లెంపలు వేసుకున్న ఫేస్బుక్
మనిలా: పొరపాటున చేసిన తప్పుకు ఫిలిప్పీన్స్ కు ఫేస్బుక్ క్షమాపణ చెప్పింది. ఫిలిప్పీన్స్ జాతీయ పతాకాన్ని తలక్రిందులు చూపించింది. జూన్ 12న ఫిలిప్పీన్స్ 118వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అభినందనల సందేశం పోస్ట్ చేసినప్పుడు ఈ తప్పు జరిగింది. చేసిన తప్పుకు ఫేస్బుక్ క్షమాపణ కోరింది.
'ఇదంతా కావాలని చేసింది కాదు. చేసిన తప్పుకు మన్నింపు అడుగుతున్నాం. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలను అనుసంధానం చేయాలన్న ఉద్దేశంతో శుభాకాంక్షలు తెలిపాం. అయితే పొరపాటున తప్పు దొర్లింద'ని ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫేస్బుక్ చేసిన పొరపాటు వెంటనే ఇంటర్నెట్ అంతా పాకిపోయింది.
ఫిలిప్పీన్స్ చట్టాల ప్రకారం యుద్ధ సమయంలో మాత్రమే జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేస్తారు. మామూలుగా అయితే నీలం రంగు పైన, ఎరుపు రంగు కిందివైపు ఉండేలా ఫిలిప్పీన్స్ జాతీయ పతాకం ఎగురువేస్తారు.