రాజధాని ప్రాంతంలో జపాన్ బృందం ఏరియల్ సర్వే
విజయవాడ : గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో జపాన్ బృందం బుధవారం ఏరియల్ సర్వే చేసింది. తొలుత కృష్ణా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బృంద సభ్యులు పర్యటించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించినట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జపాన్ పారిశ్రామిక వేత్తల బృంద సభ్యులు మూడు దశల్లో పర్యటించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టిన అంశాలను సమగ్రంగా వివరించామన్నారు. ఈ పర్యటనపై జపాన్ ఆర్థిక మంత్రి ఆకియో ఇసోమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారని కలెక్టర్ తెలిపారు.
ఏరియల్ పరిశీలనలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతోపాటు జపాన్ ఎంబసీలు ఏకియో ఇసోమోటా, టోమో పూమి, పుకామియా, ప్యూజి ఎలక్ట్రానిక్స్‌కు చెందిన టోమో యూకి కవాగోయి, హిటాచి మపాయోఫి తముర, జె.ఆర్.ఐ కిమిహికో, టకా మల్సూ, శంకర్ నారాయణ, హిటాచి జోసిన్, హిచిరో ఎబిఐ జెట్రో, హిరోషి హషి మోటో, కజిమా పర్యటించారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ, గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, ఢిల్లీలోని ఎ.పి.భవన్ రెసిడెంట్ కమిషనర్ వీణా ఈష్, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ గంధం చంద్రుడు,సబ్ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ ఎల్. శివశంకర్ తదితరులు ఉన్నారు. అనంతరం బృందం సభ్యులుగన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లారు.