కొనసాగుతున్న కార్మికుల ఆందోళన
కాగజ్నగర్టౌన్ : కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళలు కొనసాగుతూనే ఉన్నాయి. పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచి 46 రోజులు గడుస్తున్నా యాజమాన్యం గానీ, ప్రభుత్వంగానీ స్పందించకపోవడం, డ్యూటీలు లభించకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు.
బుధవారం పట్టణంలో భిక్షాటన చేసిన కార్మికులు, గురువారం మిల్లు ప్రధాన ద్వారం వద్ద వంటావార్పు చేసి నిరసన తెలిపారు. పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచిపోవడంతో అందులో పని చేసే 1600 మంది కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడ్డారని, విధులు దొరకక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయకుండా కాంట్రాక్టు కార్మికులకు విధుల నుంచి దూరం చేయడం విడ్డూరమన్నారు.
కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు సిర్పూర్ పేపర్ మిల్లు ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) నాయకులు సంపూర్ణ మద్దతు పలికారు. సంఘం నాయకులు అంబాల ఓదెలు వంటావార్పు కార్యక్రమంలో పాల్గొని కార్మికుల పక్షాన ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కాంట్రాక్టు కార్మికుల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు.
పేపర్ మిల్లు పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత తీసుకునేందుకు అధికార గుర్తింపు సంఘం నాయకులు ముందుకు రావాలన్నారు. గుర్తింపు సంఘం నాయకుల వైఫల్యంవల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సంఘం 6 మన్ కమిటీ నాయకులు గొలెం వెంకటేశ్, యాకబ్, అంజయ్య, ఎస్కే నవాబ్, ఎమ్మాజీ సంతోష్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.