Private school hostel
-
కరోనా: ఫీజు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తాం!
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల తాత్కాలిక మూసివేతకు మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫీజు చెల్లిస్తేనే విద్యార్థిని ఇంటికి పంపిస్తామని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం డిమాండ్ చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండల కేంద్రానికి చెందిన కూచనపల్లి గణేశ్-శ్రీదేవి దంపతుల కూతురు శృతి. జమ్మికుంట పట్టణంలోని న్యూమిలీనియం స్కూల్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. పాఠశాలల వేసివేత నేపథ్యంలో తమ కూతురును ఇంటికి తీసుకెళ్లేందుకు గణేశ్–శ్రీదేవి దంపతులు బుధవారం స్కూల్‌కు వచ్చారు. అయితే ఫీజు రూ. 20 వేలు చెల్లిస్తేనే శృతిని ఇంటికి పంపిస్తామని యాజమాన్యం తేల్చి చెప్పడంతో ఇంటిదారి పట్టారు. గురువారం మళ్లీ పాఠశాలకు రాగా, యాజమాన్యం అలాగే చెప్పడంతో తమ వద్ద అంత డబ్బు లేదని బాధితులు చెప్పినా వినిపించుకోలేదు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు బాధితులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. ఎస్సై ప్రవీణ్‌రాజ్ పాఠశాల వద్దకు చేరుకుని ఇరువురితో మాట్లాడడంతో యాజమాన్యం విద్యార్థినిని ఇంటికి పంపిచేందుకు అంగీకరించింది. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బత్తుల రాజు, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు కారంకొండ శ్రావణ్‌కుమార్, శివకుమార్, కొల్లూరి ప్రశాంత్, కల్లపెళ్లి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
భీమవరంలో 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఊరేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో సోమవారం చోటుచేసుకుంది. హాస్టల్ రూం నుంచి విద్యార్థిని ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దాంతో హాస్టల్ యాజమాన్యం హాస్టల్ రూం తలుపు పగలగొట్టారు. ఊరేసుకుని కనిపించిన విద్యార్థిని మృతదేహాన్ని చూసి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని బీహార్‌కు చెందిన కీర్తికుమారిగా గుర్తించారు. అయితే కీర్తి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
కల్తీ ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత
తొర్రూరు టౌన్ : కల్తీ ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం తొర్రూరులోని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్లో చోటుచేసుకుంది. ఉదయం 7 గంటలకు విద్యార్థులకు టిఫిన్ పెట్టారు. కొంత సమయానికి ఐదుగురు విద్యార్థులకు విరేచనాలు మొదలయ్యాయి. వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాత్రి భోజనం వల్లే విరేచనాలవుతున్నాయని డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. వీరితోపాటు మరో ఏడుగురికి కూడా అవే లక్షణాలు కని పించడంతో వెంటనే హాస్టల్లోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఈఓ డాక్టర్ రవీందర్‌రెడ్డి హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్జేడీ, డీఈఓకు సమాచారం అందించారు. ఉదయం అందించిన టిఫిన్, నీటి శాంపిళ్లను పరీక్ష నిమిత్తం పంపించనున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, నాణ్యమైన ఆహారం అందించాలని యాజమాన్యానికి సూచించారు.