అంతా వట్టిదే
ముంబై: పొవాయిలో చౌక ఇళ్ల పథకం అంతా బోగసేనని తేలిపోయింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇదంతా వట్టిదేనని స్పష్టం చేయడం పొవాయి వాసులను నిర్వేదంలోకి నెట్టేసింది. ఆర్థికంగా వెనుకబడిన తమకు ప్రభుత్వం రూ.54 వేలకే సొంత ఫ్లాట్ ఇస్తుందన్న ఆశతో మంత్రాలయలో రోజంతా నిలబడి చేసుకున్న దరఖాస్తుకు విలువ లేదని తెలుసుకున్న స్థానికులు నిరాశ చెందారు.
ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించిన అతి తక్కువ ధరకే ఇళ్ల పథకం కింద రూ.54 వేలకే పొవాయిలో ఫ్లాట్లు లభిస్తుందన్న గంపెడాశతో మంత్రాలయానికి మంగళవారం వచ్చిన వందలాదిమంది దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి సమర్పించారు. దీని గురించి తెలుసుకున్న సీఎం కార్యాలయ వర్గం ప్రభుత్వం అటువంటి పథకాన్ని మంజూరుచేయలేదని వివరణ ఇచ్చింది. ఎవరో తప్పుదారి పట్టించడంతో ఇదంతా జరిగిందని పేర్కొంది.
అటువంటి పథకం మనుగడలో లేదని స్పష్టం చేసింది. అయినా కూడా రెండోరోజు బుధవారం కూడా అనేకమంది వచ్చి దరఖాస్తు చేసేందుకు ఎగబడ్డారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎంవో కార్యాలయం లేని పథకాన్ని ఉన్నట్టుగా చెప్పి పొవాయి వాసులను తప్పుదారి పట్టించడానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది. ‘1987 పొవాయి అభివృద్ధి పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తుందని తెలుసుకున్నాం. ఈ పథకం కింద హీరాంనందాని బిల్డర్స్ అభివృద్ధి చేసిన 400 చదరపు అడుగుల మేర నిర్మించిన మూడు వేల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నామ’ని సదరు ఫారమ్ పేర్కొంది.
హీరానందని కాంప్లెక్స్‌లో అపార్ట్మెంట్లు ఉన్నాయని తెలుసుకున్న పేదలు అతి చౌక ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్నారని కార్మిక నాయకుడు మిలింద్ రణడే తెలిపారు. ‘1986లో పట్టణ భూపరిమితి చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం పొవాయిలో 240 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దీనిని అభివృద్ధి చేసేందుకు ఎకరాకు రూ.40 పైసల చొప్పున డెవలపర్‌కు సర్కార్ లీజుకిచ్చింది. 400 చదరపు అడుగులు, 800 చదరపు అడుగుల పరిధిలో ఆధునిక ఫ్లాట్‌ను డెవలపర్ నిర్మించారు. వీటిలోనే 70 శాతం రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లను సంపన్నవర్గాల కోసం 1,200 నుంచి 5,000 చదరపు అడుగుల ఫ్లాట్లు నిర్మించడం వివాదాస్పదమైంది.
దీంతో రూ.135లకే చదరపు అడుగుల ధరకు 15 శాతం ఫ్లాట్లను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసింద’న్నారు. దీనినే ఆధారంగా చేసుకొని 400 చదరపు అడుగుల ప్లాట్లకు రూ.54వేల ధర సదరు ఫారమ్‌లపై ప్రచురణ అయి ఉందని రణడే వివరించారు. అయితే కొందరి చేతుల్లోనే భూమి, ఇళ్లు ఉండకుండా నిరోధించేందుకు 2007లో యూఎల్సీఏ చట్టాన్ని ప్రభుత్వం రద్దుచేసిందని రణడే గుర్తు చేశారు.