Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు
ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి.. ‘హరహర మహాదేవ..శంభో శంకర’(Hara Hara Mahadeva..Shambho Shankara) అంటూ శివనామస్మరణలతో మారుమోగనున్న శివాలయాలు. భక్తిపావశ్యంలో శివభక్తులు మునిగితేలే వేళ.. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయానికి లెక్కకుమించినంతమంది భారతీయులు తరలివెళ్లనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు భారత్ నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు తరలివెళుతున్నారు. భాగమతి నది ఒడ్డున ఉన్న ఐదవ శతాబ్దపు ఈ ఆలయంలో శివరాత్రి పూజలు నిర్వహించేందుకు నాలుగువేల మంది సాధువులతో పాటు, వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారని పశుపతినాథ ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయని పశుపతి ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు.శివరాత్రి(Shivaratri) రోజున భక్తుల భద్రతకు 10 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. అలాగే 5,000 మంది స్వచ్ఛంద సేవకులను భక్తులకు సేవలు అందించనున్నారు. మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున 2.15 గంటలకు పశుపతినాథ్ ఆలయం తెరుచుకుంటుందని, ఆలయంలోని నాలుగు ద్వారాల నుండి భక్తులు మహాశివలింగాన్ని దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం, మాంసం, చేపల అమ్మకం, వినియోగాలను నిషేధిస్తూ ఖాట్మండు జిల్లా పరిపాలన కార్యాలయం(Kathmandu District Administration Office) నోటీసు జారీ చేసింది. సోమవారం నుండి గురువారం వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. దీనిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హిమాలయాలు శివుని నివాసమని హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు. నేపాల్‌లో పెద్ద సంఖ్యలో శైవులు ఉన్నారు. వీరు శివుణ్ణి ప్రధానంగా ఆరాధిస్తుంటారు.ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్ పింఛనెంత?