Param
-
‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నేషనల్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేసేందుకు రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూ.850 కోట్లతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను సైతం ప్రధాని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక అభివృద్దిలో భారత్ కొత్తపుంతలు తొక్కుతుందని తెలిపారు. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా గొప్ప విజయాలు సాధించిన రోజుగా అభివర్ణించారు. సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగం ఏదీ లేదని ప్రధాని మోదీ అన్నారు. ఈ విప్లవంలో మన వాటా బిట్లు, బైట్లలో కాకుండా టెరాబైట్లు, పెటాబైట్లలో ఉండాలని తెలిపారు. మనం సరైన వేగంతో సరైన దిశలో పయనిస్తున్నామని ఈ ఘనత నిరూపిస్తోందని పేర్కొన్నారు.With Param Rudra Supercomputers and HPC system, India takes significant step towards self-reliance in computing and driving innovation in science and tech. https://t.co/ZUlM5EA3yw— Narendra Modi (@narendramodi) September 26, 2024 ‘2015లో జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్‌ను ప్రారంభించాం. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ ముందంజలో ఉంది. ఇది ఐటీ, తయారీ, ఎమ్ఎస్ఎమ్ఈలు, స్టార్టప్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.టెక్నాలజీలో పరిశోధనలు సామాన్యులకు ఉపయోగపడేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశం పెద్ద విజన్ కలిగి ఉంటేనే ఉన్నత విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగలదు. పేదలకు సాధికారత కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలి’ అని పేర్కొన్నారు. -
వచ్చే ఏడాదిలోగా స్వదేశీ సూపర్ కంప్యూటర్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలోగా కేంద్రం.. సూపర్ కంప్యూటర్ను దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలకు అందించనుంది. దేశ తొలి సూపర్ కంప్యూటర్ ‘పరమ్’ను తయారు చేసిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్‌కు ఈ ప్రాజెక్టు బాధ్యతల అప్పగించారు. సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద రూ. 4,500 కోట్లు కేటాయించినట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తెలిపింది. -
మగపాత్రల్లో మేటి కనకం
ఆ గొంతులో లలిత గీతాలు ప్రాణం పోసుకుంటాయి. ఆమె పలికిన పద్యాలు అభిమాన తరంగాలై ఎగసిపడతాయి. ఆ కళ్లల్లోని చిలిపితనం నటనకు భాష్యం చెబుతుంది. 70ఏళ్ల తెలుగు చిత్రసీమకు సజీవ సాక్ష్యంగా నిలిచి.. సినీరంగంలోనే కాదు జీవితంలోనే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న అలనాటి మేటి నటీమణి కనకం. అనారోగ్యంతో సోమవారంరాత్రి పూర్ణానందంపేటలోని తన నివాసంలో పరమ పదించారు. కన్నీటి కథగా సాగిన కనకం జీవిత చరిత్ర ఎందరికో గుణపాఠం. - 70ఏళ్ల సినీ చరిత్రకు సజీవ సాక్ష్యం - ఎన్నో చిత్రాల్లో నటించిన నటీమణి - నగరంతో సుదీర్ఘ అనుబంధం విజయవాడ కల్చరల్ : కనకం 1930లో ఖరగ్‌పూర్‌లో అప్పలస్వామి, షోలాపూరమ్మకు జన్మించారు. 1940లో విజయవాడ చేరుకున్నారు. అప్పటి నుంచే విజయవాడే ఆమె రంగస్థల వేదికైంది. నటనపై మక్కువతో 11ఏళ్ల వయసులోనే నటించడం మొదలుపెట్టారు. మొదటిసారిగా ‘ప్రతిమ’ అనే నాటకం ద్వారా రంగప్రవేశం చేశారు. బాలనటిగా వందలాది నాటకాల్లో నటించారు. స్త్రీలు మగవేషం వేయడానికి భయపడే రోజుల్లో ఆనాటి సీనియర్ నటులు తాపీ ధర్మారావు, పీసపాటి, షణ్ముఖి ఆంజనేయరాజు, ధూళిపాళ వంటి వారితో పోటీపడి మగపాత్రల్లో నటించారు. మద్రాస్ రేడియో కేంద్రంగా ప్రసారమైన వందలాది లలిత గీతాల కార్యక్రమాల్లో తన గానామృతాన్ని పంచారు. సినీ రంగప్రవేశం చేసి వందకుపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. సినీ ప్రస్థానం 1949లో విడుదలైన ‘కీలుగుర్రం’ కనకం మొదటి చిత్రం. గుణసుందరి కథ, రక్షరేఖ, టింగురంగ, బాలనాగమ్మ, భక్తప్రహ్లాద, దాసి, లేతమనసులు చిత్రాల్లో వెండితెరపై వెలిగిపోయారు. ‘షావుకారు’ చిత్రంలో ఆమె నటించిన ‘చాకలి రామి’ పాత్ర ద్వారా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సాధించారు. రామానాయుడు నిర్మించిన ద్రోహి చిత్రం ఆమె చివరి చిత్రం. ఎన్నో అవార్డులు 1999లో రాష్ట్రప్రభుత్వం ఉగాది పురస్కారం, 2003లో అప్పాజోస్యుల విష్ణుభొట్ల వారి సేవా పురస్కారం, మూవీ ఆర్టిస్ట్స్ విశిష్ట పురస్కారం, 2005లో అభిరుచి వారి పురస్కారం, 2005లో ఎన్టీఆర్ పురస్కారం అందుకున్నారు కనకం. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ఉత్తమ నటి పురస్కారాన్ని అందజేసింది. నగరంతో అనుబంధం కనకం నాలుగు దశాబ్దాలుగా నగరంలోనే ఉంటున్నారు. వెండితెరకు దూరమైన తరువాత తన మకాంను నగరానికి మార్చారు. కొన్నేళ్లుగా వయోభారంతో ఇబ్బంది పడుతుండటంతో సినీ పరిశ్రమ ఆమెను మరిచిపోయింది. పలువురి సంతాపం కనకం మృతికి పలువురు ప్రముఖులు మంగళవారం సంతాపం తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఆమెకు నివాళులర్పిస్తూ నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆమె విగ్రహం పెట్టాలని కళాకారులక సూచించారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, గుమ్మడి జైరాజ్ కళాపీఠం అధ్యక్షుడు గుమ్మడి రత్నకిషోర్, రంగస్థల నటుడు గుమ్మడి జీవన్‌కుమార్, తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు, రమణా కల్చరల్ ఆర్ట్స్ అధ్యక్షులు మాంతి రమణ, ఉపాధ్యక్షుడు ప్రభల శ్రీనివాస్, కార్యదర్శి నారుమంచి నారాయణ, ఎక్స్‌రే కార్యదర్శి బి.ఆంజనేయరాజు తదితరులు కనకం మృతికి సంతాపం తెలిపారు. గర్వించదగిన నటీమణి పురుషులతో సమానంగా మగ పాత్రలు ధరించిన మహానటి కనకం. 50ఏళ్ల తెలుగు సినిమాకు సజీవ సాక్ష్యం పీసపాటి, షణ్ముఖి ఆంజనేయరాజు, ధూళిపాళ వంటి మహానటుల సరసన నటించి శభాష్ అనిపించుకున్నారు. - కర్నాటి లక్ష్మీనరసయ్య, ఆంధ్ర నాటక కళాసమితి వ్యవస్థాపకుడు నటనకు పాఠశాల ఆమె గతంలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆమెను సత్కరించుకునే అవకాశం దక్కింది. కాలంతో పాటు పోటీ పడిన నటి ఆమె. కనకం పేరుతో నట శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని గతంలో గతంలోనే సూచించాం. - గోళ్ల నారాయణరావు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి -
డెంటిస్ట్ నుంచి డైరె క్టర్ వరకూ..!
అంతర్జాతీయ స్థాయి సినిమా అంటే అది కొందరికే సాధ్యమయ్యేది కాదు... హృదయాన్ని తాకే కథ ఏదైనా ప్రపంచ స్థాయి సినిమాకు ముడి సరకు కాగలదు. అందుకే ఎవరైనా ప్రపంచస్థాయి సినిమాను రూపొందించగలరు... అని అంటాడు పరమ్‌గిల్. ఈ సిద్ధాంతాన్ని ఇతరుల కోసమే చెప్పడం లేదు. సొంతంగా నమ్మాడు. ప్రపంచ స్థాయి సినిమాలను రూపొందించాడు. అవార్డులను అందుకొన్నాడు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ఎవరైనా సమ్మతించాల్సిందే! శాన్ఫ్రాన్సిస్కోలో ఇటీవల జరిగిన గ్లోబల్ మూవీ ఫెస్టివల్లో గిల్ రూపొందించిన రెండు సినిమాలు ప్రదర్శనకు నోచుకొన్నాయి. ఇలాంటి అరుదైన రికార్డు సాధించిన దర్శకుడితను. ఒక బాలీవుడ్ సినిమా, ఒక హాలీవుడ్సినిమా.. ఈ రెండు సినిమాలూ గ్లోబల్ మూవీ ఫెస్టివల్లో ప్రదర్శితమయ్యాయి. గిల్‌కు ప్రశంసలు దక్కేలా చేశాయి. ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన ఇతడికి ఉత్తమ దర్శకుడిగా అవార్డుతో పాటు లక్ష డాలర్ల బహుమతిని కూడా దక్కడం విశేషం. వృత్తిరీత్యా గిల్ ఒక డెంటిస్ట్ కావడం మరింత విశేషమైన అంశం. పంజాబ్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగాడు... అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కొని చదువు అనే అర్హతతోనే అమెరికాకు చేరుకొన్నాడు. 2001లో ఇతడు అమెరికా వెళ్లాడు. అక్కడ మళ్లీ అవస్థలే. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు. అయినప్పటికీ చదువు కొనసాగించాడు. పగలంతా కాలేజ్‌కు వెళ్లి రాత్రిపూట ఒక గ్యాస్‌ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేసేవాడట. ఇలా స్వయం సంపాదనతోనే న్యూజెర్సీలోని ఒక వర్సిటీలో డెంటిస్ట్‌గా మాస్టర్ డిగ్రీని పూర్తి చేశాడు. ఇన్ని రకాల కష్టాలతో ఎదిగిన పరమ్‌గిల్ కట్ చేస్తే దర్శకుడయ్యాడు. దాదాపు ఏడెనిమిదేళ్లు డెంటిస్ట్‌గా పనిచేసి.. అనేక వనరులను సమీకరించుకొని ‘రాకిన్ మీరా’ అనే సినిమాను రూపొందించాడు. ఆంగ్లంలో రూపొందించిన ఈ కామెడీ సినిమాను భారత్, అమెరికాల్లో చిత్రీకరించారు. సినిమా పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఎంతో కష్టపడ్డా ఫలితం మాత్రం అపజయమే. 2009 వేసవిలో అమెరికాలో విడుదల అయిన ఈ సినిమా ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. దాదాపు పదిహేను లక్షల డాలర్లు వెచ్చించి రూపొందించిన ‘రాకిన్ మీరా’ పదిలక్షల డాలర్లను కూడా వసూలు చేయలేకపోయింది. ఇది వ్యక్తిగతంగా గిల్‌కు భారీ నష్టమే. మరొకరయితే మళ్లీ సినిమా జోలికి వెళ్లే వారు కాదు. థియేటర్లో సినిమా చూడటానికి కూడా భయపడే వాళ్లేమో. కానీ గిల్ వెనక్కి తగ్గలేదు.భారీ నష్టాన్ని ఎదుర్కొన్నా భయపడలేదు. మరో సినిమాకు స్క్రిప్ట్ రాయడంలో మునిగిపోయాడు. అలా రూపొందించినదే ‘హోటల్ హాలీవుడ్’. ఈ సినిమాకు అమెరికాలో గొప్ప స్పందన వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీ కాసుల పంట పండించింది. సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో పరమ్‌కు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అపజయం ఎదురైనప్పుడు పరమ్‌గిల్ నిరాశ పడి ఉంటే, అక్కడే ఆగి ఉంటే దర్శకుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశం ఉండేది కాదు. విజయం సాధించిన పరమ్‌కు కొంతమంది నిర్మాతలు కలిసివచ్చారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఒకేసారి ఒక హాలీవుడ్ సినిమాను, మరో బాలీవుడ్ి సనిమాను రూపొందించే అవకాశాన్ని ఇచ్చారు. హాలీవుడ్ సినిమా పేరు ‘లాస్ట్ సప్పర్’, బాలీవుడ్సినిమా పేరు‘డీఓఏ- డెత్ ఆఫ్ అమర్’ ఈ రెండు సినిమాలూ అనేక ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమయ్యాయి. విమర్శల ప్రశంసలను అందుకొన్నాయి. ఈ రెండు సినిమాలూ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. పరమ్ సినిమాలు అన్నీ థ్రిల్లర్లే. అయితే ఆ సినిమాల్లో ఉన్న మలుపుల కన్నా పరమ్ జీవితంలోనే ఎక్కువమలుపులున్నాయి! డెంటిస్టుగా స్థిరపడాల్సిన పరమ్ సృజనాత్మకతను ఆయుధంగా మలుచుకొని దర్శకుడిగా ఎదిగిన తీరుకు మించిన మలుపు ఏముంటుంది! సినీ పరిశ్రమలో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు గిల్. ఆ పుస్తకం పేరు ‘హౌ టు లాస్ ఏ మిలియన్ డాలర్స్ అండ్ నాట్ లూజ్ యువర్ స్మైల్’. ఈ పేరును బట్టే అది ఎంతటి పాజిటివ్ ఔట్లుక్ ఉన్న పుస్తకమో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ మాత్రం పాజిటివ్నెస్ ఉంటే చాలదూ జీవితంలో విజేతగా నిలవడానికి!