Peddapalli constituency
-
పెద్దపల్లి నియోజకవర్గం పాలకవర్గం ఎవరు?
పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి సిటింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది విజయ రమణారావును 8466 ఓట్లు తేడాతో ఓడిరచారు. విజయ రమణారావు 2009లో టిడిపి పక్షాన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టిడిపి, బిజెపి అభ్యర్ధిగా, తదుపరి 2018లో ఆయన కాంగ్రెస్ ఐలో చేరి ఇక్కడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. మనోహర్ రెడ్డికి 82765 ఓట్లు సాదించగా, కాంగ్రెస్‌కు 74299 ఓట్లు మాత్రమే వచ్చాయి.మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బిజెపి పక్షాన పోటీచేసి కేవలం ఐదువేల ఓట్లు మాత్రమే పొందారు. దాసరి మనోహర్ రెడ్డి మరోసారి గెలవడం ద్వారా పట్టు నిలబెట్టుకున్నారు. 2014లో డి.మనోహర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి , ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాదరావుపై 62677 ఓట్ల భారీ ఆదిక్యతతో గెలుపొందారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం ఎంత తీవ్రంగా వీచిందో ఈ మెజార్టీ తెలియచేస్తుంది. ఎన్నికల తర్వాత బానూ ప్రసాద్ కూడా టిఆర్ఎస్లో చేరిపోయారు. పెద్దపల్లి శాసనసభ నియోజక వర్గంలో ఇంతవరకు మనోహర్ రెడ్డితో సహా పదిసార్లు రెడ్లు గెలిచారు. ఇద్దరు వెలమ, ఒక బిసి, ఇద్దరు ఎస్సి వర్గ నేతలు గెలుపొందారు. ముకుందరెడ్డి పెద్దపల్లి నుంచి మూడుసార్లు గెలిచారు. రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలవగా, 2004లో టిఆర్ఎస్ తరుఫున విజయం సాధించారు. ఆ తరువాత టిఆర్ఎస్లో అసమ్మతివర్గంలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చిన కేసులో శానససభ్యత్వానికి అనర్హునిగా అప్పటి స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి ప్రకటించారు. అయితే స్పీకరు తీర్పు రావడానికి ఒక రోజు ముందే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. తదుపరి కాంగ్రెస్ ఐలో చేరి 2009లో పోటీచేసి ఓడిపోయారు. కాగా 2009లో టిడిపి, టిఆర్ఎస్లు పొత్తు కుదిరినప్పటికీ, ఒక దశలో పొత్తు ఉంటుందో, ఉండదోనన్న అనుమానంతో టిడిపి తన అభ్యర్దులు పలువురికి టిఆర్ఎస్కు కేటాయించిన సీట్లలో పోటీకి సిద్దం చేసింది. అలాంటి చోట్లలో ఒకట్కెన పెద్దపల్లిలో టిడిపి పక్షాన బిఫారం ఇచ్చేయడంతో నామినేషన్ వేసిన విజయరమణరావు ఆ పార్టీ అభ్యర్ధిగానే రంగంలో ఉండి2009లో గెలిచారు. 1983లో సంజయ్ విచార్ మంచ్ తరపున టిడిపి గుర్తుపై పోటీచేసి గెలిచిన గోనె ప్రకాశరావు, కొద్దినెలలకే తన పదవికి రాజీనామా చేశారు. 1962లో పెద్దపల్లిలో గెలిచిన బుట్టిరాజారాం 1952లో జగిత్యాల, 57లో సుల్తానా బాద్‌లో, 1967లో నుస్తులాపూర్లోను మొత్తం నాలుగుసార్లు గెలిచారు. 1967లో ఇండిపెండెంటుగా గెలిచిన జె.మల్లారెడ్డి, 1972లో కాంగ్రెస్ తరుపున గెలిచారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఎమ్మెల్యేకు ఊహించని ఫోన్ కాల్.. టీఆర్ఎస్ గెలుస్తుందా సార్ అంటూ..
సాక్షి, పెద్దపల్లి: ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేల రాజీనామాలతో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల కారణంగా ప్రభుత్వం ఆ నియోజకవర్గాలకు భారీ మొత్తంలో ఫండ్స్ రిలీజ్ చేయడం, అభివృద్ధి పనులు చేపట్టడం చేయడం జరిగింది. దీంతో, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ప్రజలతో చేదు అనుభవం ఎదురైంది. కొందరు తమ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి నియోజకవర్గానికి చెందిన రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రశ్నించాడు. దీనికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. తనకు తెలియదు అని సమాధానం ఇవ్వడంతో.. పెద్దపల్లి అభివృద్ధి కావాలంటే మీరు కూడా రాజీనామా చేస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. దీనికి ఎమ్మెల్యే సమాధానం ఇస్తూ.. మంచిది.. నువ్వు ఇక్కడకు వచ్చి మాట్లాడు.. అన్నారు. కాగా, వీరిద్దరూ మాట్లాడిన వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
వివేక్‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్
సాక్షి, మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి.వివేక్‌కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గట్టి షాక్‌నిచ్చారు. పెద్దపల్లి లోకసభ స్థానం(ఎస్సీ) నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు వివేక్ సన్నద్ధమవగా, ఆయనను కాదని చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకొని మరీ బోర్లకుంట వెంకటేశ్ నేతకానికి చాన్స్ ఇచ్చారు. ఇక ఆదిలాబాద్ స్థానం(ఎస్టీ) మాత్రం సిట్టింగ్ ఎంపీ గోడం నగేష్నే వరించింది. సుధీర్ఘ కసరత్తు అనంతరం గురువారం రాత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొత్తం 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగ్‌కే ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్‌కే మరోసారి టీఆర్ఎస్ అవకాశం కల్పించింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన గోడం నగేష్‌కే ఈసారి కూడా టికెట్ వస్తుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే నగేష్‌కు పార్టీ టికెట్టు ప్రకటించారు. లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఒకరిద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు విముఖత వ్యక్తం చేసినా, అధిష్టానం మాత్రం నగేష్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన నగేష్, 1994 నుంచి టీడీపీలో కొనసాగారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరి టికెట్టు తెచ్చుకొన్నారు. ఈ ఎన్నికల్లో రెండోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. జంప్ ఫలితం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బోర్లకుంట వెంకటేశ్‌కు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిత్వం దక్కడం చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో వెంకటేశ్ గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్లో చేరిన కొన్ని గంటల్లోనే ఆయన టీఆర్ఎస్ బీ–ఫారం అందుకున్నారు. కాగా టికెట్ ఇస్తామనే గ్యారంటీతోనే ఆయన హడావుడిగా టీఆర్ఎస్లో చేరినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన బోర్లకుంట వెంకటేశ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓటమి చెందారు. ప్రస్తుతం చివరి నిమిషంలో పార్టీ మారి టీఆర్ఎస్ ఎంపీ టికెట్టు అందుకున్నారు. చక్రం తిప్పిన బాల్క సుమన్ పెద్దపల్లి ఎంపీ టికెట్ వెంకటేశ్‌కు రావడంలో చెన్నూరు ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ ప్రధానంగా చక్రం తిప్పినట్లు సమాచారం. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో అనూహ్యంగా బాల్క సుమన్‌కు పెద్దపల్లి ఎంపీ టికెట్టు దక్కింది. వివేక్‌పై సుమన్ గెలిచిన తరువాత, వివేక్ తిరిగి టీఆర్ఎస్లో చేరినప్పటికీ ఇరువురి నడుమ విభేదాలు మాత్రం కొనసాగాయి. నియోజకవర్గంలో ఆధిపత్య పోరు పలుమార్లు బయటపడింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి, చెన్నూరు అసెంబ్లీ బరిలో దిగారు. దీంతో వివేక్‌కు ఎంపీ టికెట్ ఖాయమని అంతా భావించారు. కాని అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారంటూ కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు ఇతర ఎమ్మెల్యేలను కూడగట్టడంలో సుమన్ కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా వివేక్‌కు ప్రత్యామ్నయంగా తన చేతిలో ఓడిపోయిన వెంకటేశ్‌ను కూడా సిద్ధం చేసి ఉంచారు. అయినప్పటికీ వివేక్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందని పార్టీ వర్గాలు భావించాయి. కాని బుధ, గురువారాల్లో మారిన నాటకీయ పరిణామాలతో వివేక్‌కు బదులు వెంకటేశ్ అకస్మాత్తుగా తెరపైకి వచ్చారు. మొత్తానికి తన ఆధిపత్యానికి అడ్డుగా మారనున్న వివేక్‌ను అడ్డుకోవడంలో సుమన్ సఫలం చెందినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే టికెట్టు దక్కని వివేక్ భవిష్యత్ నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివేక్ భవితవ్యం ఎటు? పెద్దపల్లి సీటు చేజారిన మాజీ ఎంపీ వివేకానంద రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడింది. 2013లో తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉంటూనే తన సోదరుడు వినోద్‌తో కలిసి టీఆర్ఎస్లో చేరిన ఆయన ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో వివేక్‌కు ఎంపీ సీటు ఖరారైనప్పటికీ, తన సోదరుడు వినోద్‌కు చెన్నూరు టికెట్టు ఇవ్వని కారణంగా పార్టీని వీడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో పెద్దపల్లి టికెట్టు హామీతో మరోసారి టీఆర్ఎస్లో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తన సోదరుడికి టికెట్టు విషయంలో కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేయగా, టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నయ్యకు వ్యతిరేకంగా తన సోదరుడిని గెలిపించేందుకు కృషి చేశారని ప్రభుత్వ నిఘా వర్గాలు కేసీఆర్‌కు సమాచారం ఇచ్చాయి. అదే సమయంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా తమను ఓడించేందుకు వివేక్ ప్రయత్నించారని చేసిన ఫిర్యాదులతో ఆయన సీటుపై వేటు పరిపూర్ణమైంది. కాగా ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్లే సాహసం చేస్తారా లేదా అనేది అర్థం కావడం లేదు. బీజేపీ నేతలు ఇప్పటికే వివేక్‌తో టచ్‌లో ఉండి, పెద్దపల్లి సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదు. వివేక్ బీజేపీలో చేరితే టికెట్టు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంది. అయితే గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో మరోసారి సాహసం చేస్తారా లేదా అనేది చూడాల్సిందే. -
అప్పు తెచ్చి.. ఐపీ పెట్టి!
పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చిన్న చిన్న వ్యాపారులే దివాళ తీసి ఐపీ పెట్టి ఊరు విడిచి వెళ్లారు. ఈమధ్యకాలంలో వరుసగా పెద్ద పెద్ద వ్యాపారులు ఐపీ పెట్టి పారిపోతున్నారు. తమకున్న పలుకుబడి మాట, మంచితనం వీటన్నిటిని ఆసరా చేసుకుని చుట్టాలు, బంధువులు, స్నేహితుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులుతీసుకున్న వారు ఊరువిడిచి ఊడాయిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో నలుగురు ప్రముఖులు చేతిలెత్తిన సంఘటనలు సంచలనం రేపుతున్నాయి. కాసులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు సదాల లక్ష్మయ్య సౌమ్యుడు కావ డంతో ఇరుగుపొరుగు వారు రూ.2 కోట్ల వరకు అప్పులిచ్చారు. ఆయన చేసిన క్రషర్దందాలో నష్టం రావడంతో ఊరు విడిచి వెళ్లిపోయారు. జాడ కనుక్కోవడానికి బంధువులు వెతుకులాట ప్రారంభించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన డ్రాయర్ బనియన్ల హోల్‌సెల్ షాప్ యజమాని రూ.3 కోట్లకుపైగా అప్పులు చేసి భార్యాపిల్లలతో వెళ్లిపోయూరు. ఆయన అప్పు తీసుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, కొడుకు కో డలు నలుగురివద్ద ఒక్కోరి నుంచి రూ.10 లక్షల చొప్పున అప్పులు తీసుకున్నారు. మరో వడ్డీ వ్యాపారిని మధ్యవర్తిగా పెట్టి రూ.2 కు వడ్డికి తెచ్చి రూ.3 చొప్పున మధ్యవర్తిద్వారా తీసుకుని మరీ ఉడారుుంచారు. బ్యాంకులో వేస్తే వడ్డి రూపాయలు చిల్లరకు కూడా కావని తాను రూ.2 నుంచి రూ.3 వరకు ఆశచూపడంతో ఎగబడి అప్పులిచ్చారు. ఇక పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు రూ.10 కోట్ల వరకు అప్పులు పుట్టించి పొరుగు రాష్ట్రాల్లో రియల్వ్యాపారంలో న ష్టపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇచ్చిన అసలుకు వడ్డీ అవసరం లేదు. కనీసం అసలైనా ఇప్పించడండి అంటూ బాధితులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పు తీసుకున్న సదరు వైద్యుడు మాత్రం అసలులో ఎంత తగ్గిస్తారంటూ బేరం ఆడుతున్నట్లు సమాచారం. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన మరో వ్యాపారి రూ.4 కోట్ల వరకు అప్పు చేశాడు. ఆయన ఆస్తులు మొత్తం రూ.2 కోట్లే ఉండడంతో కనీసం సగంతో సరిపుచ్చుకుందామంటూ బేరసారాలు నడుపుతున్నారు. కొంప ముంచుతున్న షేర్ మార్కెట్... దివాలతీసిన వారిలో షేర్ మార్కెట్లో లక్షలాది రూపాయలు వెచ్చించి నష్టాల బారిన పడడంతో వాటిని పూడ్చుకునేందుకు మరిన్ని అప్పులుచేసి షేర్ మార్కెట్లోపెట్టి నష్టపోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నష్టపోయిన నలుగురిలో ఇద్దరు షేర్ మార్కెట్ దందాలో చేతులుకాల్చుకున్న వారే కావడం విశేషం. చిన్న వ్యాపారులకు వడ్డీలకు ఇస్తే ముంచుతారని పెద్దవ్యాపారులను నమ్మితే అసలుకే సగంవచ్చే దిక్కులేకుండా పోయింది. -
'పెద్ద'రికం దక్కేదెవరికి?
సుదీర్ఘ చరిత్ర కలిగిన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎంపీ ఎవరవుతారని అందరూ ఎదురుచూస్తున్నారు. గెలుపు... ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌దా..? ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్‌దా..? అన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, సిట్టింగ్ ఎంపీ డాక్టర్ వివేకానంద కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంచిర్యాలకు చెందిన ప్రముఖ డాక్టర్ జానపాటి శరత్‌బాబును టీడీపీ బరిలో దింపింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ టీఆర్ఎన్ తరఫున ఢీ కొడుతున్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ డాక్టర్ వివేకానంద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వెంకటస్వామి తనయుడు. వెంకటస్వామి ఇక్కడ నుంచి చాలాకాలం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఏడుసార్లు పోటీచేసిన ఆయన నాలుగుసార్లు గెలిచారు. ఆయన వారసుడిగా వివేకానంద 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి గోమాస శ్రీనివాస్‌పై విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌ను వీడీ టీఆర్ఎస్లో చేరారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇటీవలే మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్ తరఫున విద్యార్థి నేత.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఓయూ జేఏసీ నేత బాల్క సుమన్‌ను టీఆర్ఎస్ ఇక్కడ నుంచి బరిలో దింపింది. యువ నాయకుడు కావడం, నియోజకవర్గంలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ధర్మపురి, చెన్నూరు, మంచిర్యాల స్ధానాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. ప్రస్తుతం టీఆర్ఎస్ వల్లే తెలంగాణ వచ్చిందన్న భావన జనంలో బాగా ఉండడం అనుకూలించే అవకాశం ఉంది. టీడీపీపై వ్యతిరేకత..! విద్యావంతుడు, సింగరేణిలో పని చేసిన డాక్టర్ శరత్‌బాబును టీడీపీ బరిలో దింపింది. రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఆయన కార్మికులకు సేవలందించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు విషయంలో టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు వ్యవహరించిన తీరు ప్రతికూల ప్రభావం చూపనుంది. నియోజకవర్గ పరిధిలోని ఒక్క సెగ్మెంట్లో కూడా టీడీపీ ఎమ్మెల్యే లేడు. బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. దీంతో పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. క్షేత్రస్ధాయిలో బీజేపీ శ్రేణుల సహకారమే టీడీపీ అభ్యర్ధికి దిక్కయింది. సింగరేణి సవాళ్లు..! సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం. డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్ ఉంది.పర్యావ రణాన్ని కాపాడే విధంగా.. ఓపెన్‌కాస్టులను నియంత్రించాలని నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నారు.సింగరేణి ఉద్యోగులకు ఆదాయ పన్ను రద్దుకు సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి తేవాలన్న డిమాండ్ ఏళ్ల నుంచి ఉంది. లోక్‌సభ నియోజకవర్గం: పెద్దపల్లి ఎవరెన్నిసార్లు గెలిచారు : కాంగ్రెస్ -9 టీడీపీ -4 టీపీఎస్ -1 తొలి ఎంపీ : ఎం.ఆర్. కృష్ణ (కాంగ్రెస్) ప్రస్తుత ఎంపీ : డాక్టర్ వివేకానంద (కాంగ్రెస్) ప్రస్తుత రిజర్వేషన్ : ఎస్సీ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు: పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి. మొత్తంఓటర్లు 14,17,460 పురుషులు 7,21,522 మహిళలు 6,95,880 ఇతరులు 58 ప్రస్తుతం బరిలో నిలిచింది: 17 ప్రత్యేకతలు: నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో సింగరేణి విస్తరించి ఉంది. సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం. ఎస్సీ ఓట్లు కూడా కీలకం. ప్రధాన అభ్యర్థులు వీరే: డాక్టర్ వివేకానంద (కాంగ్రెస్) బాల్క సుమన్ (టీఆర్ఎస్) జానపాటి శరత్‌బాబు (టీడీపీ) డాక్టర్ జి. వివేకానంద (కాంగ్రెస్) అనుకూలం.. 1.కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు 2. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్వచ్చంద సేవా కార్యక్రమాలు. హా సిట్టింగ్ ఎంపీ కావడం ప్రతికూలం... 3. కాంగ్రెస్‌నుంచి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడం. 4. స్ధానికంగా అందుబాటులో ఉండకపోవడం. 5.రామగుండం ఎఫ్‌సీఐ ఎరువుల కార్మాగార పనులు వేగవంతం చేస్తా. 6. సింగరేణిలో భూగర్భ గనులు ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేస్తా. 7. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను పరిమితి పెంపుకు ప్రయత్నిస్తా. 8. స్ధానిక యువకులకే.. ఓపెన్‌కాస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగాలందేలా కృషి చేస్తా. 9. రైతులకు సాగునీరందించే ఏర్పాట్లు చేస్తా. డాక్టర్ శరత్‌బాబు (టీడీపీ) అనుకూలం.. 1. సింగరేణి పరిధిలోని రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్‌గా సేవలందించడంతో కార్మికులతో విస్తృత పరిచయాలున్నాయి. 2. బీజేపీతో పొత్తు 3. సింగరేణి కార్మికులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్విస్తున్నారు. ప్రతికూలం... 4. రాజకీయాల్లోకి కొత్తగా రావడం. అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోవడం 5. రామగుండాన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తా. 6. మూతబడ్డ ఎరువుల కార్మాగారాన్ని తెరిపిస్తా. 7. రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో ఫై్లఓవర్ నిర్మాణానికి కృషి. 8. మంథనికి సాగునీరందిస్తా. 9. నియోజకవర్గానికి ఎల్లంపల్లి ద్వారా తాగు,సాగునీరందిస్తా. 10. ధర్మపురి దేవాలయ అభివృద్ధి, వేద పాఠశాల ఏర్పాటు. 11. మంచిర్యాల, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడిని తీర్చుతా. బాల్క సుమన్ (టీఆర్ఎస్) అనుకూలం.. 1. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జైలుకు వెళ్లడం. 2. ఓయూ జేఏసీ నేత కావడంతో విద్యార్ధులు, తెలంగాణవాదులను ఆకర్శించడం. 3.అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్వీ శాఖలు.. పార్టీ ప్రభావం. ప్రతికూలం... 4. జిల్లా వాస్తవ్యుడే అయినా, తొలిసారి పోటీచేయడం. 5. రామగుండంలో ఎఫ్‌సీఐ ఎరువుల కార్మాగార పునరుద్ధరణ, మూతబడ్డ పరిశ్రమలు తెరిపించేందుకు కృషిచేస్తా. 7. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రైతులకు సాగు నీరందించేలా చర్యలు తీసుకుంటా. మున్సిపాలిటీ ప్రజలకు తాగునీరందిస్తా. 8. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా పోరాడుతా. 9. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా.