ఉమేశ్‌ను పించ్ హిట్టర్‌గా పంపిస్తా : కోహ్లి
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భారత పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. 'ఉమేశ్ ఆటతీరు చూస్తుంటే టెస్టుల్లో పించ్ హిట్టర్‌గా నెంబర్ 3వ స్థానంలో పంపించాలని ఉందని' కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది టెస్టు ఫార్మాట్లో పునరాగమనం చేసిన ఉమేశ్ బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌కు గాయంతో దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ నాలుగు టెస్టుల్లో 13.65 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ప్రారంభమైన తర్వాత కనీసం నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితా ప్రకారం ఉమేశ్ 23.1 సగటును నమోదు చేసి బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
ఇదంతా ఒకటైతే రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో 10 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. ఉమేశ్ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు ఉండగా, టెస్టు చరిత్రలో 30 పరుగులకు పైగా చేసిన ఆటగాళ్లలో 310 స్టైక్‌రేట్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ పేరిట ఉంది. అతను 11 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
'ఒకవేళ విదేశాల్లో హార్థిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా విఫలమైనా మేము ఐదుగురు బౌలర్లతో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఏడో స్థానం వరకు కీపర్‌తో పాటు అశ్విన్, జడేజాలు బ్యాటింగ్ చేయగల సమర్థులు. తాజాగా వీరికి ఉమేశ్ కూడా జతయ్యాడు. అతని ఆటతీరు చూస్తుంటే టెస్టుల్లో పించ్ హిట్టర్‌గా 3వ స్థానంలో పంపించాలని ఉందని' విరాట్ కోహ్లి నవ్వుతూ మీడియాకు తెలిపాడు. కాగా ఉమేశ్ న్యూజీలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు కీలకంగా మారే అవకాశం ఉంది. న్యూజీలాండ్‌తో టీమిండియా 5 టీ20, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది.