ఓపెన్ యూనివర్సిటీ ఓవరం
రాజంపేట టౌన్:
చదువుకునే వయస్సులో వివిధ కారణాల రీత్యా డిగ్రీ, పీజీ వంటి కోర్సులను చదవలేని వారికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓ వరం లాంటిదని ఆ యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్వీ కృష్ణారెడ్డి (ఎల్వీకే) తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జగదీష్క్రిష్ణకుమార్, అంబేద్కర్ సార్వత్రిక
విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.శివశంకరయ్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పీజీ వంటి కోర్సులను చేసి అనేక మంది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారన్నారు. 18 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు, వయో ధృవీకరణ పత్రం ఉంటే ఎవరైనా డిగ్రీలో ప్రవేశానికి అర్హత పరీక్ష రాసేందుకు అర్హులని తెలిపారు. ప్రస్తుతం 2016–17 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం యూనివర్సిటీ ఈ ఏడాది రెండవ మారు డిగ్రీలో ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహిస్తుందన్నారు.
ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 29వ తేదీలోపు ఏపీ ఆన్లైన్లో 225 రూపాయిలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లోని యూనివర్సిటీ రీజనల్ కో–ఆర్డినేషన్ సెంటర్లలో అర్హత పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే పీజీ, డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్లకు కూడా నోటిఫికేషన్ జారీ అయినట్లు ఎల్వీకే తెలిపారు. బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సులకు ఆగస్టు 14వ తేదీ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎల్వీకే తెలిపారు. ఆగస్టు 6వ తేదీలోపు ఈ ప్రవేశ పరీక్షకు
దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ పెంచలయ్య, అల్లం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.