మారుతీ ఇక ఇండియాది కాదా!
న్యూఢిల్లీ: విస్తరణలో భాగంగా గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన తయారీ ప్లాంట్‌ను మాతృ సంస్థ సుజుకీ మోటార్(జపాన్)కు అప్పగించేందుకు మంగళవారం సమావేశమైన మారుతీ సుజుకీ బోర్డు నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సుజుకీ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను సుజుకీ మోటార్ ఏర్పాటు చేయనుంది. తొలి దశలో భాగంగా ఏడాదికి లక్ష కార్ల తయారీ సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజుకీ చెప్పారు.
ఆపై సామర్థ్యాన్ని 2.5 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో 7.5 లక్షల వాహన తయారీ సామర్థ్యాన్ని అందుకోనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌లోగా సుజుకీ గుజరాత్‌ను ఏర్పాటు చేస్తామని, ఇది అన్‌లిస్టెడ్ కంపెనీగా ఉంటుందని తెలిపారు.
లాభదాయకం!
గుజరాత్లో సామర్థ్య విస్తరణ కోసం మారుతీ 2011లో మేసానాకు దగ్గర్లో 700 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 250 కోట్లను వెచ్చించింది. ఇక్కడ రూ. 4,000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు 2012లో ప్రణాళికలు వేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు అనుకూలించక ప్లాంట్ యోచనను వాయిదా వేసింది. కాగా, సుజుకీ మోటార్... ఇటీవల 100% అనుబంధ కంపెనీ ద్వారా ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడంతో మారుతీ బోర్డు ఇందుకు అంగీకరించింది. స్థలాన్ని లీజుకి ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఈ ప్లాంట్‌లో మారుతీ కోసమే సుజుకీ గుజరాత్ సంస్థ వాహనాలను తయారు చేసి, తయారీ ధరకే మారుతీకి విక్రయిస్తుందని ఒసాము వివరించారు. దీంతో కంపెనీకి ఆర్థికపరమైన లబ్ది చేకూరుతుందని మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. తద్వారా అమ్మకాలు, మార్కెటింగ్, పరిశోధన, అభివృద్ధి వంటి కార్యకలాపాలను పటిష్టపరచుకునేందుకు వీలు చిక్కుతుందని చెప్పారు.
మార్కెట్లకు నచ్చలేదు...
క్యూ3 ఫలితాల తరువాత బీఎస్ఈలో మారుతీ షేరు ధర 2.5% పుంజుకుని రూ. 1,750కు చేరింది. అయితే గుజరాత్ ప్లాంట్ విషయాన్ని కంపెనీ వెల్లడించాక ఒక్కసారిగా 8%(రూ. 138) పతనమై రూ. 1,563 వద్ద ముగిసింది. ఒక దశలో కనిష్టంగా రూ. 1,541ను తాకింది.
నికర లాభం 36% అప్
మారుతీ సుజుకీ నికర లాభం క్యూ3లో 36% ఎగసి రూ. 681 కోట్లను తాకింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో రూ. 501 కోట్లను మాత్రమే ఆర్జించింది. అత్యధిక శాతం విడిభాగాలను స్థానికంగా తయారు చేయడం, విదే శీ మారక లాభాలు, వ్యయాల అదుపు లాభాల వృద్ధికి దోహదపడినట్లు కంపెనీ తెలిపింది. ఆదాయం మాత్రం 3% క్షీణించి రూ. 10,620 కోట్లకు చేరింది.