ఈ పొలాలే లేకుంటే.. ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలి?
రాజధాని రైతులకు ఎమ్మెల్యే ఆర్కే బాసట ...
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పంట నిషేధంపై మంగళగిరి
ఎమ్మెల్యే ఆర్కే గురువారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు.
రైతులు, వ్యవసాయ కూలీలతో కలసి పొలం పనులు చేశారు.
కూలీల్లో ఒకరై ఉల్లిపాయల గంపలు, టిక్కీలు, అరటి గెలలు మోశారు.
ఉల్లిపాయలలోడు లారీ నడిపారు. గేదెల వద్ద పనిచేశారు.
తానూ రైతునేనని, వికృత పోకడలు పోతున్న ప్రభుత్వంపై కలసికట్టుగా పోరాడదామని రైతులు, కూలీల్లో మనోధైర్యం నింపారు.
మంగళగిరి/తాడేపల్లి రూరల్ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ప్రస్తుత పంటతో ఆపేయాలని ప్రకటించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) గురువారం వినూత్న నిరసన తెలిపారు. తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో, మంగళగిరి మండలం నిడమర్రు, కురగల్లు, బేతపూడి గ్రామాల్లో ఆయన పర్యటించి రైతులు, వ్యవసాయ కూలీలతో కలిసి పొలం పనుల చేశారు. కూలీల్లో ఒకరై ఉల్లిపాయ టిక్కీలు, గంపలు మోసారు. అరటి గెలలు భుజానికి ఎత్తి, ఉల్లిపాయ లోడుతో వెళ్తున్న లారీని నడిపారు. గేదెలకు ఆహారాన్ని అందించారు. తాను రైతు కుటుంబానికి చెందిన వాడినే అని, కూలీలతో మమేకమై వారి అభిప్రాయాలును, ఆవేదనని పంచుకున్నారు.
‘మాకు పొలం పనులు, పూలు కోయడం తప్ప మరో పని తెలీదు. కూలోనాలో చేసుకుని ఆత్మామాభిమానంతో ప్రశాంత జీవితాలు గడుడపుతున్నాం.. ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం భూములను లాక్కుంటే తాము మరోచోటకు వలస వె ళ్లి బతకలేం..’ అని నిడమర్రు, కురగల్లు, బేతపూడి రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంకా తమ ఆవేదనను ఇలా పంచుకున్నారు..
పొలాన్ని నమ్ముకుని బతుకుతున్నాం..
మేము తరతరాలు నుంచి పొలాన్ని నమ్ముకుని బతుకుతున్నాం. మాకు పూలు కోయడం తప్ప మరో పని తెలీదు. తెల్లవారుజామున నాలుగ్గంటలకు లేచి పిల్లలకు వంట చేసి క్యారేజీలు పెట్టుకుని వస్తాం. రోజుకు నాలుగైదువందలు సంపాందించుకుంటూ పిల్లలను చదివించుకుంటూ జీవిస్తున్నాము. మాకు రుణమాఫీ వద్దు.. డ్వాక్రా రుణాలు వద్దు.. మా భూములను వదిలిపెడితే చాలు. ఒక వేళ కాదని భూములును లాక్కుంటే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాల్సిందే. చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సిందే.
- కొప్పుల సాంబ్రాజ్యం, బేతపూడి
ఎట్టా బతకాలి..
పూలతోటలో కూలీకి వెళితే వచ్చే సంపాదనపై ఆరుగురం బతుకుతూ పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఏదైనా ఇబ్బంది అయితే రైతులు ఆదుకుంటారు. ఎందుకంటే మరలా కూలీ చేసైనా తీరుస్తారనే నమ్మకం. వారి పొలాలే పోతే వారితో పాటు మేమెలా బతకాలి.
- సంకూరు సబ్బులు, రైతు కూలీ, నిడమర్రు
ఇలా అనుకుంటే వాళ్లకు ఓటేసేవాళ్లమే కాదు..
పొలాలను రైతులు ఇచ్చినా మేము ఒప్పుకోం. ఉదయం నాలుగుగంటలకు లేచి వంట చేసుకుని వచ్చి కూలీ చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాము. పొలాలు ఇచ్చే రైతులకు ఇక నుంచి కూలీకి పోబోం. ఇలాంటి మోసం చేస్తాడనుకంటే ఓటు వేసేవాళ్లమే కాదు. కాదు. తెలుగుదేశం నాయకులు కాని కార్యకర్తలు కాని గ్రామాల్లో తిరగనియ్యకుండా చేయాలి.
- పార్వతి, రైతు కూలీ, కురగల్లు
ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి..
మూడెకరాలు కౌలుకు చేస్తూ మా కుటుంబంతోపాటు మరి కొంతమంది పొలంపై బతుకుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం భూములు తీసుకుంటే ఎలా బతకాలి. 365 రోజు లు పంటలు పండే పొలాలపై కూలీ చేసుకుని ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. ఇక పొలాలు లేకపోతే ఎలా బతకాలి..?
- కర్నాటి నాగమణి, కౌలు రైతు, కురగల్లు
మూడునెలల నుంచి నిద్ర లేదు..
రెండకరాల పొలంలో పూలతోట వేసి మాతో పాటు పది కుటుంబాలవాళ్లం బతుకుతున్నాం. పొలాలు పోతే ఏం చేసి బతుకుతాం. చంద్రబాబు మా భూములు తీసుకుని మాకు పరిహారం ఇచ్చేది ఏంటి. ఈ పొలాలను వదిలిపెట్టి రాజధాని కట్టుకుని పరిహారం ఎంతకావాలో అడిగితే మేమే ఇస్తాం. మూడు నెలల నుంచి నిద్రాహారాలు లేకుండా బతుకుతున్నాం.
- ఒగ్గు వెంకటరత్నం, రైతు, నిడమర్రు