ప్రిన్సిపాల్ ప్రోద్బలంతోనే ర్యాగింగ్
సాక్షి, హైదరాబాద్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే వారిని కంటికి రెప్పలా కాపాడుతోంది. దోషులెవరో తేల్చినా చర్యలకు సిద్ధంగా లేదు. రిషితేశ్వరి మరణంపై విచారణ చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు వ్యవహారశైలిని తప్పుపట్టింది. ఆయనపై విచారణ జరపాలని ప్రభుత్వానికి నివేదించింది. బాబూరావు వల్లే విశ్వవిద్యాలయంలో సంస్కృతి చెడిపోయిందని, ర్యాగింగ్ వంటి అనేక దుస్సంఘటనలకు అతడే కారణమని తేల్చింది.
కమిటీ తేల్చిన అంశాల్లో కొన్ని...
వర్సిటీలో సంస్కృతిని చెడిపోవడానికి ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ జి.బాబూరావు కారణం. బాబూరావు ర్యాగింగ్‌కు వీలుగా సీనియర్ విద్యార్థులను ప్రోత్సహించే వారు. బాబూరావు తమతో చనువుగా ఉండడం వల్లే సీనియర్ విద్యార్థులు జూనియర్లపై చెలరేగిపోయారు. దుస్తులు లేకుండా తమ ముందు డ్యాన్స్ చేయాలంటూ సీనియర్లు జూనియర్లను వేధించేవారు. జూనియర్ విద్యార్థినుల ఫోన్‌నంబర్లను సీనియర్ విద్యార్థినులు సహచర సీనియర్ విద్యార్థులకు ఇచ్చేవారు. రాత్రిపూట వారితో మాట్లాడాలంటూ జూనియర్లను వేధించేవారు.
బస్టాండ్లలో, ఆర్టీసీ బస్సుల్లో ర్యాగింగ్ పెచ్చుమీరింది. రిషితేశ్వరితో సహ ఆమె సహచర జూనియర్ విద్యార్థినులను సీనియర్ విద్యార్థినులు రూ ములు ఖాళీ చేయాలంటూ బయటకు గెంటేసి రాత్రి వేళల్లో ఆరుబయటే నిల్చోబెట్టేవారు. ఫ్రెషర్స్ డే (18-4-2015)ను వర్సిటీలో కాకుండా బయట హాయ్లాండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బాబూరావు మద్యం సేవించి, విద్యార్థినులతో కలసి చిందులేశాడు.
(కమిటీ వద్ద వీడియో ఫుటేజీని ఉంది) రిషితేశ్వరి ఆత్మహత్య గురించి ఉన్నతాధికారులకు తెలియచేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యత కాగా బాబూరావు వాటిని విస్మరించాడు. బాబూరావు ప్రవర్తనపై విచారణ జరపాలి. ఆయనపై ర్యాగింగ్ నిరోధక చట్టం పరిధిలో కేసు నమోదు చేసి విచారించాలి. ఈ కేసును ర్యాగింగ్ చట్టాల పరిధిలోనే కాకుండా క్రిమినల్ లా, మహిళా వేధింపుల చట్టాల కింద విచారణ చేపట్టాలి. ఈ కేసు ప్రాధాన్యత దష్ట్యా విచారణను త్వరితంగా పూర్తిచేసేందుకు ట్రయల్ కోర్టును, స్పెషల్ పీపీని నియమించాలి.