జూన్ 2లోగా రెండు వక్ఫ్ బోర్డులు
కేంద్ర అధికారుల బృందం వెల్లడి
మార్చి మొదటివారంలో విభజన పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్‌బోర్డు విభజన ప్రక్రియ కొలిక్కి వస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బోర్డులు ఏర్పాటు చేస్తామని కేంద్ర బృందం ప్రకటించింది. బుధవారం సచివాలయంలో కేంద్ర బృందం సభ్యులైన కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్, సంయుక్త కార్యదర్శి రాకేశ్ మోహన్, కార్యదర్శి పీకే శర్మ, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ప్రతినిధి అల్లాఉద్దీన్ తదితరులు తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేకకార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ఏపీ మైనార్టీ సంక్షేమం శాఖ కమిషనర్, వక్ఫ్‌బోర్డు ప్రత్యేక అధికారి షేక్ మహ్మద్ ఇక్బాల్, తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ ఎంజే అక్బర్, ఏపీఎంఎఫ్‌సీ ఎండీ ఎస్ఏ షుకూర్‌లతో సమావేశమై వక్ఫ్‌బోర్డు విభజనపై చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల్లో వక్ఫ్‌బోర్డు ఆస్తులు, ఆదాయ వనరులు, వ్యయాలు ఉద్యోగుల సంఖ్య తదితర వివరాలను సేకరించారు. విశాఖపట్నంలోని మదిని దర్గా భూముల పరిహారం సుమారు రూ.3 కోట్లకుపైగా హైదరాబాద్‌లో కొత్త హజ్‌హౌస్ నిర్మాణంలో, ఆంధ్ర ప్రాంత దర్గా ఆదాయ వనరులు సుమారు రూ.12 కోట్ల వరకు తెలంగాణలో వినియోగించడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు.
అనంతరం కేంద్రం బృందం ఉభయ రాష్ట్రాల అధికారులతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో చర్చలు జరిపారు. అభ్యంతరాల పరిష్కారానికి ఆయ న హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మైనార్టీ, వక్ఫ్‌బోర్డు శాఖాధికారులతో వక్ఫ్ విభజనపై చర్చలు దాదాపు పూర్తయ్యాయని ప్రకటించింది..త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించింది.