సెంట్రల్ జైలులో ఉగ్రవాదుల బీభత్సం
దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగినవాటిలో ఒకటైన పుళల్ సెంట్రల్ జైలులో అల్ ఉమా ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ముగ్గురు ఉన్నతాధికారులను తీవ్రంగా కొట్టి, మరో ఇద్దరినీ బందీలుగా చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో జైళ్లలో ఉగ్రవాద ఖైదీల ప్రవర్తనా తీరు మరోసారి చర్యనీయాంశంగా మారింది.
హిందూ ఆలయాలే లక్ష్యంగా కోయంబత్తూరు సహా తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు పాల్పడి, అరెస్టయ్యి ప్రస్తుతం పుళల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అల్- ఉమా ఉగ్రవాదులకు, జైలు సిబ్బందికి జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అల్- ఉమా కీలక నేత ఫక్రుద్దీన్ అలియాస్ పోలీస్ ఫక్రుద్దీన్ కోసం అతడి బంధువులు బయటి నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను జైలులోకి అనుమతించబోమని అధికాలులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ ఫక్రుద్దీన్ సహా అతని అనుచరులు పన్నా ఇస్మాయిల్, బిలాల్ మాలిక్, ఇంకొందరు ఆదందోళనకు దిగారు.
ముత్తుమణి, రవి మోహన్, సెల్విన్ దేవదాస్ అనే ముగ్గురు వార్డెన్లను ఉగ్రవాదులు చితకబాదారు. ఆ తరువాత అసిస్టెంట్ జైలర్ కుమార్, మరో వార్డెన్ మారీలను తమ బ్యారెక్ లోనే బందీలుగా చేసుకున్నారు. 'వీళ్లను విడిచిపెట్టాలంటే మా లాయర్లతో మాట్లాడించాలి' అని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులంతా జైలు వద్దకు చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటల హైడ్రామా అనంతరం ఉగ్రవాదులు.. బందీలను విడిచిపెట్టారు. తీవ్రంగా గాయపడిన సిబ్బందిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారని తమిళనాడు జైళ్ల శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జె.కె. తిరుపతి చెప్పారు. కొయంబత్తూరులో పేలుళ్ల అనంతరం ప్రధాన నిందితులు నలుగురూ ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరులో ఓ ఇంట్లో తలదాచుకోవటం, కార్డన్ అండ్ సెర్చ్ లో పోలీసులకు పట్టుబడటం తెలిసిందే.