‘అమెజాన్ నౌ’ ఇప్పుడు ‘ప్రైమ్ నౌ’
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ తన గ్రోసరీ విభాగంపై అధికంగా ఫోకస్ చేస్తోంది. స్పీడ్ డెలివరీ అంశానికి ప్రాధాన్యమిస్తోంది. అందుకే తాజాగా తన ‘అమెజాన్ నౌ’ సర్వీస్‌ను ‘ప్రైమ్ నౌ’గా రీబ్రాండ్ చేసింది. గ్రోసరీ విభాగంలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు.. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ సంస్థలను ఎదుర్కొనేందుకు తాజా పండ్లు, కూరగాయలు, డెయిరీ ప్రొడక్టుల కోసం చిల్ చైన్‌లో పెట్టుబడులు కూడా పెట్టింది. మరొకవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా గ్రోసరీ విభాగంలోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండటంతో పోటీ రసవత్తరంగా మారనుంది.
అమెజాన్ తన ‘ప్రైమ్ నౌ’ సేవలను (యాప్ ఆధారిత సర్వీస్) ఇప్పుడు బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ప్రైమ్ నౌలో 10,000కుపైగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచాం. ఇందులో పండ్లు, కూరగాయలు, గ్రోసరీ, మాంసం వంటి వివిధ కేటగిరీలుంటాయి’ అని అమెజాన్.ఇన్ పేర్కొంది. ప్రైమ్ సభ్యులకు రెండు గంటల ఎక్స్‌ప్రెస్ డెలివరీ ఆప్షన్ అందుబాటులో ఉందని తెలియజేసింది. ఇతర కస్టమర్లు అదే రోజు లేదా తర్వాతి రోజున డెలివరీ పొందొచ్చని తెలిపింది.