Ordinary buses
-
60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. సకాలంలో అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొద్ది రోజులుగా సిటీ ఆర్డినరీ బస్సులను మేడారం జాతరకు తరలిస్తున్నారు. దీంతో నగరంలో ట్రిప్పులు గణనీయంగా తగ్గాయి. ఉదయం, సాయంత్రం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు ఉండడం లేదు. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్‌లు కేవలం ఆర్డినరీ బస్సులో మాత్రమే చెల్లుబాటవుతాయి. మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్లలో వీరి పాస్‌లకు అనుమతి ఉండదు. ఆర్డినరీ బస్సులు లేకపోవడంతో మెట్రోల్లో చార్జీలు చెల్లించాల్సివస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఆర్డినరీ పాస్‌లపై రాకపోకలు సాగించే సాధారణ ఉద్యోగులు సైతం ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది. 60 శాతం బస్సులు అక్కడికే.. ► గ్రేటర్ పరిధిలో సుమారు 2,850 బస్సులు ఉన్నాయి. రోజుకు 20 వేలకు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. 25 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. ప్రస్తుతం 60 శాతం బస్సులను మేడారం జాతరకు తరలించారు. జాతర రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరంలోని డిపోలను ఉమ్మడి వరంగల్ జిల్లా డిపోలతో అనుసంధానం చేశారు. దీంతో సిటీ డిపోల్లో బస్సుల నిర్వహణ ప్రస్తుతం వరంగల్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. ► అధికారులను, సిబ్బందిని సైతం పెద్ద ఎత్తున మేడారంలో మోహరించారు. 3,845 బస్సులను మేడారం జాతర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో సిటీలో బస్సుల కొరత ఏర్పడింది. ఇది తాత్కాలికమే అయినా విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా బస్‌పాస్‌లు ఉన్న వారు చార్జీలు చెల్లించి మెట్రో బస్సుల్లో ప్రయాణం చేయాల్సివస్తోంది. ప్రత్యామ్నాయమేదీ? ► గ్రేటర్లో సుమారు 5 లక్షల స్టూడెంట్ పాస్‌లు ఉన్నాయి.1.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఉచిత పాస్‌లపై ఆర్డినరీ బస్సుల్లో స్కూళ్లకు వెళ్తున్నారు. పదో తరగతి వరకు అమ్మాయిలకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. ► కాలేజీలకు వెళ్లే విద్యార్థులంతా రూట్ పాస్‌లు, నెలవారీ బస్‌పాస్‌లపై వెళ్తున్నారు. ఆర్డినరీ బస్సులను మేడారానికి తరలించడంతో మెట్రో బస్సుల్లో వీటిని అనుమతించడం లేదు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సుల్లోనూ అనుమతించడం లేదు. ► జాతర పూర్తయ్యే వరకు తమ బస్‌పాస్‌లను పల్లెవెలుగు, మెట్రో బస్సుల్లో తాత్కాలికంగా అనుమతించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
సిటీ బస్సులు..మూణ్నాళ్ల ముచ్చటేనా?
- రద్దయిన బస్సు సేవలు - పునరుద్ధరించాలని ప్రయాణికుల డిమాండ్ రామడుగు, న్యూస్‌లైన్: కరీంనగర్ పట్టణానికి సమీప గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రవేశపెట్టిన సిటీ బస్సులు మూ ణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. గత నవంబర్‌లో అప్పటి ఆర్టీసీ చైర్మన్ ఎం. సత్యనారాయణరావు ప్రారంభించా రు. వీటిని కరీంనగర్ నుంచి తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కరీంనగర్ నుంచి కొత్తపలి, వెదిర గ్రామాలకు, మానకొండూర్ నుంచి పద్మనగర్ వరకు సర్వీసులను ప్రారంభించారు. గత ఏప్రిల్ చివరి వరకే బస్సులు నడిచాయి. ప్రస్తుతం ఈ సిటీ బస్సుల జాడ కనిపించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎమ్మెస్సార్ స్వగ్రామం వెదిర వరకు సిటీబస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ అధికారులు నవంబర్ 12 నుంచి సిటీ బస్సులను పొడిగిం చారు. వీటితో ఈ రూట్లోని గ్రామస్తులకు సౌకర్యవంతంగా ఉన్నాయి. ప్రస్తుతం రద్దు చేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర పనులకు కరీంనగర్ వెళ్లే వారికి అవస్థలు తప్పడం లేదు. కనిపించని ఆర్డినరీ బస్సులు కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి గుండా ఆర్డినరీ బస్సులు ఆధికారులు అంతంత మాత్రంగానే నడిపించడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారిపై గుండా కేవలం మూడు ఆర్డినరీ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నా రు.బస్సులు లేకపోవడంతో ఆటోల్లో రాకపోకలు సాగిస్తున్నామని వెదిరకు చెందిన సత్యనారాయణ తెలిపారు. ఆర్టీసీ ప్రవేశపెట్టిన సిటీ బస్సులను వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వెదిర, దేశరాజ్‌పల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. -
బస్సులు లేక విద్యార్థుల అవస్థలు
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: పాఠశాల సమయాల్లో తగినన్ని ఆర్డినరి బస్సులు లేకపోవడంతో ప్రమాదమని తెలిసినా విద్యార్థులు బస్సులకు వేలాడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. పెరియపాలెం, ఊత్తుకోట, కన్నిగైపేర్ ప్రాంతాల మధ్య తగినన్ని ఆర్డనరి బస్సు సర్వీసులు లేవు. పెరియపాలెంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు వెళుతుంటారు. వీరికి ప్రభుత్వం ఉచిత బస్సు పాస్‌లు ఇచ్చింది. ఈ మార్గంలో ఆర్డనరి సర్వీసులు లేవు. ఎప్పుడో ఒకటి వస్తుంది. పాఠశాలకు సరైన సమయంలో వెళ్లేందుకు విద్యార్థులు బస్సు కిటికీలు, డోరు వద్ద వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. బస్సు సర్వీసులు పెంచాలని గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు అవస్థలు ఎక్కువయ్యాయి. పరీక్షల్లో హాజరైనందుకు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఈ మార్గాల్లో బస్సు సర్వీసులను పెంచాలని విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
ఆర్టీసీ చార్జీల వాత
నేటి అర్ధరాత్రి నుంచే కొత్త చార్జీల అమలు =0-14 కిలోమీటర్లపై రూపాయి పెంపు =ఆ పైన రూ.2 చొప్పున పెంపుదల =పెరిగిన కనీస టికెట్ ధర =బస్‌పాస్‌లపై రూ.50 చొప్పున పెంచిన ఆర్టీసీ =ప్రయాణికుల బెంబేలు సాక్షి, సిటీబ్యూరో : సగటు ప్రయాణికుడే లక్ష్యంగా ఆర్టీసీ చార్జీల మోత మోగించింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు విరివిగా వినియోగించే ఆర్డినరీ బస్సులను సైతం వదిలి పెట్టకుండా గ్రేటర్లో బస్సు చార్జీలను పెంచేశారు. నగరంలో మొదటి 14 కిలోమీటర్లకు ఒక రూపాయి చొప్పున, అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపైన రూ.2 చొప్పున చార్జీలను పెంచుతూ ఆర్టీసీ సోమవారం నిర్ణయించింది. పెరిగిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో చార్జీలు పెంచిన ఆర్టీసీ మొదటి 10 కిలోమీటర్ల ప్రయాణంపై ఎలాంటి భారం మోపకుండా కొంత మేరకు ఊరట కలిగించింది. కానీ ఈసారి తక్కువ దూరం వెళ్లే ప్రయాణికులను కూడా వదిలి పెట్టకుండా పెంచారు. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల చార్జీలు, బస్‌పాస్‌ల ధరలు కూడా పెరిగాయి. వివిధ రకాల పాస్‌లపైన రూ.50 చొప్పున పెంచారు. చార్జీల పెంపు వల్ల గ్రేటర్ పరిధిలోని సుమారు 35 లక్షల మంది ప్రయాణికులపై సగటున రూపాయి చొప్పున రూ. 35 లక్షల భారం పడనుంది. ఈ మేరకు చూస్తే నెలకు రూ. 10.50 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఇందులో ఒక్క బస్‌పాస్‌లపైనే ప్రతి నెలా రూ.కోటీ 25 లక్షల భారం పడనుంది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ ప్రతిరోజు రూ.2.70 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుండగా పెంపు వల్ల ఇది రూ.3.05 కోట్లకు పెరగనుంది. డీజిల్ ధరల పెరుగుదల, విడిభాగాల ధరలు పెరగడం, బస్సుల నిర్వహణ భారం వంటి వివి ధ రకాల కారణాలతో ఆర్టీసీ 2010 నుంచి ప్రతి సంవత్సరం ప్రయాణికులపై మోత మోగిస్తూనే ఉంది. ఇటీవల పెరిగిన డీజిల్ ధరలు, సీమాంధ్ర సమ్మె నష్టాలు తదితర పరిణామాల దృష్ట్యా చార్జీల పెంపుపై కసరత్తు చేపట్టిన ఆర్టీసీ.. ఎట్టకేలకు సామాన్యుడి రవాణా సదుపాయాన్ని మరింత భారంగా మార్చేసింది. అయితే నగరంలోని వివిధ మార్గాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న పుష్పక్ ఏసీ బస్సుల ధరలు మాత్రం పెరగలేదు. వాటి ధరలు ప్రస్తుతం ఉన్న ప్రకారమే యథావిధిగా ఉంటాయని ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి. పెరిగిన చార్జీల తీరిదీ... మొదటి 14 కిలోమీటర్లకు రూపాయి చొప్పున పెరగనుంది. అంటే సికింద్రాబాద్ నుంచి కోఠీ, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, ఎల్బీనగర్ నుంచి నాంపల్లి, దిల్సుఖ్నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వంటి దగ్గరి రూట్లలో 14 కిలోమీటర్ల వరకు ప్రయాణికుడిపై రూపాయి చొప్పున భారం పడుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం 8 రూపాయలు చెల్లిస్తున్న ప్రయాణికుడు ఇక నుంచి 9 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. 14 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపైన రూ.2 చొప్పున భారం పడనుంది. దిల్సుఖ్నగర్-పటాన్చెరు, సికింద్రాబాద్-బీహెచ్ఈఎల్, కోటీ-కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, ఉప్పల్-కొండాపూర్, ఈసీఐఎల్-హైటెక్‌సిటీ వంటి పలు రూట్లలో 14 కిలోమీటర్లు దాటి వెళ్లే ప్రయాణికులు ఇక నుంచి రూ.2 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటివరకు రెండు బస్టాపులు లేదా 4 కిలోమీటర్ల వరకు ఉన్న కనీస టికెట్ ధర కూడా పెరుగుతుంది. ఈ మేరకు ప్రస్తుతం రూ.5 ఉన్న ఆర్డినరీ టిక్కెట్ ధర ఇక నుంచి రూ.6 చొప్పున మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.6 నుంచి రూ. 7కు, మెట్రో డీలక్స్ రూ.7 నుంచి రూ.8 కి, ఏసీ బస్సు 10 రూపాయల నుంచి రూ.12 కు పెరుగనున్నాయి. 2.5 లక్షల పాస్ వినియోగదారులపై భారం గ్రేటర్లో ప్రతి రోజు 2.5 లక్షల మంది ఆర్టీసీ బస్‌పాస్‌లపై రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రయాణికులను సైతం అధికారులు టార్గెట్ చేశారు. రూ.50 చొప్పున పెంచారు. బస్‌పాస్‌ల పైన ఇప్పటి వరకు ఆర్టీసీకి నెలకు రూ.18.75 కోట్ల ఆదాయం లభిస్తుండగా పాస్ ధరల పెంపు వల్ల మరో రూ.కోటీ 25 లక్షలు అదనంగా రానుంది. దీంతో పాస్‌లపై నెలకు రూ. 20 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది.