్‌లలో పాల్గొనేందుకు ఉపయోగపడే గ్లోబల్ బిడ్డింగ్ ఫండ్ ఏర్పాటు అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని టీఏఏఐ కోరింది.