ఆపరేషన్ క్లీన్ మనీ: షోకాజ్ నోటీసులు త్వరలో
న్యూఢిల్లీ: ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో భాగంగా అధికారులు సెకండ్ ఫేజ్ చర్యలకు దిగనునున్నారు. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఐటీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనుమానాస్పద ఖాతాల డిపాజిట్ దారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ వచ్చే నెల నుంచి 'ఆపరేషన్ క్లీన్ మనీ' రెండో దశ ప్రారంభించడానికి రడీ అవుతోంది. 9 లక్షల మంది అకౌంట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఇటీవల ప్రకటించిన ఐటీ శాఖ ఆయా ఖాతాదారులకు నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. అనుమానాస్పద డిపాజిట్దారులపై చట్టబద్దమైన నోటీసులు జారీల ద్వారా వివరణ కోరనుంది. కొత్త పన్ను క్షమాభిక్ష పథకం–పీఎంజీకేవై ముగిసిన తర్వాత (మార్చి 31) చర్యలు ఉంటాయని కూడా పేర్కొన్న ఐటీ శాఖ ఆ వైపుగా కదులుతోంది.
జనవరి, 31 2017 న 'ఆపరేషన్ క్లీన్ మనీ' ఆదాయపు పన్ను శాఖ లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ కింద నవంబర్ 9- డిసెంబర్ 30 2016 మధ్య కాలంలో సమయంలో చేసిన పెద్ద నగదు డిపాజిట్లపై ఐటీ కన్నేసింది. ముందుగా 18 లక్షల ఖాతాలను అనుమానాస్పందగా తేల్చింది. మొదటి దశలో ఇ-ఫైలింగ్ పోర్టల ద్వారా ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ సందేశాలను పంపుతూ సమాధానాల నిమిత్తం ఇచ్చిన తుది గడువు ఫిబ్రవరి 15తో ముగిసింది. వీరిలో దాదాపు 5.27 లక్షల మంది అసెస్సీలు ఫిబ్రవరి 12వ తేదీ నాటికే సమాధానం ఇచ్చారు. ఇ-నిర్ధారణ అనంతరం వీరిలో 9 లక్షల ఖాతాలను అనుమానాస్పదంగా తేల్చిన సంగతి తెలిసిందే.