మగపాత్రల్లో మేటి కనకం
ఆ గొంతులో లలిత గీతాలు ప్రాణం పోసుకుంటాయి. ఆమె పలికిన పద్యాలు అభిమాన తరంగాలై ఎగసిపడతాయి. ఆ కళ్లల్లోని చిలిపితనం నటనకు భాష్యం చెబుతుంది. 70ఏళ్ల తెలుగు చిత్రసీమకు సజీవ సాక్ష్యంగా నిలిచి.. సినీరంగంలోనే కాదు జీవితంలోనే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న అలనాటి మేటి నటీమణి కనకం. అనారోగ్యంతో సోమవారంరాత్రి పూర్ణానందంపేటలోని తన నివాసంలో పరమ పదించారు. కన్నీటి కథగా సాగిన కనకం జీవిత చరిత్ర ఎందరికో గుణపాఠం.
- 70ఏళ్ల సినీ చరిత్రకు సజీవ సాక్ష్యం
- ఎన్నో చిత్రాల్లో నటించిన నటీమణి
- నగరంతో సుదీర్ఘ అనుబంధం
విజయవాడ కల్చరల్ : కనకం 1930లో ఖరగ్‌పూర్‌లో అప్పలస్వామి, షోలాపూరమ్మకు జన్మించారు. 1940లో విజయవాడ చేరుకున్నారు. అప్పటి నుంచే విజయవాడే ఆమె రంగస్థల వేదికైంది. నటనపై మక్కువతో 11ఏళ్ల వయసులోనే నటించడం మొదలుపెట్టారు. మొదటిసారిగా ‘ప్రతిమ’ అనే నాటకం ద్వారా రంగప్రవేశం చేశారు. బాలనటిగా వందలాది నాటకాల్లో నటించారు. స్త్రీలు మగవేషం వేయడానికి భయపడే రోజుల్లో ఆనాటి సీనియర్ నటులు తాపీ ధర్మారావు, పీసపాటి, షణ్ముఖి ఆంజనేయరాజు, ధూళిపాళ వంటి వారితో పోటీపడి మగపాత్రల్లో నటించారు. మద్రాస్ రేడియో కేంద్రంగా ప్రసారమైన వందలాది లలిత గీతాల కార్యక్రమాల్లో తన గానామృతాన్ని పంచారు. సినీ రంగప్రవేశం చేసి వందకుపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు.
సినీ ప్రస్థానం
1949లో విడుదలైన ‘కీలుగుర్రం’ కనకం మొదటి చిత్రం. గుణసుందరి కథ, రక్షరేఖ, టింగురంగ, బాలనాగమ్మ, భక్తప్రహ్లాద, దాసి, లేతమనసులు చిత్రాల్లో వెండితెరపై వెలిగిపోయారు. ‘షావుకారు’ చిత్రంలో ఆమె నటించిన ‘చాకలి రామి’ పాత్ర ద్వారా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సాధించారు. రామానాయుడు నిర్మించిన ద్రోహి చిత్రం ఆమె చివరి చిత్రం.
ఎన్నో అవార్డులు
1999లో రాష్ట్రప్రభుత్వం ఉగాది పురస్కారం, 2003లో అప్పాజోస్యుల విష్ణుభొట్ల వారి సేవా పురస్కారం, మూవీ ఆర్టిస్ట్స్ విశిష్ట పురస్కారం, 2005లో అభిరుచి వారి పురస్కారం, 2005లో ఎన్టీఆర్ పురస్కారం అందుకున్నారు కనకం. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ఉత్తమ నటి పురస్కారాన్ని అందజేసింది.
నగరంతో అనుబంధం
కనకం నాలుగు దశాబ్దాలుగా నగరంలోనే ఉంటున్నారు. వెండితెరకు దూరమైన తరువాత తన మకాంను నగరానికి మార్చారు. కొన్నేళ్లుగా వయోభారంతో ఇబ్బంది పడుతుండటంతో సినీ పరిశ్రమ ఆమెను మరిచిపోయింది.
పలువురి సంతాపం
కనకం మృతికి పలువురు ప్రముఖులు మంగళవారం సంతాపం తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఆమెకు నివాళులర్పిస్తూ నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆమె విగ్రహం పెట్టాలని కళాకారులక సూచించారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, గుమ్మడి జైరాజ్ కళాపీఠం అధ్యక్షుడు గుమ్మడి రత్నకిషోర్, రంగస్థల నటుడు గుమ్మడి జీవన్‌కుమార్, తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు, రమణా కల్చరల్ ఆర్ట్స్ అధ్యక్షులు మాంతి రమణ, ఉపాధ్యక్షుడు ప్రభల శ్రీనివాస్, కార్యదర్శి నారుమంచి నారాయణ, ఎక్స్‌రే కార్యదర్శి బి.ఆంజనేయరాజు తదితరులు కనకం మృతికి సంతాపం తెలిపారు.
గర్వించదగిన నటీమణి
పురుషులతో సమానంగా మగ పాత్రలు ధరించిన మహానటి కనకం. 50ఏళ్ల తెలుగు సినిమాకు సజీవ సాక్ష్యం పీసపాటి, షణ్ముఖి ఆంజనేయరాజు, ధూళిపాళ వంటి మహానటుల సరసన నటించి శభాష్ అనిపించుకున్నారు.
- కర్నాటి లక్ష్మీనరసయ్య, ఆంధ్ర నాటక కళాసమితి వ్యవస్థాపకుడు
నటనకు పాఠశాల ఆమె
గతంలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆమెను సత్కరించుకునే అవకాశం దక్కింది. కాలంతో పాటు పోటీ పడిన నటి ఆమె. కనకం పేరుతో నట శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని గతంలో గతంలోనే సూచించాం.
- గోళ్ల నారాయణరావు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి