నేడు పీఎస్ఎల్వీ సీ28 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఇస్రో శుక్రవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్ఎల్వీ-సీ28 రాకెట్‌ను ప్రయోగించనుంది. ప్రయోగానికి బుధవారం ఉదయం 7.58 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. బుధవారం రాకెట్ మొదటి దశలో ఘనఇంధనం నింపారు. గురువారం ఉదయం నుంచి రాకెట్‌లోని సాంకేతిక వ్యవస్థలను పరీక్షిస్తున్నారు. ప్రయోగాన్ని మొత్తం 19.26 నిమిషాల్లో పూర్తి చేసేలా శాస్త్రవేత్తలు లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు.
విపత్తుల నిర్వహణ, భూ ఉపరితల పరిశీలన, వనరుల అధ్యయనం కోసం గాను బ్రిటన్‌కు చెందిన సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్(ఎస్ఎస్టీఎల్) రూపొందించిన ఐదు ఉపగ్రహాలను ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ సీ28 రాకెట్ నింగికి చేర్చనుంది.