పెళ్లిళ్లు చేసే ప్రసన్నాంజనేయుడు
కల్యాణమస్తు
కల్యాణ క్షేత్రాలు
ప్రసన్నాంజనేయస్వామి చల్లని సన్నిధిలో ప్రతి సంవత్సరం వందలాది వివాహాలు. 1978లో ఒకే ముహూర్తానికి 85 వివాహాలు, 2006లో ఒక్కరోజు 120 వివాహాలు. ఆ తరువాత ప్రతి యేటా పెరుగుతున్న వివాహాలు.
ఆంజనేయ స్వామి బ్యాచిలర్ దేవుడు. బ్యాచిలర్స్‌కు దేవుడు. బ్రహ్మచర్యం పాటించేవారు తమను తాము ఆంజనేయస్వామికి ఫీజు చెల్లించని శిష్యులుగా చెప్పుకుంటారు. కాని ఈ స్వామి శింగరకొండపై పెళ్లిళ్లకు పురోహితుడవుతున్నాడు. ప్రధాన సాక్షి అవుతున్నాడు. తన చల్లని ఆశీస్సులతో వేలాది జంటల వైవాహిక జీవితానికి వారధి అవుతున్నాడు. ఆసక్తి గొలిపే ఈ క్షేత్రం ప్రకాశం జిల్లాలో ఉంది.
ప్రకాశం జిల్లాలోని అద్దంకి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో, అద్దంకి - నార్కెట్‌పల్లి హైవే పక్కనే శింగరకొండపై శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ఉంది. ఈ కొండకు కింద, ఉత్తర భాగంలో స్వయంభూగా వెలసిన శ్రీ సువర్చలా సహిత దక్షిణాభిముఖ ప్రసన్నాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ వివాహాలు చేసుకుంటే ఆ జంటపై స్వామి చల్లని చూపులుంటాయని ప్రతీతి. 1960 నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే వివాహాల సంఖ్యం పెరుగుతూనే ఉంది. ఈ స్వామికి పొంగలి నివేదన చేసి సిందూరం, తమలపాకులతో పూజ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. దేవస్థానానికి ఉత్తర భాగంలో భక్తులు స్నానం చేసేందుకు పవిత్ర పుష్కరిణిలా భవనాశి చెరువు ఉంది.
సింగరకొండ? శింగరకొండ?
సింగర అంటే సింహం అని అర్థం, ఇక్కడి కొండపైన లక్ష్మీ సమేత నరసింహ స్వామి కొలువై ఉంటాడు. నరసింహస్వామి కొలువైన కొండ (సింహం నివసించే కొండ) కాబట్టి దీన్ని సింగరకొండగా పిలుస్తారని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో సింగర.. శింగర అయింది.
స్థల పురాణం
శింగరకొండను పూర్వం నరసింహాద్రిగా పిలిచేవారని చరిత్ర చెబుతోంది. అగస్త్య మహాముని ఇక్కడే తపస్సు చేసి లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం పొందాడని చెబుతారు. ప్రసన్నాంజనేయ స్వామి విషయానికొస్తే 1896 సంవత్సరంలో కొండపై నరసింహస్వామి ఉత్సవం జరుగుతున్న సమయంలో భక్తులకు కొండకు ఉత్తరభాగంలో ఒక దివ్యమైన పురుషుడు సింధూర వర్ణంలో ఉన్న ఆంజనేయ స్వామికి పూజ చే స్తున్నట్లుగా కనిపించాడు. కిందకు దిగి చూడగా ఆ మహాపురుషుడు మాయమై అంజలి ఘటిస్తున్న ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. అందుకే ఈయన్ను స్వయంభువుగా కొలుస్తారు. ఆ తరువాత ఆదెమ్మ అనే భక్తురాలు చూపు కోల్పోయిన తన కుమారుణ్ణి స్వామి సన్నిధిలో ఉంచుకుని 11 సంవత్సరాలు పూజలు చేయగా కళ్లు వచ్చాయని చెబుతారు. ఆ విషయం ఆ నోట ఆనోట నలుదిశలా పాకి.. భక్తులు కోరిన కోర్కెలు నెరవేర్చే ప్రసన్నాంజనేయ స్వామిగా పేరు పొందాడు. ఆ ఆంజనేయస్వామి కొండపైన లక్ష్మీ నరసింహస్వామి కలిసి ఉండటంతో వారిద్దరి కరుణా కటాక్షాలు ఉండే క్షేత్రంలో వివాహం చేసుకుంటే తమ దాంపత్య జీవితం చల్లగా ఉంటుందనే భావనతో ఎందరో వధూవరులు ఇక్కడ వివాహాలు చేసుకుంటుంటారు. ఇక్కడకు రాష్ట్రం నలుమూలల నుంచి శనివారం, మంగళవారం విశేష సంఖ్యలో భక్తులు వచ్చి పొంగలి నైవేద్యం పెడతారు. మొక్కిన మొక్కులు తీరిన భక్తులచే స్వామివారికి గాలిగోపురాల నిర్మాణం జరిగిందంటే క్షేత్ర ప్రశస్త్యం గురించి మరింతగా చెప్పనవసరం లేదు. ప్రతి సంవత్సరం హోళికా పౌర్ణమి రోజుకు ఒక రోజు అటు ఇటుగా తిరుణాళ్ల మహోత్సవం జరుగుతుంది. దాదాపు 2 లక్షల మంది తిరునాళ్లలో కట్టే విద్యుత్ ప్రభలు, వాటిపై ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు చూడటానికి వస్తారు.
సువర్చలా పరిణయం
ఆంజనేయస్వామికి వివాహం లేదని కొందరి వాదన. వాల్మీకి రామాయణంలోనూ ఎక్కడా ఆంజనేయ స్వామి వివాహ ప్రసక్తి లేదు. అయితే ఆంజనేయ స్వామి వివాహ ప్రస్తావన పరాశర సంహితలో కనిపిస్తుంది. దాని ప్రకారం ఆంజనేయస్వామి నవ వ్యాకరణ పండితుడు. అంటే తొమ్మిది విధాల వ్యాకరణ పండితుడన్న మాట. అయితే ఆ విద్యను సూర్యుని వద్ద నేర్చుకునే సమయంలో మొదటి ఐదు వ్యాకరణాలు నేర్పిన తర్వాత సూర్యుడు మిగిలిన నాలుగు గృహస్తులకు మాత్రమే నేర్పుతానని చెప్తాడు. తన కుమార్తె సువర్చలను వివాహమాడితే గృహస్తుగా మారడమే కాకుండా ఆ విధంగా గురుదక్షిణ చెల్లించినవాడివి కూడా అవుతావని చెప్తాడు. అందుకు స్వామి బదులిస్తూ ‘నేను అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాను కనుక వివాహం ఎలా చేసుకోగలను’ అంటాడు. దీనికి విరుగుడుగా సూర్యుడు వ్రతభంగం కాని వరం ప్రసాదిస్తాడు. అంటే ఆమెను వివాహం చేసుకున్నా ఆమెతో శారీరక సంపర్కం లేకుంటే గృహస్తువే అవుతావు అంటాడు. అప్పుడు స్వామి ‘దీనికి సువర్చల ఒప్పుకుంటే వివాహానికి నేను సమ్మతమే’ అని అంగీకరిస్తాడు. స్వామి కోరికను సువర్చల మన్నించి వివాహం చేసుకుందనేది పురాణగాథ. వీలుకాని పరిస్థితుల్లో కూడా విజయవంతగా వివాహం చేసుకున్న ఈ దంపతుల సమక్షంలో పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితంలో ఏ ఆటంకాలు ఉండవని భక్తుల నమ్మిక. ఆ నమ్మికకు ఊతం ఇస్తూ అక్కడ దశాబ్దాలుగా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి.
- అడుసుమల్లి
సోమ శ్రీనివాసరావు సాక్షి ప్రతినిధి, అద్దంకి
ఎలా వెళ్లాలి?
బస్సు మార్గం: శింగరకొండకు బస్సులో చేరుకోవాలంటే రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మార్గాలున్నాయి విజయవాడ నుంచి అద్దంకి డిపోకు చేరుకుంటే అక్కడ నుంచి నేరుగా శింగరకొండకు బస్సులున్నాయి హైదరాబాదు నుంచి అయితే అద్దంకి- నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో ప్రయాణించి నేరుగా శింగ రకొండలో దిగవచ్చు. 278 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
రైలు మార్గం: విజయవాడ-చెన్నై రైలు మార్గంలో ఒంగోలు రైల్యే స్టేషన్ నుంచి శింగరకొండ 41 కి.మీ. దూరంలో ఉంది నరసరావుపేట, వినుకొండ, గుంటూరు, పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ల నుంచి శింగరకొండ సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
విమాన మార్గం: గన్నవరం విమానాశ్రయం నుంచి 155 కిలోమీటర్లు రేణిగుంట విమానాశ్రయం నుంచి 250 కిలోమీటర్లు దూరం ఉంటుంది.
బస: శింగరకొండలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన సత్రాలు ఉన్నాయి అదేవిధంగా మారుతి భవన్, దామరచర్ల గెస్ట్ హోస్లో సూట్లు అద్దెకు ఇస్తారు క్షేత్రంలో నిత్య అన్నదానం ఉంటుంది. శని, మంగళవారాల్లో 150 మందికి, మిగిలిన వారాల్లో రోజుకు 50 మందికి దేవస్థానం తరుఫున అన్నదానం చేస్తారు.