కోత్త బత్తాయి లోకం!
కిన్నో ఆరెంజ్ సాగుతో సేద్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న ప్రకృతి వ్యవసాయదారుడు సత్యారెడ్డి..
రసాయనిక వ్యవసాయంలో కుదే లై తోట తీసేద్దామనుకున్న దశలో ప్రకృతి వ్యవసాయంపై దృషి
ప్రకృతి వ్యవసాయం ఇచ్చిన ధైర్యంతో 28 ఎకరాల్లో కిన్నో ఆరెంజ్ సాగు
కోటి ఆశలతో బత్తాయి తోట వేసిన రైతు సత్యారెడ్డి ఆశలు నాలుగేళ్లలోనే ఆవిరయ్యాయి. ఎంత ఖర్చుపెట్టినా చెట్లు చనిపోతుండడంతో.. తగిన పరిష్కారాల కోసం వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా అన్వేషించారు. ఈ క్రమంలో ఎగుమతి అవకాశాలున్న కిన్నో ఆరెంజ్ పంట సాగు మేలైనదని గుర్తించారు. అన్నివిధాలా నష్టదాయకంగా పరిణమించిన రసాయనిక వ్యవసాయం కన్నా ప్రకృతి వ్యవసాయం మేలైనదని రైతుల అనుభవాల ద్వారా గ్రహించారు. ప్రకృతి వ్యవసాయ బాటన నడుస్తూ లాభాల మాధుర్యాన్ని చవిచూస్తున్నారు. సేద్య పోరాటంలో విజేతగా నిలుస్తున్నారు.
కింద పడకపోవడంలో ఏమంత గొప్పతనం లేదు, పడి లేవడంలోనే జీవితపు గొప్పదనం దాగి ఉంది - నెల్సన్ మండేలా
ఇది సమాజంలో అందిరికన్నా రైతుకు ఎక్కువ వర్తిస్తుంది. ఎన్నిసార్లు కిందపడినా, గాయపడినా తిరిగి లేచి ప్రయాణం కొనసాగించడం ఒక్క అన్నదాతకే చెల్లింది. రసాయనిక వ్యవసాయం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం వెదుక్కుంటూ సేద్య పోరాటంలో సాగుతున్న ఒకానొక యోధుడు సత్యారెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం తనగలకు చెందిన రైతు సత్యారెడ్డి, మాణిక్యమ్మ దంపతులు పాతికేళ్ల కిందట సేద్యంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల తర్వాత.. 50 ఎకరాల్లో బత్తాయి సాగు చేపట్టారు. నాటిన ఐదేళ్లకు బత్తాయి కాపునకు వచ్చింది. మొదటి సంవత్సరం మంచి పంట వచ్చింది. కానీ అధిక దిగుబడి సాధించాలన్న తాపత్రయంలో విపరీతంగా ఎరువులు వాడడంతో చెట్లు వేరుకుళ్లు తెగులుతో క్రమంగా దెబ్బతినడం ప్రారంభించాయి. తరువాత నాలుగేళ్లలో వేరు కుళ్లుతో చాలా చెట్లు చనిపోయాయి. పదేళ్లకు చెట్లన్నీ తీసేశాను. తరువాత ఏం చేయాలో అర్థం కాలేదు. భూమిని దున్నటం.. ఏ పంట సాగు చేయాలో అర్థంకాక బీడుగా వదిలే యటం.. తన మదిలో ప్రశ్నలకు జవాబు కోసం ఎక్కడెక్కడో సంచరించడం.. ఇలా కొన్ని సంవత్సరాలపాటు గడచింది. ఈ అన్వేషణలో భాగంగా కర్ణాటక ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రాలన్నీ తిరిగారు. అక్కడ ఒక రైతు క్షేత్రంలో మొదటసారి కిన్నో ఆరెంజ్ సాగు చూశాక దానిపై ఆసక్తి కలిగింది. సిట్రస్ జాతికి చెందిన రెండు వంగడాలను సంకరం చేసి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 1935లో అభివృద్ధి చేసిన పంట కిన్నో ఆరెంజ్. బత్తాయిలోకన్నా రసం ఎక్కువ కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. పాకిస్తాన్ కిన్నో ఆరెంజ్‌కు ఆదరణ ఎక్కువ. మన పంజాబ్‌లోనూ ఈ పంట సాగులో ఉంది. మార్కెట్లో కిన్నో ఆరెంజ్‌కు వున్న డిమాండ్ తెలుసుకున్నాక సత్యారెడ్డి పదకొండెకరాల్లో (20్ఠ20 దూరంలో ఎకరానికి వంద చొప్పున) ఈ మొక్కలు నాటారు. సత్యారెడ్డి స్ఫూర్తితో మరికొంత మంది రైతులు సుమారు వంద ఎకరాల్లో కిన్నో ఆరెంజ్ సాగు మొదలుపెట్టారు.
రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ప్రారంభించిన కిన్నో ఆరెంజ్ సాగును కూడా గతంలో బత్తాయిలో ఎదురైన సమస్యలు వెంటాడాయి. రెండో ఏడాదిలో వంద చెట్లు చనిపోయాయి. అయినా ఏ మాత్రం తగ్గకుండా రసాయనిక ఎరువులు వాడారు. మూడో ఏడాది మరో యాభై చెట్లు చనిపోయాయి. కానీ ఆ ఏడాది 50 టన్నుల దిగుబడి ద్వారా సుమారు రూ. 11 లక్షల ఆదాయం వచ్చింది. నిజానికి మూడో సంవత్సరంలో పంట తీయకూడదు. కానీ, మన వాతావరణం దీనికి సరిపోదని చాలా మంది చెప్పడంతో వచ్చిన అవకాశాన్ని జారవిడవొద్దన్న ఆతృతలో తొందరగా పంట తీసుకున్నారు. సూక్ష్మపోషకాల లోపాలు ఎక్కువయ్యాయి. మేరుకుళ్లు సమస్య మరింత తీవ్రమైంది. నాలుగో సంవత్సరంలో వంద చెట్లు చనిపోయాయి. దీంతో ఇక తోట మొత్తాన్నీ తీసేయాలన్న ఆలోచనకు వచ్చారు.
అదే సమయంలో.. వివిధ రాష్ట్రాల్లో పాలేకర్ శిక్షణ శిబిరాలకు హాజ రయ్యారు. ప్రకృతి వ్యవ సాయ పద్ధతులు అమలు చేస్తున్న తోటలకు స్వయంగా వెళ్లి చూశారు. అవన్నీ చూశాక తన కిన్నో ఆరెంజ్ తోటలో సమస్యల పరిష్కారానికి ప్రకృతి వ్యవసాయమే తగిన పరిష్కారమన్న నిర్థారణకు వచ్చారు. ఇక ఆలస్యం చేయకుండా పన్నెండు ఆవులను తెచ్చి గత ఏడాది ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టారు. మిట్ట మధ్యాహ్నం చెట్ల నీడ పడే సమయంలో ప్రతి పదిహేను రోజుల కోసారి డ్రిప్ ద్వారా జీవామృతం, ప్రతి 3 నెలలకోసారి ఎకరానికి 200 కిలోల చొప్పున ఘనజీవామృతం వేశారు. చిగురాకు దశలో ఆకు తొలిచే పురుగులు, పచ్చ పురుగులు ఆశించి నప్పుడు దశపర్ణి కషాయం, బ్యాక్టీరియా తెగుళ్లకు పుల్ల మజ్జిగ చల్లారు. క్రమంగా చెట్లు కోలుకోవడం ప్రారం భమైంది. ఖర్చు ఎకరాకు రూ. 2 వేలకు తగ్గింది. ఆయన తోటలో వచ్చిన అనూహ్యమైన మార్పును చూసి అప్పటి దాకా కిన్నో ఆరెంజ్ తీసేద్దామనకున్న సాటి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం వైపునకు మళ్లారు. అయితే, రసాయనిక వ్యవసాయం నుంచి ఒకేసారి ప్రకృతి సేద్యం వైపు మళ్లడంతో దిగుబడి నలభై టన్నులకు తగ్గింది. ప్రకృతి సాగు వల్ల కన్నో ఆరెంజ్ పండల పరిమాణం, రుచి, నిల్వ సామర్థ్యం పెరిగింది. కానీ మార్కెట్లో కేజీకి రూ. 35 ధర పలకడంతో ఆదాయం తగ్గలేదు. క్రమంగా భూమి శక్తిని పుంజుకోవడంతో ఈ సంవత్సరం 11 ఎకరాల పాత తోటలో 60 టన్నుల దిగుబడి వస్తుందని సత్యా రెడ్డి అంచనా. 9 ఎకరాల తోటలో తొలిపంటగా 20 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందం టున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన కిన్నో ఆరెంజ్ సైజులోను, నాణ్యతలోను చాలా మెరుగ్గా ఉండటం విశేషం. పంజాబ్‌లో పంట లేని సమయంలో ఇక్కడ పంట రావడం మార్కెటింగ్ విషయంలో కలిసొచ్చే అంశమైంది. కినోవాను ఆయన చెన్నై, బెంగళూరుకు ఎగుమతి చేస్తుంటారు. ప్రకృతి సేద్యంలో కిన్నో ఆరెంజ్ పంట ఇచ్చిన స్థైర్యంతో మరో 17 ఎకరాల్లో కిన్నో ఆరెంజ్ వేశారు. సత్యారెడ్డి జీవితం ఒక పోరాటం. ఒక ఎడతెగని అన్వేషణ. రైతుగా ప్రకృతితో అనుబంధాన్ని పునరుద్ధరిం చుకోవడమే ఆయన విజయ రహస్యం!
- కె. క్రాంతికుమార్‌రెడ్డి
తీపి బత్తాయి.. ఎర్ర నిమ్మ!
గత సంవత్సరం జలంధర్ వెళ్లినప్పుడు సిట్రస్ జాతికి చెందిన మాల్లా బ్లడ్ రెడ్, మాల్టా జఫ్ఫాల గురించి సత్యారెడ్డికి తెలిసింది. ఆ మొక్కలు తెచ్చి కిన్నో ఆరెంజ్ తోటలో ప్రయోగాత్మకంగా అంతరపంటగా సాగు చేస్తున్నారు. కిన్నో ఆరెంజ్ ఏడాదికి ఒకసారి కాపుకొస్తే.. మాల్టా జఫ్ఫా 2, 3 సార్లు కాపుకొస్తుంది. ఇది చూడటానికి బత్తాయిలా ఉండి, కిన్నో ఆరెంజ్ కన్నా తియ్యగా ఉంటుంది. గుజ్జు, రసం కూడా ఎక్కువే. మాల్టా బ్లడ్ రెడ్ లోపల రక్త వర్ణంలో ఉంటుంది. దీని రసం ఒక నెల రోజుల పాటు నిల్వ చేసినా ఏమాత్రం పాడవదని చెబుతున్నారు.
పంటకాలం 45 ఏళ్లు!
ప్రకృతి వ్యవసాయంలో సిట్రస్ తోటల పంటకాలం 45 ఏళ్లుంటుంది. పంజాబ్‌లో కిషన్‌కుమార్ జాకడ్ అనే రైతు పొలంలో 40 ఏళ్లనాటి కిన్నో ఆరెంజ్ తోట చూసి.. ఈ పంటను సాగు చేస్తున్నా.. మా తోటలో వ్యవ సాయ పనులన్నీ నా భార్య మాణిక్యమ్మ చూసుకుంటారు. అసలు శ్రమంతా ఆమెదే. నేను సలహాదారుడ్ని మాత్రమే.
- గని సత్యారెడ్డి(90007 59372), తనగల, వడ్డేపల్లి మండలం,
మహ బూబ్‌నగర్ జిల్లా