Organic Mango
-
సెమీ ఆర్గానిక్ పద్ధతిలో బంగినపల్లి మామిడి ... లక్షల్లో ఆదాయం
-
మామిడి తోటల్లోనే ఇథిలిన్ చాంబర్లు!
మామిడిని సాగు చేసే రైతులు మార్కెట్లో పంటను అమ్ముకోవటానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను మాగబెడుతున్నారనే సాకుతో మధ్య దళారీలు, మార్కెట్ ఏజెంట్లు కుమ్మక్కై రైతుల పొట్టకొట్టి లాభాలను తమ జేబుల్లో నింపుకుంటున్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే.. రైతు స్థాయిలో ఇథిలిన్ రైపెనింగ్ చాంబర్‌ను ఏర్పాటు చేసుకోవడమే మార్గం. అందరికీ రసాయన అవశేషాలు లేని మామిడి పండ్లు అందుబాటులోకి వస్తా. కాల్షియం కార్బైడ్ వినియోగంపై నిషేధించిన నేపథ్యంలో.. వినియోగదారులకు హాని కలగకుండా ఇథిలిన్ వాయువు ద్వారా కృత్రిమంగా పండ్లను మాగపెట్టే ఇథిలిన్ రైపెనింగ్ చాంబర్స్ గురించి ఇటీవల కాలంలో విస్తృతంగా చర్చజరుగుతోంది. అయితే వాణిజ్య పరంగా ఇథిలిన్ ఎక్కడ దొరుకుతుందనే అంశంపై చాలా మందికి సరైన అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ఇథిలిన్ ద్వారా మామిడికాయలు మాగపెట్టేందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానం... ఇథిలిన్ రైపెనింగ్ చాంబర్స్‌లో మామిడి కాయలను మాగబెట్టేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, ఉపయోగాల గురించి సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త కిరణ్ కుమార్ అవగాహన కల్పిస్తున్నారు. తోట వద్దే అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు రైతులు తోట వద్దే సొంతంగా రైపెనింగ్ చాంబర్‌ను నిర్మించుకోవచ్చు. లే దా అందుబాటులో వున్న గదిని వాడుకోవచ్చు. గాలి, వెలుతురు చొరబడకుండా.. కిటికీలు మూసి సీల్ చేయాలి. ఇప్పుడు ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో ఇథిలిన్ సిలిండర్లు దొరుకుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర రూ.350 వరకు ఉంటుంది. ఒక్కో సిలిండర్‌ను ఉపయోగించి 3 నుంచి 4 టన్నుల మామిడి కాయలను మాగపెట్టొచ్చు. తొలుత గదిని గాలి, వెలుతురు చొరకుండా సీల్ చేసుకోవాలి. రైపెనింగ్ చాంబర్లో మామిడికాయలను వుంచాలి. గది విస్తీర్ణంలో మూడో వంతుకు మించకుండా పక్వానికి సిద్ధంగా వున్న కాయలను క్రేట్లలో అమర్చుకోవాలి. 100 నుంచి 150 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఇథిలిన్ వాయువును ప్రవేశపెట్టాలి. 12 నుంచి 24 గంటల పాటు చాంబర్ తలుపులను మూసి ఉంచాలి. తర్వాత గదిని రెండు మూడు గంటల పాటు తెరిచి వుంచితే కార్బన్ డై ఆక్సైడ్ బయటకు పోయి కాయలు నల్లబడకుండా ఉంటాయి. తరువాత మరోమారు ఇథిలిన్ వాయువును పంపి మళ్లీ 12 గంటల పాటు గదిని మూసి వుంచాలి. నాలుగు నుంచి ఐదు రోజుల్లో పండ్లు పక్వానికి వచ్చి మంచి రంగు, రుచితో వుంటాయి. గదిని మూసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సన్నని పైపు ద్వారా.. ఇథిలిన్ వాయువును పంపాలి. రెగ్యులేటర్ సాయంతో అవసరమైన మొత్తంలో ఇథిలిన్ వాయువును పంపవచ్చు. మొదటి దశలో 150 పీపీఎం, రెండో దశలో 100 పీపీఎం వరకు వాయువును పంపాలి. కాల్షియం కార్బైడ్ వినియోగంతో కాయ చర్మం రంగు మారినా.. లోపల గుజ్జు మాత్రం పక్వానికి రాదు. కానీ ఇథిలిన్ వాయువు ద్వారా మాగపెట్టే పండ్లు లోపల గుజ్జు కూడా పూర్తిగా పక్వానికి వస్తుంది. అవసరమైతే వీటిని కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచి నింపాదిగా మార్కెటింగ్ చేసుకోవచ్చని కిరణ్ కుమార్ తెలిపారు. చైనా పొడికి శాస్త్రీయత లేదు కాల్షియం కార్బైడ్ వినియోగంపై నిషేధం విధించిన నేపథ్యంలో.. ప్రస్తుతం మార్కెట్లో మామిడి కాయలను కృత్రిమంగా మాగపెట్టేందుకు ‘చైనా పొడి’ని వాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాల్షియం కార్బైడ్‌ను పొడి చేసి వాడుతున్నారనే ఆరోపణలు కూడా వున్నాయి. అయితే చైనా నుంచి దిగుమతి అయిన ఈ పొడిని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పరిశోధన, ప్రయోగ సంస్థలేవీ ధ్రువీకరించలేదు. అధికారికంగా ఈ పొడి వాడకానికి ఎలాంటి అనుమతులు లేవని కిరణ్ కుమార్ తెలిపారు. రైపెనింగ్ చాంబర్‌గా మారిన రేకుల షెడ్డు! కుందూరు బుచ్చిరాంరెడ్డి ఎస్పీగా పనిచేసి పదవీ విరమణ చేసి వ్యవసాయం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దోమలోనిపల్లి ఆయన స్వగ్రామం.15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో మామిడిని సాగు చేస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి పండించిన మామిడి పండ్లను మార్కెట్‌కు తీసుకెళితే కమిషన్ ఏజెంట్లు నిండా ముంచేవారు. కాయలు కోసి.. వాహనాల్లోకి ఎక్కించేంత వరకు మంచి ధర ఇస్తామని నమ్మబలికేవారు. తీరా మార్కెట్‌కు వెళ్లిన తర్వాత వారిష్టం వచ్చిన ధర చెప్పి పైసలు చేతిలో పెట్టేవారు. ‘చూట్’ పేరిట 10 శాతం కాయలను ధర చెల్లించకుండానే తీసుకుంటున్నారు. గిట్టుబాటు కాకున్నా సరే వారు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని సృష్టించే వారు. మరోవైపు కాల్షియం కార్బైడ్ వినియోగంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటాన్ని ఆసరాగా చేసుకొని కమిషన్ ఏజెంట్లు రైతులను ఇబ్బంది పెట్టేవారు. ఏడాదంతా కష్టపడినా గిట్టుబాటు కాకపోవడంతో సొంతంగా మార్కెటింగ్ అవకాశాలపై బుచ్చిరాంరెడ్డి దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ‘మ్యాంగో మేళా’లో స్టాల్‌ను అద్దెకు తీసుకుని.. మూడు నాలుగు రోజుల్లోనే ఒక టన్ను వరకు పండ్లను లాభసాటి ధరకు అమ్ముకున్నారు. మరోవైపు పరిచయస్తులకు, అపార్ట్మెంట్ల వద్ద మొబైల్ వ్యాన్‌తో కొంత మేర అమ్మకాలు జరిపారు. అయితే అమ్మకాలు బాగున్నప్పటికీ సహజసిద్ధంగా పండ్లను మాగపెట్టడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల్లో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం సైంటిస్టు కిరణ్‌కుమార్ సూచన మేరకు తోటలో ఇన్నాళ్లూ స్టోర్ రూంగా వాడుతున్న రేకుల షెడ్డును ఎలాంటి ఖర్చు లేకుండా ‘రైపెనింగ్ చాంబర్’గా మార్చారు. గదిని పూర్తిగా మూసివేసి.. రేకులపైన ఎండుగడ్డి వేసి రోజూ నీటితో తడిపేవారు. దీంతో గది ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించగలిగారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సన్నటి పైపు ద్వారా నిర్దేశిత మోతాదులో ఇథిలీన్ వాయువును పంపుతూ పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఒక్కో కాయను మాగబెట్టడానికి 15 పైసలు ఖర్చవుతోంది. రిఫ్రాక్టోమీటర్తో పండ్ల పక్వాన్ని అంచనా వేస్తారు. దీని ఖరీదు రూ.1,600. ఇలా మాగపెట్టిన పండ్లను గ్రేడింగ్ చేసి సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజి గదిలో భద్రపరుస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించి స్కోప్ సర్టిఫికెట్‌ను కూడా బుచ్చిరాంరెడ్డి పొందారు. ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు మామిడి తోటను సందర్శించి, అనుసరిస్తున్న సేంద్రియ పద్ధతులు, ఇథిలిన్ వాయువుతో మాగపెట్టడాన్ని పరిశీలించింది. ఈ సంస్థ సిఫారసు మేరకే కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ పీజీఎస్ ఇండియా తెలంగాణ కౌన్సిల్ బుచ్చిరాంరెడ్డికి స్కోప్ సర్టిఫికెట్ ఇచ్చింది. – కల్వల మల్లికార్జున్ రెడ్డి, సాక్షి, సంగారెడ్డి జిల్లా ఫొటోలు: బగిలి శివప్రసాద్, ఫొటో జర్నలిస్ట్ కాయకు 15 పైసల ఖర్చుతో మాగబెట్టుకోవచ్చు రైపెనింగ్ చాంబర్లో మాగబెట్టిన మామిడి పండ్లను అమ్మేందుకు ఆర్గానిక్ సంతల్లో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాం. అపార్ట్మెంట్ల వద్ద నేరుగా అమ్మకాలు సాగిస్తున్నాం. నాణ్యత, రకాన్ని బట్టి మంచి ధర పలుకుతోంది. బిగ్ బాస్కెట్ లాంటి ఆన్లైన్ స్టోర్లు కూడా మేము పండించిన మామిడి పండ్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఒక్కో కాయకు 15 పైసల ఖర్చుతో ఇథిలిన్ చాంబర్లలో మాగబెట్టుకోవచ్చు. ఇథిలిన్ చాంబర్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు సిలిండర్లు ఇవ్వాలి. చిన్న రైతులు నేరుగా మార్కెటింగ్ చేసుకునేలా సౌకర్యాలు కల్పించాలి. ఆమ్చూర్, గుజ్జు తయారీ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ప్రోత్సహించాలి. – కుందూరు బుచ్చిరాంరెడ్డి (94412 84289) సేంద్రియ మామిడి రైతు, దోమలోనిపల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం రైతులకు శిక్షణ ఇస్తున్నాం! స్వల్ప ఖర్చుతోనే రైతు స్థాయిలో తోటల్లోనే ఇథిలిన్ ద్వారా మామిడి కాయలను మాగపెట్టడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇథిలిన్ ద్వారా మాగబెట్టడం, రైపెనింగ్ ఛాంబర్ల ఏర్పాటు తదితర అంశాలపై ముందుకు వచ్చే వారికి సలహాలు, సూచనలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యాన శాఖ ద్వారా బృందాలుగా వచ్చే ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇస్తున్నాం. నేరుగా వచ్చే రైతులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. ఇథిలిన్ ఛాంబర్ల ఏర్పాటుపై మరిన్ని వివరాల కోసం.. ‘ఫల పరిశోధనా స్థానం, సంగారెడ్డి జిల్లా – 502001, తెలంగాణ రాష్ట్రం’ చిరునామాలో లేదా 08455– 276451 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు. – డాక్టర్ కిరణ్ కుమార్ (94401 08930) సీనియర్ శాస్త్రవేత్త, ఫల పరిశోధనా స్థానం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం -
ఇంకిన చినుకులే సిరులు పంచాయి!
- చెక్ డ్యాంల నిర్మాణంతో కరువును జయించిన గిరిజన తండా - రెండేళ్లుగా సరైన వర్షాలు లేకున్నా జలసిరితో బావులు కళకళ - నీటి భద్రతతో ఏటా కొత్తగా 50 ఎకరాలు సాగులోకి.. కరువుకు చిరునామాగా నిలిచిన అనంతపురం జిల్లాలోని ఓ కుగ్రామం అది. దశాబ్దం క్రితం వ్యవ సాయమనే ఊహకూ తావులేదు. ప్రస్తుతం జలసిరితో తుల తూగుతూ నాణ్యమైన సేంద్రియ పంట ఉత్పత్తులకు మారుపేరుగా నిలిచింది. ఊరు చుట్టూతా చెక్ డ్యాంల నిర్మాణంతోనే గ్రామం జీవకళను సంతరించుకుంది. వాన నీటిని భూగర్భంలో ఇంకించుకోవటంపై చూపిన శ్రద్ధే ఆ గ్రామానికి శాశ్వత నీటి భద్రతను సాధించిపెట్టింది. స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ఆ గిరిజన తండా వాసులు సమష్టి చైతన్య స్ఫూర్తితో సాధించిన ఈ విజయం.. కరువు పీడిత గ్రామాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం.. తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ జల కళ ఉట్టిపడుతున్న గ్రామం గొల్లపల్లి తండా. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో రెండోది అనంతపురం జిల్లా. ఆ జిల్లాలోని తలుపుల మండలంలో ఉన్న ఆ తండాలో 130 కుటుంబాలు నివసిస్తున్నాయి. పక్క గ్రామాల్లో 500 అడుగుల లోతు బోర్లు వేసినా కరుణించని గంగ ఈ గ్రామంలో 15 అడుగుల లోతు బావుల్లోనే దర్శనమిచ్చి అచ్చెరువొందిస్తోంది. ఒక్క పంటను అదనులో సాగు చేయలేని కరువు కాలంలోనూ.. ఈ గ్రామంలోని రైతులు వివిధ రకాల పంటలను ఏడాదంతా సేంద్రియ విధానంలో సాగుచేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. తొలి చెక్ డ్యాంతోనే దశ తిరిగింది.. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో అనంతపురానికి చెందిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్వచ్ఛంద సంస్థ 2003లో గొల్లపల్లి తండాలో తొలి చెక్‌డ్యాంను నిర్మించింది. 2-7 కి. మీ. పరిధిలో కురిసిన వర్షపు నీరంతా చెక్ డ్యాంలోకి వ చ్చి చేరుతోంది. ఒక్కసారి నిండితే ఆరు నెలల పాటు నీరు నిల్వ ఉంటుంది. ఒక్క వానకే చెక్‌డ్యాంలు నిండిన సందర్భాలున్నాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు కొండల అంచుల వెంబడి అటవీ శాఖ సహాయంతో కందకాలను తవ్వుకున్నారు. బోరు బావుల వల్ల భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉందన్న అభిప్రాయంతో గ్రామ పరిధిలో బోర్లపై గ్రామ సంఘం నిషేధం విధించింది. చెక్‌డ్యాం నిర్మించిన తొలి ఏడాదే గ్రామంలో 9 బావులు తవ్వారు. 20 - 30 అడుగుల్లోనే సమృద్ధిగా నీరు లభించడంతో, ఆ ఏడాదే 20 ఎకరాల పొలం సాగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఏటా 40-50 ఎకరాల భూమి అదనంగా సాగులోకి వస్తోంది. ఊటబావుల సంఖ్య క్రమంగా 83కు చేరింది. ఇప్పుడా గ్రామంలో 700 ఎకరాల భూమికి కరువు కాలంలోనూ సాగు నీటికి దిగుల్లేదు. పక్క గ్రామాల్లో 500 అడుగుల లోతు తవ్వినా బోర్లలో నీరు పడటం లేదు. గొల్లపల్లితండాలో మాత్రం రోహిణి కార్తెలోనూ 15-20 అడుగుల లోతుగల బావుల్లోనే పుష్కలంగా నీరుంది. సేంద్రియ సేద్యపు బాట.. వాన నీటిని వొడిసిపట్టుకొని నీటి భద్రతను సాధించుకోవడంతోపాటు ఆ నీటిని పొదుపుగా సద్వినియోగం చేసుకోవడంలోనూ గొల్లపల్లి తండా ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆర్డీటీ సాయంతో ఊట బావుల వద్ద ప్రతి రైతూ ఒక సోలార్ మోటార్‌ను అమర్చుకున్నారు. అంతేకాదు.. సుస్థిర వ్యవసాయ కేంద్రం తోడ్పాటుతో సేంద్రియ సేద్యపు బాట పట్టారు. 2009 నుంచి గొల్లపల్లితండాలో సేంద్రియ వ్యవసాయం ప్రారంభమైంది. మామిడి, వేరుశనగ, వరి అక్కడ ప్రధానంగా సాగయ్యే పంటలు. వేసవిలో టమాటా, చిక్కుడు, మిరప, అనాస, సజ్జ, కొర్రలు వంటి పంటలు పండిస్తున్నారు. వరీ కంపోస్టు, పేడ ఎరువులు, వేపకషాయం, గోమూత్రంనే వాడుతున్నారు. సేంద్రియ మామిడికి రెండింతల ధర సేంద్రియ మామిడి పండ్లకు గొల్లపల్లి తండా ప్రసిద్ధి చెందినది. కాయ మంచి రంగు, నాణ్యత బావుండటంతో మామిడి పండ్లకు గిరాకీ పెరిగింది. బంగినపల్లి, అల్ఫాన్సా వంటి మామిడి రకాలకు స్థానికంగా లభించే ధరలతో పోల్చితే రెండింతల ధర లభిస్తోంది. వ్యాపారులే వచ్చి కొనుగోలు చే సి హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. విత్తన వేరుశనగ సాగులోనూ గొల్లపల్లి తండా పేరుగాంచింది. వ్యాపారులు రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకొని అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. గిట్టుబాటు ధర రాబట్టుకోవడం కోసం, మార్కెటింగ్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహకార సంఘాన్ని కూడా రైతులు ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఇటు గొర్రెలు.. అటు ఆవులు.. గొల్లపల్లి తండా పశుసంపదతో తులతూగుతోంది. గ్రామంలో 7 వేల గొర్రెలు ఉన్నాయి. బళ్లారి, నెల్లూరు జాతి రకం గొర్రెలను రైతులు పెంచుతున్నారు. ఇవి మూడు నెలల్లోనే అమ్మకానికి వచ్చి.. ఒక్కో గొర్రెకు రూ. 3 వేల వరకు ధర లభిస్తుంది. మరోవైపు పాడి పరిశ్రమ వృద్ధి చెందింది. ఒక్కో కుటుంబానికి 10-20 వరకు ఆవులున్నాయి. 55 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో ఉన్నత విద్యనభ్యసించే యువకుల సంఖ్య పెరిగింది. ఈ పదిహేనేళ్లలోనే గ్రామం నుంచి 55 మంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందటం విశేషం. మారుమూల కొండల్లోని ఒక తండా ఇంత వృద్ధిలోకి రావడానికి మూలకారకుడు భూక్యా బాల గంగాధర్ నాయక్. ఆ గ్రామవాస్తవ్యుడైన నాయక్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఉద్యోగం చేస్తూనే తండావాసులను వెలుగుబాటన నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తాను 30 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలిచారాయన. చెక్‌డ్యాంలు, కందకాల నిర్మాణంతో కరువును జయించి, పాడి పంటలతో సుభిక్షంగా అలరారుతున్న గొల్లపల్లి తండా మరెన్నో కరువు పీడిత గ్రామాల్లో కొత్త వెలుగులకు స్ఫూర్తి ప్రదాత కావాలని ఆశిద్దాం. - చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరి, అనంతపురం జిల్లా సేంద్రియ సాగుతో అధికాదాయం! 2009 నుంచి మా గ్రామ రైతులందరూ సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. మేం పండించే పంటలన్నింటికీ గిరాకీ ఉంది. మంచి ఆదాయం లభిస్తోంది. నీటి భద్రత, సేంద్రియ సేద్యమే మా బలం. చెక్‌డ్యాంలు, బావుల నిర్మాణంతోనే నీటి భద్రత కల సాకారమైంది. - భూక్యా బాల గంగాధర్ నాయక్ (94408 74442), సేంద్రియ రైతు, గొల్లపల్లి తండా, తలుపుల మం., అనంతపురం జిల్లా చెక్ డ్యాంలతో రెండింతల నీటి సంరక్షణ 10 -20 అడుగుల లోతులోనే బావుల్లో నీళ్లున్న గ్రామం అనంతపురం జిల్లా మొత్తంలో గొల్లపల్లి తండా ఒక్కటే. దీనిక్కారణం చెక్‌డ్యాంల నిర్మాణమే. చెక్‌డ్యాంల వల్ల అంతకుముందుకన్నా రెండింతల నీరు భూమిలోకి ఇంకుతుంది. చెక్‌డ్యాం నుంచి నీరు భూమి పై పొరల్లోకి మాత్రమే ఇంకుతుంది. కాబట్టే 10 అడుగుల ఊట బావుల్లో నీరు ఉంటున్నది. బోర్లు వేస్తే ఫెయిలవుతాయి. పైగా ఉన్న ఆ కొద్దిపాటి భూగర్భ జలాలూ త్వరగా ఖర్చయిపోతాయి. అందుకే గొల్లపల్లి తండా రైతులెవరూ బోర్లు వేయకూడదని తీర్మానించుకొని దానిని కచ్చితంగా పాటిస్తున్నారు. - గోపిరెడ్డి నాగేశ్వర్‌రెడ్డి (98490 49096), డెరైక్టర్, ఆర్డీటీ ఎకాలజీ సెంటర్, అనంతపురం తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి! ఐదేళ్లుగా ఈ తండా రైతులు సేంద్రియ సేద్యం చేస్తున్నారు. వేరుశనగ రసాయనిక సేద్యం చేసే రైతుల కన్నా తక్కువ ఖర్చుతోనే ఎకరానికి 2, 3 బస్తాల అధిక దిగుబడి తీస్తున్నారు. భారీ వర్షాన్ని, సుదీర్ఘ బెట్టను సైతం పంటలు తట్టుకుంటున్నాయి. నాణ్యమైన విత్తనాలకు ఈ గ్రామం పెట్టింది పేరు. - కె. ఆదినారాయణ (94904 37796), సుస్థిర వ్యవసాయ కేంద్రం, కదిరి