pedda shankarampet
-
ఇక అంతా.. ఈ–పాలన
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్) : ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ –2018 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనతో పాటు గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు, అధికారులకు పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఈ–పాలన ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గత నెలలో జిల్లాస్థాయి అధికారులతో పాటు డీపీఎంలకు పంచాయతీరాజ్ చట్టంపై శిక్షణ కల్పించింది. వీరు ఆయా మండలాల్లో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామాన్ని ఇక ఈ–పంచాయతీ దిశగా మార్చేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 157 కొత్తగా ఏర్పాటయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ల వారీగా విధులు నిర్వర్తించే వారు. వీరికి గతంలో 171 వరకు కంప్యూటర్లను అందించారు. మూడు, నాలుగు పంచాయతీలకు చొప్పున క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడే కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి ప్రజలకు సేవలందించారు. సరైన వేతనాలు లేక పోవడం, శిక్షణ ఇవ్వకపోవడం, జీతాలు సక్రమంగా రాకపోవడంతో చాలా చోట్ల కంప్యూటర్ ఆపరేటర్లు అందుబాటులో లేరు. దీంతో ఆయా పంచాయతీలకు మంజూరైన కంప్యూటర్లు మూలనపడ్డాయి. మండల కార్యాలయాల్లోనే ఒక గదిని ఏర్పాటు చేసి ఉన్న కొంత మంది ఆపరేటర్లతోనే ఆయా పంచాయతీలకు సంబంధించిన రికార్డులను ఆన్లైన్ చేస్తున్నారు. గ్రామ కార్యదర్శులు పంచాయతీల్లో ఉండలేక మండల కార్యాలయాల నుంచి విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో నూతనంగా ప్రతీ గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శిని నియమించారు. విధుల్లో చేరిన వారికి కంప్యూటర్లపై అవగాహన ఉంది. వీరికి కంప్యూటర్లను అందుబాటులోకి తెస్తే గ్రామాల్లోనే పారదర్శకమైన పాలన అందించే అవకాశం ఉంది. కొనసాగుతున్న శిక్షణ శిబిరాలు జిల్లాలోని పాపన్నపేట, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, తూప్రాన్, చేగుంట, నర్సాపూర్, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, కౌడిపల్లి, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, నిర్మాణాలు, బిల్లులు, లేఅవుట్స్, ట్రేడ్‌లైసెన్స్ మంజూరు, రెన్యూవల్స్, ఇతర సిటిజన్ సర్సీసులను ఇకపై ఆన్లైన్ ద్వారానే చేపట్టడంపై నూతన గ్రామ కార్యదర్శులకు ఈ–పంచాయతీలపై శిక్షణ కల్పించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఈ–పంచాయతీపై జిల్లాలోని ఆయా మండలాల్లో పాత, కొత్త గ్రామ కార్యదర్శులకు కలిపి ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ కల్పిస్తున్నాం. ఈ–పంచాయతీ ద్వారానే రాబోయే రోజుల్లో పాలన కొనసాగనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో ఆయా పంచాయతీలకు కంప్యూటర్లు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామకార్యదర్శులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. – భానుప్రకాష్, డీపీఎం, మెదక్ -
కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య
పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధి కమలాపూర్‌లో కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.స్థానిక ఎస్ఐ విజయరావ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జాడు విఠల్ భార్య రేణుక(28) కుటుంబ సమస్యలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
పెద్దశంకరంపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మెదక్ డివిజన్ డిప్యూటీ డీఈఓ లింబాజీ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరుశాతం, పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈనెల 17న ఎంపీపీ రాయిని సంగమేశ్వర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డిప్యూటీ డీఈఓ స్పందించి వివరాలు సేకరించారు. వారంలో మూడు రోజులపాటు గుడ్లను అందించాలన్నారు. తనిఖీ సమయంలో ఎంఈఓ పోచయ్య, హెచ్ఎం రాజేశ్వర్, ఉపాధ్యాయులు చంద్రయ్య, రఘునాథ్‌రావు, విఠల్ తదితరులున్నారు. చిన్నశంకరంపేట: మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వారానికి మూడు గుడ్లు ఇవ్వాలని చిన్నశంకరంపేట ఎంఈఓ బాల్‌చంద్రం తెలిపారు. సోమవారం మండలంలోని మల్లుపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. తప్పనిసరిగా మధ్యాహ్న భోజనంలో మెను పాటించేలా ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎంఈఓ సందర్శించిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు నరేష్ కుమార్, ఉపాధ్యాయురాలు స్వప్న ఉన్నారు. -
'రూ.250 కోట్లతో ఎన్‌హెచ్-161 విస్తరణ'
పెద్దశంకరంపేట (మెదక్) : రూ.250 కోట్లతో 161వ జాతీయ రహదారిని విస్తరించనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. గురువారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం జంబికుంటలో రూ.1.24 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సంగారెడ్డి నుంచి నిజాంపేట వరకు 161వ జాతీయ రహదారిని 4 వరుసలుగా విస్తరించే పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే సంగారెడ్డి, జోగిపేట, పెద్దశంకరంపేటలో బైపాస్ రోడ్డులను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్క మెదక్ జిల్లాలోనే రూ.1000 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. -
స్కూలు బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి
పెద్ద శంకరంపేట (మెదక్) : స్కూల్ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం బుజ్రాన్‌పల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బుజ్రాన్‌పల్లికి చెందిన మాండ్రు రుక్కమ్మ (60) గ్రామం నుంచి పెద్ద శంకరంపేట వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న నారాయణఖేడ్‌కు చెందిన స్కూల్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రుక్కమ్మను కారులో సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. కాగా రుక్కమ్మకు భర్త గంగయ్యతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. -
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
పెద్దశంకరంపేట : బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జోగిపేట జూనియర్ సివిల్ జడ్జి రమాకాంత్ అన్నారు. శుక్రవారం పేట పోలీస్‌స్టేషన్‌లో బాలల సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. సమాజంలో బాల నేరస్తులు ఉండరాదన్నారు. బాలలను నేరస్తులుగా చూడొద్దని, వారిపై నేరస్తులన్న ముద్ర వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి : డిసెంబర్ 6న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని జడ్జి రమాకాంత్ పిలుపునిచ్చారు. అన్ని కోర్టుల్లో ఈ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జోగిపేట సీఐ రఘు, పేట ఎస్ఐ మహేష్ గౌడ్, న్యాయవాదులు భాస్కర్, లింగం, ఎస్హెచ్ఓ లక్ష్మణ్, చిరంజీవి, విఠల్ గౌడ్, ప్రేమ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులున్నారు.